ఆమ్‌ కా పన్నా

ఆంధ్రజ్యోతి, 24-04-2018: ఈ జ్యూసు తాగితే వడదెబ్బ తగలదు. శరీర ఉష్ణోగ్రత ‘కూల్‌’గా ఉంటుంది. పైగా పచ్చిమామిడికాయలో విటమిన్‌-సి, ఐరన్‌లు బాగా ఉంటాయి. వేసవిలో తలెత్తే కడుపునొప్పి సమస్యలపై కూడా ఇది బాగా పనిచేస్తుంది.

 
కావలసినవి: పచ్చిమామిడికాయలు- రెండు (పెద్దవి), యాలకులు- రెండు (పొడిచేసి), మిరియాలు- ఐదు (పొడిచేసి) (కావలిస్తే), నల్ల ఉప్పు- రెండు టీస్పూన్లు, బెల్లం లేదా చక్కెర- మామిడిపండు గుజ్జుకు రెట్టింపు పరిమాణంలో.
 
తయారీ:
 పచ్చిమామిడికాయలను నీళ్లల్లో శుభ్రంగా కడగాలి.
 కుక్కర్‌లో నీళ్లు పోసి మామిడికాయలను వేసి మూతపెట్టాలి.
 మామిడికాయలు మృదువుగా అయ్యేదాకా స్టవ్‌పై ఉంచాలి.
 కాయలు చల్లారిన తర్వాత కుక్కర్‌లోంచి వాటిని బయటకు తీసి వాటిపై ఉన్న తొక్కు తీసేసి గుజ్జును మాత్రం ఒక గిన్నెలోకి తీయాలి.
 మామిడికాయ గుజ్జులో యాలకుల పొడి, బెల్లం, ఉప్పు వేసి మెత్తగా పేస్టులా అయ్యే దాకా కలపాలి.
 గాలి చొరబడని బాటిల్‌లో ఈ మిశ్రమాన్ని భద్రపరచాలి.
 ఆమ్‌ కా పన్నా తాగాలనుకున్నప్పుడు ఒక గ్లాసుడు నీళ్లలో టేబుల్‌ స్పూన్‌ మామిడిగుజ్జు వేసి కలిపి అందులో ఐస్‌క్యూబ్స్‌ వేసి తాగాలి. వేసవిలో ఈ డ్రింకు తాగితే ఎంతో మంచిది.