మెదడు ఆరోగ్యానికి పుట్టగొడుగులు...

ఆంధ్రజ్యోతి ( 27-01-2017 ): పుట్టగొడుగులు తరచూ తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుందట. ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇవి సెరబ్రల్‌ నరాల పెరుగుదలను వృద్ధిచేయడమే కాకుండా డిమెన్షియా, అల్జీమర్స్‌ వంటి మెదడుకు సంబంధించిన అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయట. కొన్ని తినదగిన, అలాగే మెడిసినల్‌ పుట్టగొడుగుల్లో బయోయాక్టివ్‌ కాంపౌండ్స్‌ ఉంటాయి. అవి బ్రెయిన్‌లోని నరాల పెరుగుదలకు సహకరించే అవకాశం ఉంది. అంతేకాదు డిమెన్షియా, అల్జీమర్స్‌ జబ్బులకు కారణమైన న్యూరోటాక్సిక్‌ స్టిమ్యులీ నుంచి కూడా ఇవి కాపాడుతాయి. మలేషియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మలయకు చెందిన శాస్త్రవేత్తలు తినేవి, వైద్య సంబంధమైన పుట్టగొడుగుల ఆరోగ్య లాభాల గురించి పరిశోధనలు చేశారు. 2020 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియా, అల్జీమర్స్‌ వ్యాధుల బారిన పడేవారి సంఖ్య 42 మిలియన్ల వరకూ ఉండొచ్చని కూడా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. న్యూరో డిజనరేటివ్‌ జబ్బులను తగ్గించే ఆహారం మీద పరిశోధనలు చాలా తక్కువగా జరగడాన్ని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రతి పుట్టగొడుగు నెర్వ్‌ గ్రోత ఫేక్టోర్‌ (ఎన్‌జిఎఫ్‌) ఉత్పత్తిని పెంచుతుంది. ఈ ‘ఎన్‌జిఎఫ్‌’ అనేది ఒక మాలిక్యూల్‌. ఇది బ్రెయిన్‌లోని కొన్ని కణాల పెరుగుదలను క్రమబద్ధీకరించడంతోపాటు వాటి సమీకరణకు, నిర్వహణకు, జీవనానికి సహాయపడుతుంది. అందుకే నిత్యం డైట్‌లో పుట్టగొడుగులు ఉండేట్టు చూసుకోమని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు.