ఈ బియ్యంలో ఔషధ గుణాలు అధికం..

06-08-2017:

 
ఈ బియ్యంలో ఔషధ గుణాలు అధికం
కొన్ని షాపులలోనే లభ్యం
ధర కూడా బహు ప్రియం

గోపాలపట్నం(విశాఖ జిల్లా): దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమైన ఆహార ధాన్యం బియ్యం. రోజూ తీసుకునే ఆహారంలో అన్నం లేకుండా దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు రోజు గడవదనడం అతిశయోక్తి కాదు. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో బియ్యం వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో సంప్రదాయబద్ధంగా సేంద్రియ ఎరువులతో ఆరు నెలల పాటు పండించే ధాన్యంతో లభించే బియ్యాన్నే అందరూ వినియోగించేవారు. అప్పట్లో ఈ బియ్యానికి పాలిషింగ్‌ కానీ బాయిలింగ్‌ గాని చేయకుండా మిల్లులో ఆడించి నేరుగా వాడేవారు.

 
అయితే గడిచిన నాలుగు దశాబ్దాలలో సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో పాటు వ్యవసాయ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అందుకు అవసరమైన ఆహార ధాన్యాల కొరతను తగ్గించడానికి... ఉత్పత్తిని పెంచడానికి రసాయన ఎరువులను వినియోగించి సంకరజాతి వంగడాలతో ఉత్పత్తి పెంచే దిశగా అడుగులు పడ్డాయి. ఈ క్రమంలో పండించిన పంటకు కూడా సరికొత్త పద్ధతులను వినియోగించి బియ్యం, పప్పులకు పాలిషింగ్‌ చేయడం వంటి ఎన్నో విధానాలు అందుబాటులోకి వచ్చాయి. బియ్యంలో అయితే చాలా రకాలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా ఇప్పుడు వినియోగంలో ఉన్న బియ్యంతో పాటు కాస్త ఎక్కువ ధర ఉండే బాస్మతి బియ్యం వంటి పలు రకాల బియ్యం మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే సుమారు పది పదిహేను రకాల బ్రాండ్ల సన్నబియ్యం గురించి అందరికీ తెలిసిందే. దీంతోపాటు బిరియానీ తయారీకి వినియోగించే బాస్మతి బియ్యంలో కూడా పలు రకాలు బ్రాండ్లు లభ్యమవుతున్నాయి.
 
అయితే ఈ తరహా బియ్యాలను మనం తరచూ వినియోగిస్తూనే ఉంటాం. వీటితో పాటు చాలా మంది అతి తక్కువగా వినియోగించే పలు రకాలు బియ్యం చాలామందికి తెలియకపోవచ్చు. ఎన్నో పోషక విలువలు కలిగి ఎంతో శక్తినిచ్చే ఈ రకాల బియ్యాలు మార్కెట్‌లోనూ చాలా తక్కువగానే లభిస్తాయి. పెరిగిన కాలుష్యంతో రోజురోజుకూ పెరుగుతున్న అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని కొన్ని రకాల బియ్యాలను చాలామంది ఔషధంగా వినియోగిస్తున్నారు. ఈ మాట వినడానికి కాస్త కొత్తగా అనిపించినా... ఇది మాత్రం నిజం. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈ తరహా బియ్యాల ధర కూడా బహు ప్రియంగానే ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం.
 
దంపుడు బియ్యం
సాధారణంగా ధాన్యాన్ని మిల్లులకు పంపించడం ద్వారా బాయిల్డ్‌ రైస్‌, పాలిషింగ్‌ రైస్‌లు మనకు అందుబాటులోకి వస్తాయి. ఈ తరహా పాలిషింగ్‌ పక్రియలో బియ్యంలో గల చాలా పోషక పదార్థాలు తొలగిపోతాయి. చూడడా నికి అందంగా కనిపించే ఈ వైట్‌ రైస్‌తో పోలిస్తే దంపుడు బియ్యంలో చాలా పోషక విలువలున్నాయి.
 
ధాన్యాన్ని యాంత్రికంగా కాకుండా సాధారణ పద్ధతిలో వడ్లను రోకలితో దంచడం ద్వారా లభించే బియ్యమే ఈ దంపుడు బియ్యం. దీన్నే ముడిబియ్యం లేదా బ్రౌన్‌ రైస్‌ అంటారు. పీచు (ఫైబర్‌), కార్బోహైడ్రేట్స్‌, పోషక విలువలు సమృద్ధిగా ఉండే ఈ బియ్యాన్ని అన్నంగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే మలబద్ధకం సమస్యకు చెక్‌ చెబుతుంది. సాధారణ పాలిష్డ్‌ బియ్యం తినేవారితో పోలిస్తే దంపుడు బియ్యం తినేవారికి వెంటనే ఆకలి వేయదు. దంపుడు బియ్యంతో వండే అన్నాన్ని తినడం వల్ల గుండెజబ్బులు, రొమ్ము కేన్సర్‌ వంటి వ్యాధుల బారినపడకుండా ఉండవచ్చు. సాధారణ రైస్‌ ధరకే ఈ దంపుడు బియ్యం కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో దంపుడు బియ్యం రూ.50 నుంచి లభిస్తున్నాయి.
 
కొర్రబియ్యం లేదా కొర్రలు
చిరుధాన్యాలుగా పిలవబడే ఈ కొర్రలు అతి ప్రాచీణ కాలం నుంచి వినియోగంలో ఉన్నాయి. ప్రస్తుతం వీటి కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి తప్పా పట్టణ వాసులకు పెద్దగా తెలియదు. కానీ ప్రస్తుతం నగరంలోని చాలా దుకాణాల్లో కొర్రలను విక్రయిస్తున్నారు. వీటి నాణ్యతను బట్టి కిలో రూ.70 నుంచి రూ.120 వరకూ ధర పలుకుతుంది. ఈ కొర్రల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నందున ఇప్పుడు చాలామంది వీటిని వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొర్రలను అన్నం మాదిరిగానే వండుకుని తింటారు. బియ్యాన్ని వండిన విధానంలోనే కొర్రలనూ వండుతారు. అయితే వండడానికి సుమారు రెండు గంటల ముందు వీటిని నానబెడతే సరిపోతుంది.
 
పీచు పదార్థం కలిగి వుండే కొర్రల్లో ఐరన్‌, కాల్షియం, మాంసకృత్తులు, థైమిన్‌, రిబోఫ్లావిన్‌ వంటి పోషక పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. ఇవి డయాబెటిస్‌ రోగులకు మంచి ఔషధం. రక్తంలో చక్కర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అజీర్తి సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది. కొర్రలు వినియోగంతో జీర్ణనాళం శుభ్రం కావడంతో పాటు యూరినల్‌ ఇన్ఫెక్షన్‌ సమస్యలను దూరం చేస్తుంది... ఊబకాయాన్ని తగ్గిస్తుంది. అంతేకాక కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. ఇన్ని రకాల ఔషధ గుణాలు కొర్రలులో ఉన్నందునే వీటి వినియోగానికి నగరవాపులు ఎక్కువ ఎక్కువ చూపుతున్నారు.