ఒక వ్యక్తి ఎన్ని క్యాలరీలు తీసుకోవాలి?

19-04-2019: క్యాలరీలు తక్కువ తీసుకోండని డాక్టర్లు ఎప్పుడూ చెబుతుంటారు. ఒక వ్యక్తి ఎన్ని క్యాలరీలు తీసుకోవాలి? ఎలా తగ్గించుకోవాలి? వివరించండి.

-రాకేశ్‌, కరీంనగర్‌

మన శరీరంలో జరిగే ప్రతీ ప్రక్రియకు శక్తి అవసరం. దీనినే ఎనర్జీ లేదా క్యాలరీలు అంటారు. ఒక వ్యక్తికి ఎన్ని క్యాలరీలు అవసరమో వారి పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు బరువు ఎక్కువగా ఉంటే క్యాలరీలు బాగా తగ్గించాలి. బరువు తక్కువగా ఉంటే క్యాలరీలు పెంచాలి. సమతుల ఆహారంలో క్యాలరీలను బట్టి ప్రొటీన్స్‌, ఫ్యాట్‌, విటమిన్స్‌ మారుతుంటాయి.

 
పెరిగే వయసు వారికి, పాలిచ్చే తల్లులకు, గర్భవతులకు పోషకాలు అధికంగా అవసరం కాబట్టి వారి ఆహారంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి క్యాలరీలు సరిగ్గా సరిపడా ఇవ్వాలి. టీబీ ఉన్నవారు అత్యధిక క్యాలరీలు తీసుకోవాలి. ఇలా క్యాలరీల అవసరం మారుతుంటుంది. అంతేకాదు మన రోజువారి పనిని బట్టి కూడా క్యాలరీల లెక్కింపు ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి 2200 క్యాలరీలు తీసుకోవచ్చు.
 
అయితే ఇప్పటి జీవన విధానానికి 1600 నుంచి 1800 క్యాలరీల ఆహారం తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటారు. మెయింటనెన్స్‌ సరిగ్గా ఉంటుంది. అందుకే డాక్టర్లు క్యాలరీలు తగ్గించండి అంటుంటారు. ఇక క్యాలరీలు ఎలా తగ్గించుకోవాలంటే.. చాలా సింపుల్‌...ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తగ్గించాలి లేదా మానెయ్యాలి. అధిక క్యాలరీలు ఇచ్చే ఆహార పదార్థాలు ఏమిటంటే... కొవ్వు పదార్థాలు, పంచదార, స్వీట్లు, ఫ్రై ఫుడ్‌, కూల్‌డ్రింక్స్‌, బిస్కెట్లు, కేకులు, ఐస్‌క్రీమ్‌లు, పిజ్జా, బర్గర్‌, ఆల్కహాల్‌ మొదలైనవి. వీటిని నియంత్రించుకుంటే అధిక క్యాలరీలు మన శరీరంలో ఉండవు.