టమోటాలు... తినచ్చా?.. నీళ్ళు... తాగచ్చా?

16-04-2019: మూత్రపిండాలు, వాటి రుగ్మతలు, చికిత్సల గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. చివరి దశ వరకూ ఎలాంటి వ్యాధి లక్షణాలనూ బయల్పరచని మూత్రపిండాల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే, క్రమం తప్పకుండా రక్త, మూత్ర పరీక్షలు చేయించుకుంటూ అనవసరపు అపోహలను వదిలేయాలి.
 
అపోహ: సీరం క్రియాటిన్‌ లెవల్‌ సాధారణం కన్నా ఎక్కువే ఉంది. అయినా ఆరోగ్యంగానే ఉన్నాను. కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరమేమీ లేదు.
వాస్తవం: సీరం క్రియాటిన్‌ ఏ కొంచెం పెరిగినా, ఉదాహరణకు 1.5 ఎం.జి/డి.ఎల్‌ కు చేరినా అప్పటికే కిడ్నీ పనితీరులో 50 శాతం నష్టం జరిగిందని అర్థం. వ్యాధి లక్షణాలేమీ కనిపించడం లేదని నిశ్చింతగా ఉండిపోకూడదు. తరచూ పరీక్షలు చేయించుకుంటూ, ఆహార నియంత్రణతో పాటు, రక్తపోటు, డీ-హైడ్రేషన్‌ను నియంత్రణలో ఉంచడం కోసం అవసరమైన మందులు వాడాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే, డయాలసిస్‌ పరిస్థితిని దూరంగా ఉంచవచ్చు.
 
అపోహ: కిడ్నీ రోగులు మాంసకృత్తులు పూర్తిగా మానేయాలి.
వాస్తవం: పూర్తి మాంసకృత్తులతో కూడిన ఆహారం కి డ్నీ రోగులు తీసుకోకూడదు. తీవ్రమైన పోషకాహార లోపం ఉన్నవాళ్లు, ప్రొటీన్‌ తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవచ్చు.
 
అపోహ: టొమాటోలు ఆహారంగా తీసుకోకూడదు.
వాస్తవం: కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య ఉన్నవాళ్లు మాత్రమే టొమాటో తినకూడదు. పొటాషియం మరీ ఎక్కువేమీ లేకపోతే, కి డ్నీ రోగులు టమోటాలను ఆహారంగా తీసుకోవచ్చు.
 
అపోహ: నీళ్లు తక్కువగా తాగాలి.
వాస్తవం: కిడ్నీ వ్యాధితో శరీరంలో వాపు ఏర్పడి ఉంటే, నీళ్లు తాగే మోతాదును బాగా తగ్గించాలి. వాళ్లు ఎన్ని నీళ్లు తాగాలి అనేది రోగి మూత్ర పరిమాణాన్ని బట్టి ఉంటుంది.
 
అపోహ: రక్తపోటు సమస్య, మందులతోనే పూర్తిగా అదుపులోకి వస్తుంది. 
వాస్తవం: కేవలం మందులతో అధిక రక్తపోటు ఎప్పుడూ అదుపులోకి రాదు. ఆహారంలో ఉప్పును నియంత్రించడం కూడా అంతే ముఖ్యం.
 
అపోహ: హాస్పిటల్‌ వెళ్లి రక్తపోటు పరీక్ష చేయించాలి..
వాస్తవం: హాస్పిటల్‌ పరిసరాలను చూడగానే కొంతమంది ఒత్తిడికి గురవుతారు. తద్వారా రక్తపోటు పెరుగుతుంది. అందువల్ల ఆటోమేటిక్‌ బి.పి. మెషిన్‌తో ఇంటివద్దే చెక్‌ చేసుకోవడం మేలు. ఇంటి వద్ద మెషిన్‌ ఉండడం వల్ల ఎప్పుడైనా బి.పి చెక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. కొంత మందిలో రోగి భంగిమను బట్టి రక్తపోటు మారుతూ ఉంటుంది. అందువల్ల రోగిని పడుకోబెట్టి, నిలబెట్టి కూడా రక్తపోటును పరీక్షించాలి.
 
అపోహ: ఒకసారి డయాలసిస్‌ ప్రారంభమైతే, ఇక జీవితాంతం కొనసాగించాలి.
వాస్తవం: ఏ కారణంగానైనా కిడ్నీకి బలంగా గాయమై విఫలమైనప్పుడు, కిడ్నీ తిరిగి కోలుకునే దాకా తాత్కాలిక డయాలసిస్‌ అవసరమవుతుంది. ఒకవేళ దీర్ఘకాల వ్యాధితో కిడ్నీ దెబ్బతిని ఉంటే, వైద్య చికిత్సలతో అది కోలుకోకపోతే, జీవితాంతం డయాలసిస్‌ అవసరమవుతుంది.
 
 
డాక్టర్‌ తరుణ్‌ కుమార్‌ సాహా,
సీనియర్‌ కన్సల్టెంట్‌, నెఫ్రాలజిస్ట్‌, ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌,
అపోలో హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌.