గుడ్డు పెంకు వెరీగుడ్!

ఆంధ్రజ్యోతి, 28-02-2018: గుడ్డు సంపూర్ణ పోషకాహారం అన్న సంగతి తెలిసిందే! గుడ్డులోని సొనను మాత్రమే తీసుకుంటారు తప్ప పై పెంకును పడేస్తుంటారు. దాన్ని పనికిరాని పదార్థంగా భావిస్తారు. పనికిరాదు అనుకున్న దానిలోనే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి అంటున్నారు అధ్యయనకారులు. మామూలు పదార్థాలలో కన్నా గుడ్డు పెంకులోనే కాల్షియం చాలా ఎక్కువగా లభిస్తుంది. ఒక గుడ్డు పెంకులో వెయ్యి నుంచి పదిహేను వందల మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. ఎముకలు, దంతాల గట్టిదనానికి కాల్షియం అత్యవసరం అన్న విషయాన్ని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇంత పెద్ద మొత్తంలో కాల్షియం లభించే గుడ్డు పెంకును నేరుగా తీసుకోకూడదనీ, దాన్ని పొడచేసి నీటి ద్వారా మాత్రమే తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో దంతక్షయం నివారించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని వారు స్పష్టం చేస్తున్నారు.