ఉప్పు కలిపిన షాంపూతో..

ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 24: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టుకు సంబంధించిన సమస్యలు జుట్టును పట్టి వదలడం లేదా? అయితే ఉప్పు కలిపిన షాంపూ వాడి చూడండి. 
 
సముద్రపు ఉప్పు(సీ సాల్ట్‌)) జుట్టు పెరుగుదలకు సాయపడుతుంది. జుట్టు తెగ ఊడిపోతుందని బాధపడే వాళ్లు సీ సాల్ట్‌ ట్రీట్‌మెంట్‌ ప్రయత్నించాలి. తలస్నానం చేశాక ఒక టేబుల్‌ స్పూను సీ సాల్ట్‌ను మాడు పై పదినిమిషాలు మర్దన చేయాలి. ఆ తరువాత మళ్లీ తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే నెల రోజుల్లో తేడా కనిపిస్తుంది.
 
రక్త ప్రసరణ సరిగా లేకపోవడమే చుండ్రు ఏర్పడేందుకు కారణం. సముద్రపు ఉప్పు రక్తప్రసరణ జరిగేలా చేస్తుంది. జుట్టును కొన్ని భాగాలుగా విడదీసి ఉప్పును మాడు మీద చల్లాలి. పది నుంచి పదిహేను నిమిషాలు మర్దన చేసి, తరువాత తలస్నానం చేయాలి.
 
కొందరికి మాడు, జుట్టు పైన జిడ్డుగా ఉంటుంది. ఇందుకు కారణం సెబేషియస్‌ గ్రంధుల స్రావం. ఈ సమస్యకు ఉప్పుతో చెక్‌ పెట్టొచ్చు. రెండు టేబుల్‌ స్పూన్ల ఉప్పును, తలకు వాడేంత షాంపూలో వేసి బాగా కలపాలి. దీంతో మాడు, జుట్టును శుభ్రం చేయాలి.