చలువను పెంచే బొప్పాయి...

ఆంధ్రజ్యోతి, 27-04-2018: తియ్యగా రుచిగా ఉంటుంది బొప్పాయి. చలువ చేసి నీరు పెంచి శరీరతత్వాన్ని మారుస్తుంది. రక్తస్రావం, రక్తంపడే మూలవ్యాధి, మూత్రద్వారంలో పుట్టినపుండ్లను నివారిస్తుంది. బొప్పాయిపండు ఆలస్యంగా జీర్ణం అవుతుంది. కప్ప, వాతాలను పెంచుతుంది. కడుపు నిండి ఉన్నప్పుడు ఇది తినకూడదు. దీనికి విరుగుడు సొంఠి, మిరియాల చూర్ణం.

ఉపయోగాలెన్నో.. 
  • ఎండాకాలంలో శరీరం పేలుతున్న వారు, బాగా పండిన బొప్పాయి గుజ్జును శరీరానికి లేపనంగా రాసి ఆరిన తరువాత స్నానం చేస్తే పేలడం తగ్గుతుంది. 
  • కడుపులో క్రీములు చేరుకున్న వారు బొప్పాయి గింజల చూర్ణం ను ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకుంటే క్రీములు చనిపోతాయి. పచ్చి బొప్పాయి ముక్కలపై కొంచెం పటిక బెల్లం కలిపి తింటే కడుపులోని క్రీములు నశిస్తాయి. 
  • పచ్చి బొప్పాయి కాయను చెక్కతో గీరాలి. లోహపుతో గీరవద్దు. తెల్లని పాలు స్రవిస్తాయి. గాయంపై ఈ పాలు పోస్తే గాయాలు త్వరగా మానుతాయి. 
  • పచ్చి బొప్పాయి కాయపై చెక్కు తీసివేసి అందులోని కండను చిన్న ముక్కలుగా కోసి దానిపై సరిపడినంత ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడిలను చల్లి నిమ్మరసం పిండాలి. వాటిని సేవిస్తే అజీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి. నులి పురుగులు, ఎలుకపాములు నశిస్తాయి. మలేరియా నివారణకు ఉపయోగపడుతుంది. పాలిచ్చే తల్లులకు పాలు వృద్ధి చెందుతాయి. 
  • భోజనానంతరం బొప్పాయి పండు ముక్కలు తింటే జీర్ణం అవుతుంది. మలబద్ధకం నివారిస్తుంది. 
  • బొప్పాయి శక్తినివ్వడంతో పాటు చలువ చేస్తుంది. పండిన బొప్పాయి ముక్కలలో తేనె, పాలు కలిపిన మిశ్రమం ఎంతో బలవర్థకమైన టానిక్‌ వంటిది. ఇది తింటే గుండె, నరాలు సబంధిత వ్యాధులు ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. 
  • బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. కొందరి అనుభవం ప్రకారం వేడి చేసి అబార్షన్‌ చేస్తుందని అంటారు. అందుకని గర్భిణులు నాలుగైదు నెలలు బొప్పాయి పండు తినకపోవడం మంచిది. 
  • మొలలు, మూల వ్యాధి, లివర్‌, చర్మవ్యాధులతో బాధపడేవారికి బొప్పాయి మేలు చేస్తుంది. శరీరంపై మచ్చలు, గాట్లు బొప్పాయి ముక్కతో రుద్దితే మామూలు స్థితికి వస్తుంది.