పచ్చివే మేలా? వండి తినాలా?

ఆంధ్రజ్యోతి, 07-09-2017: కొన్ని రకాల కూరగాయల గురించి మనకు కొంత కన్‌ఫ్యూజన్‌ ఉంటోంది. వాటిని పచ్చిగా తింటేనే ఆరోగ్యమని కొందరంటారు. లేదు....వండితేనే మేలని ఇంకొందరంటారు. వీటిలో ఏది నిజం?
 
వీటిని పచ్చిగానే తినాలి
బీట్‌రూట్స్‌: బీట్‌రూట్‌లో మెదడుకు, గుండెకు అవసరమైన ‘ఫోలేట్‌’ ఉంటుంది. గర్భిణుల్లో పిండం ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఫోలేట్‌ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే బీట్‌రూట్‌ను ఉడికిస్తే ఈ కాంపౌండ్‌ నశిస్తుంది. కాబట్టి బీట్‌రూట్‌ను సాధ్యమైనంత ఎక్కువగా జ్యూస్‌ రూపంలో తీసుకోవటమే మేలు.
 
ఉల్లిపాయలు: ఉల్లిపాయలు పచ్చిగా ఉన్నప్పుడే వాటిలో ఎక్కువ శాతం అల్లిసిన్‌ అనే ఫైటోన్యూట్రియంట్‌ ఉంటుంది. ఇది ఆస్టియోఆర్థరైటిస్‌ రాకుండా అరికడుతుంది. కాబట్టి అప్పుడప్పుడూ పచ్చి ఉల్లిపాయలు తింటూ ఉండాలి.
 
బెల్‌ పెప్పర్‌: పచ్చి బెల్‌ పెప్పర్‌లో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది హృద్రోగాలు, కంటి జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి బెల్‌ పెప్పర్‌ను పచ్చిగా లేదా కొద్దిసేపు సాట్‌ చేయాలి గానీ మెత్తగా ఉడికించేయకూడదు.
 
వీటిని వండాల్సిందే!
టొమాటో: టొమాటోలో యాంటీఆక్సిడెంట్‌ ఫైటోకెమికల్‌ లైకోపైన్‌ ఉంటుంది. క్యాన్సర్‌, గుండె జబ్బులు రాకుండా కాపాడే ఈ పోషక పదార్థాన్ని శరీరం చక్కగా శోషించుకోవాలంటే టొమాటోలను ఉడికించి తినాల్సిందే!
 
పుట్టగొడుగులు: వీటిలో శక్తివంతమైన పాలీశాఖరైడ్స్‌ ఉంటాయి. వాటితోపాటే స్వల్ప పరిమాణంలో టాక్సిన్స్‌ కూడా ఉంటాయి. ఈ టాక్సిన్స్‌ను హరించి పాలీశాఖరైడ్స్‌ శరీరానికి వంటబట్టాలంటే పుట్టగొడుగుల్ని ఉడికించి తినాలి.
 
ఆస్పరాగస్‌: క్యాన్సర్‌తో పోరాడే ఫెర్యూలిక్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ ప్రయోజనాన్ని పూర్తిగా పొందాలంటే ఆస్పరాగ్‌సని ఉడికించి తినాలి.