అలా తినడం మంచిదేనా?

30-08-2019: అన్నం తక్కువ తిని, కూరలు ఎక్కువ తినడం మంచిదేనా? అసలు కూరలు ఎంత తినాలి? వాటి లాభాలు ఏమిటో వివరించండి.
ప్రీతి
డైట్‌ అనగానే అన్నం తక్కువ తిని కూరలు ఎక్కువ తినాలనేది ఒక అపోహ. కూరలు ఎంత తినాలనేది మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. కనీసం అరకప్పు తీసుకోవచ్చు. అంటే వండిన తర్వాత 175ఎం.ఎల్‌ వాల్యూమ్‌ అరకప్పు అవుతుంది. రోజుకు కనీసం అరకిలో కూరగాయలు తీసుకోవాలి.
 
కూరల వల్ల లాభాలు
ప్రపంచంలో ఎక్కడ లేనన్ని కూరగాయలు మన దేశంలో ఉన్నాయి. ఎన్నో రకాల మసాలా దినుసులను ఉపయోగించడం. మిరపపొడి, పసుపు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంగువ, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర... ఇలా పలురకాల మసాలాలు, హెర్బ్స్‌ మన కూరల్లో వినియోగిస్తాం. వీటి వల్ల అనేక లాభాలున్నాయి.
కడుపులో మంట తగ్గిస్తాయి. పొట్ట ఉబ్బరం రాకుండా చేస్తాయి. యాంటీ ఫంగల్‌, యాంటీ బయాటిక్‌లాగా ఉపయోగపడతాయి.
వీటివల్ల జీర్ణవ్యవస్థలో అరుగుదలకు కావాల్సిన ఎంజైములు తయారవుతాయి. జీర్ణకోశాన్ని శుభ్రపరుస్తాయి.
మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. డిప్రెషన్‌ పోగొడుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
కూరల వల్ల శరీరానికి ఎన్నో లాభాలు చేకూరుతాయి. అయితే వీటిలో మసాలాలను అతిగా వాడకూడదు. కావాల్సినంత మాత్రమే వాడితే ఎలాంటి సమస్య ఉండదు.