తినండి..! బరువు తగ్గండి!!

31-07-2017: ఏ రెండు పదార్థాలూ ఒకేలా ఉండనట్టే ఏ రెండు రకాల క్యాలరీలూ మన శరీరంలో ఒకేలా ఖర్చవవు. అయితే కొన్ని పదార్థాలు మన మెటబాలిజమ్‌ను పెంచే నెగిటివ్‌ క్యాలరీ ఎఫెక్ట్‌ కూడా కలిగి ఉంటాయి. అలాంటి పదార్థాలను ఆహారంలో చేర్చుకోగలిగితే బరువును అదుపులో ఉంచుకోవటం పెద్ద కష్టమేమీ కాదు.
 
పీచు పదార్థాలు: మొక్కల ఉత్పత్తులైన చిక్కుళ్లు, పళ్లు, అపరాలు, కొన్ని రకాల కూరగాయల్లో నీరు, పీచు శాతం ఎక్కువ. ఇవి తిన్నప్పుడు మన శరీరం వీటిలోని పీచును జీర్ణం చేసుకోవటానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. దీంతో మెటబాలిజమ్‌ పెరుగుతుంది. ఫలితంగా శరీరం బరువు తగ్గుతుంది.
 
యాపిల్స్‌: యాపిల్స్‌లో పీచు పదార్థం ఎక్కువ. సైజునిబట్టి ఒక్కో యాపిల్‌లో 2 నుంచి 5 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. అయితే వీటిని తొక్క తీయకుండా తింటేనే, పూర్తి ఫైబర్‌ని పొందగలం. కాబట్టి రోజులో ఏదో ఓ సమయంలో కనీసం ఒక్క యాపిల్‌ అయినా తినాలి.

బనానా: పొటాషియంతోపాటు అరటిపళ్లలో ఫైబర్‌ కూడా ఉంటుంది. ఒక అరటిపండులో 3 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలనుకునేవారు ఉదయాన్నే ఒక అరటిపండు తినాలి.

మినుములు: ఒక కప్పు మినుముల్లో 30 గ్రాముల పీచు ఉంటుంది. కాబట్టి అల్పాహారంగా మినుములతో కూడిన దోసె, ఇడ్లీలాంటివి తీసుకోవాలి.

బ్రోకోలి: రోజూ ఇతర కూరగాయలతోపాటు తప్పనిసరిగా ఒక కప్పు బ్రోకోలి తీసుకుంటే రోజుకి సరిపడా ఫైబర్‌ అందుతుంది.

క్యాబేజీ: ఇందులో విటమిన్‌-సి తోపాటు ఫైబర్‌ కూడా ఎక్కువే! క్యాబేజీని సూప్‌, సలాడ్‌, స్మూదీ... రూపంలో తీసుకోవాలి.

క్యారెట్స్‌: బీటా కెరొటిన్‌తోపాటు పీచు కూడా క్యారెట్లలో ఎక్కువ. పచ్చిగా కానీ, ఆవిరి మీద ఉడికించి కానీ తింటే దీన్లోని ఫైబర్‌ని పూర్తిగా పొందుతాం.