కలబందతో చుండ్రు మాయం

ఆంధ్రజ్యోతి, 10-09-2018: కలబందను చర్మ సంరక్షణకే కాకుండా కేశ సంరక్షణలోనూ వాడొచ్చు. కలబంద గుజ్జుతో జుట్టు ఒత్తుగా పెరగడమే కాదు, చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. కలబంద గుజ్జులోని ఎంజైమ్‌లు జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. కలబందలో గుజ్జులో 96 శాతం పైగా నీరు ఉంటుంది. అమైనో ఆమ్లాలు, ఏ, బి, సి, ఇ విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి తల మీద చర్మాన్ని డిహైడ్రేషన్‌కు లోనవకుండా చూస్తాయి.

జుట్టు పెరగడానికి: కలబంద గుజ్జులో ప్రొటియోలైటిక్‌ ఎంజైమ్స్‌ ఉంటాయి. ఇవి జుట్టు పెరగడంలో సహాయపడతాయి. టేబుల్‌ స్పూను కలబంద గుజ్జుకు, పావు కప్పు బాదం నూనె, గుడ్డు పచ్చసొన, పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి కొద్దిసేపు మర్ధన చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఒత్తుగా పెరుగుతుంది కూడా.

చుండ్రు సమస్యకు: కలబందలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు చుండ్రును తొలగిస్తాయి. రెండు టేబుల్‌ స్పూన్ల కలబంద రసంలో, టేబుల్‌ స్పూను తేనె, రెండు టేబుల్‌ స్పూన్ల యోగర్ట్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని 15 నిమిషాల తర్వాత షాంపూతో కడగాలి. రెండు టేబుల్‌ స్పూన్ల కలబంద రసంలో, 10 చుక్కల వేపనూనె వేసి జుట్టుకు పట్టించినా చుండ్రు తగ్గుతుంది.