ఆకలి పెరిగేదెలా?

22-07-2017: నా వయస్సు 37 సంవత్సరాలు. కొంత కాలంగా క్షయ వ్యాధితో బాధపడుతున్నాను. బరువు కూడా చాలా తగ్గాను. నెల రోజులుగా టి.బి. మందులు వాడుతున్నాను. అయితే ఆకలి బాగా తగ్గిపోయింది. ఆకలి బాగా పెరగడానికి ఆయుర్వేదంలో మందులు ఉంటే సూచించండి?
- మాధవరావు, రాయచోటి
 
క్షయ వ్యాధి బారినపడిన వారు బలవర్దకమైన ఆహారం తీసుకోవాలి. జీర్ణశక్తి సరిగ్గా ఉన్నప్పుడే ఆకలి బాగా ఉంటుంది. ఇందుకోసం మీరు మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. రోజూ ఒక బత్తాయి పండు తినాలి. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌ తింటే మంచి ఫలితం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు శొంఠి చూర్ణం, సైంధవ లవణం రెండూ కలిపి భోజనానికి పావుగంట ముందు ఒక అర చెంచా తీసుకోవాలి. దీనివల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. చ్యవన్‌ప్రాశ్‌ వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఏమైనా మీరు టీబీ మందులు వాడుతున్నారు కాబట్టి ఒకసారి ఆయుర్వేద వైద్యుణ్ణి కలిసి సలహా తీసుకోవడం మంచిది.
- డా. విఠల్‌రావు, ఆయుర్వేద వైద్యనిపుణులు