జీలకర్రనీళ్లు తాగితే కలిగే లాభాలెన్నో

బెంగళూరు(07-01-2017): ఆహరమే ఔషదమని మన పెద్దవాళ్లు చెప్పారు. రోజు మనం తీసుకునే ఆహారం మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు. కానీ, మనం తీసుకునే ఆహారంపై మనం ఏమాత్రం శ్రద్ధపెట్టకుండా ఏది దొరికితే దాంతో ఆ పూటకి కడుపునింపుకోవాలని చూస్తుంటాం. ఈ ఆధునిక కాలంలో ఇంతకన్నా గత్యంతరం లేదన్నట్టుగా భావిస్తాం. కానీ, తీసుకునే ఆహారం మీద శ్రద్ధలేకపోయినా, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, అలాంటివి తిన్న కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని బెంగుళూరు చెందిన డాక్టర్ అంజుసూద్ చెబుతున్నారు. రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఒక గ్లాసు జీలకర్ర కలిపిన గోరువెచ్చని నీటిని తాగమని ఆమె సూచిస్తున్నారు. ఎందుకంటే జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియని ఉత్తేజపరుస్తాయని ఆమె చెప్పారు. దాని వల్ల ఇంకా చాలా ఉపయోగలున్నాయంటున్నారమే. ముఖ్యంగా గర్భిణులు ఇలా తాగడం వల్ల క్షీర గ్రంథులు ఉత్తేజం చెందుతాయంటున్నారు. అంతేకాకుండా మలబద్ధక సమస్య నుంచి కూడా బయటపడవచ్చని ఆమె చెప్పారు. అలాగే డయాబెటిక్ పెషెంట్లు ఇలా తాగడం షుగర్ అదుపులో ఉంటుందంటున్నారు. అంతేకాదు బి.పి.ని కూడా అదుపు చేసే గుణాలు జీలకర్రకు ఉన్నాయంటున్నారు. జీలకర్రలో ఐరన్, ఫైబర్‌లు అధికంగా ఉండటం వల్ల గర్భిణులు ఇలాంటివి తాగడం మంచిందంటున్నారు. అలాగే రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుందంటున్నారు. మూత్రపిండాలు ఎక్కువగా ప్రభావం చెందుతాయని అందువల్ల అనవసరమైన టాక్సిన్లు బయటకు పంపేందుకు సహాయపడుతుందని ఆమె చెప్పారు.