ఫాస్ట్‌గా అనారోగ్యం

టేస్ట్‌ కోసం తింటే ఆరోగ్యం ఫట్‌
 
ఆంధ్రజ్యోతి, మెదక్(07-11-2017): రుచిగా ఉంటుందని ఫాస్ట్‌ఫుడ్‌ లాగించేస్తున్నారా..? శీతాకాలంలో హాట్‌ హాట్‌గా ఉంటుందని తెగ తినేస్తున్నారా..? అయితే ఆ రుచి చేస్తున్న చేటు గురించి కూడా తెలుసుకోండి.

ఫాస్ట్‌ఫుడ్‌ తింటున్నప్పుడు బాగానే ఉంటుందని, కడుపులోకి వెళ్లాక సరిగ్గా జీర్ణం కాదని వైద్యులు చెబుతున్నారు. ఫాస్ట్‌ ఫుడ్‌ తింటే అనేక జబ్బులను కొని తెచ్చుకున్నట్టే అని హెచ్చరిస్తున్నారు. తప్పనిసరిగా ఎసిడిటి. మలబద్దకం సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. రసాయనాలు కలపడం వల్ల ఫాస్ట్‌ ఫుడ్‌ అపాయకరంగా మారుతుందంటున్నారు. కడుపులో మంట, ఉబ్బరం, తియ్యటి తేన్పులు, బరువు పెరడం, షుగర్‌ వంటి వంటి ఇబ్బందులు తలెత్తుతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. 

సాఫ్ట్‌వేర్‌, మార్కెటింగ్‌ ఉద్యోగులే ఎక్కువ...

సాఫ్ట్‌వేర్‌, మార్కెటింగ్‌ ఉద్యోగులే ఫాస్ట్‌ఫుడ్‌ ఎక్కువగా తింటున్నారు. వీళ్లు ఉదయమే ఆఫీసులు, ఫీల్డ్‌ పనులకు వెళ్లడం వల్ల రెడీమేడ్‌ ఫుడ్‌పై ఆధార పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. చిన్నపిల్లలు కూడా బర్గర్‌, పిజ్జాలకు అలవాటు పడుతున్నారని, వారికి భవిష్యత్‌లో కొలరెక్టల్‌ కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పెద్దపేగుకు ముప్పు 
ఫాస్ట్‌ఫుడ్‌ ఎక్కువగా తింటే దీర్ఘ కాలంలో పెద్దపేగు కేన్సర్‌ (కొలరెక్టల్‌ కేన్సర్‌) రావడానికి ఆస్కారం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. 40 ఏళ్ల పైబడిన వారు ఈ రకం ఆహారపు పదార్థాలకు అలవాటు పడితే అనారోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు. 
రెడీమేడ్‌ ఆహారం వైపు మొగ్గు..

తాజా ఆహారం తినడం చాలా మందికి కుదరడం లేదు. ఉద్యోగ రీత్యా, పని ఒత్తిడి వల్ల రెడీమేడ్‌ ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు. నిల్వ ఉన్నవి, ఫ్రిజ్‌లో పెట్టిన ఆహార పదార్థాలు ఎక్కువగా తింటున్నారు. ఆరోగ్యం పాడవడానికి ఇవి కూడా కారణాలని వైద్యులు చెబుతున్నారు. 

లక్షణాలు ఇలా ఉంటే...
ప్రతి రోజూ సాఫీగా కాలకృత్యాలు జరిగిపోతుంటే సమస్య ఉండదు. రోజు వారీగా కాలకృత్యాల్లో మార్పులు చోటు చేసుకుంటే అనుమానించాల్సిన అవసరముంది. కడుపులో మంట, ఉబ్బరం, నీళ్ల విరోచనాలు కావడం, ఆకలి తగ్గడం, నీరసం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు తెలిపారు. 
 
బరువు పెరిగే అవకాశం 
ఫాస్ట్‌ఫుడ్‌ తినడం వల్ల పిల్లల్లో బరువు పెరిగే అవకాశముంది. శరీరంలో కొలస్ట్రాల్‌ చేరుతుంది. ఇందులో ఉండే తీపి పదార్థాల వల్ల మధుమేహం వస్తుంది. మలబద్దకం సమస్య కూడా వస్తుంది. ఎప్పుడో ఒక సారి తింటే ఫర్వాలేదు కానీ అదే ఆహారం అయితే ప్రమాదమే. 
- డాక్టర్‌ జీఆర్‌ శ్రీనివాస్‌రావు, 

గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, యశోద ఆస్పత్రి

 

ప్రతి రోజూ 10 కేసులు
ఫాస్ట్‌ఫుడ్‌ కారణంగా అనారోగ్యానికి గురై రోజుకు పది మంది వరకు తమ వద్దకు చికిత్స కోసం వస్తున్నారు. ఇందులో 15 నుంచి 55 ఏళ్ల వారు కూడా ఉంటున్నారు.  కడుపు ఉబ్బరం, మలబద్దకం, కడుపులో మంట వంటి సమస్యలతో వస్తున్నారు. తల్లిదండ్రులు, పిల్లలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి మాన్పించే ప్రయత్నాలు చేస్తున్నాం. 
-డాక్టర్‌ అనిష్‌ ఆనంద్‌, 

జనరల్‌ ఫిజీషియన్‌, అపోలో ఆస్పత్రి

తినకపోవడమే మంచిది

కొన్ని రకాల నూడిల్స్‌, బన్‌, సేమియా, కేక్స్‌ తయారీకి ముందు పిండిని ఎక్కువ మోతాదులో ప్రాసెస్‌ చేస్తుంటారు. అవి ఉడికిపోయి, ఆవిరి అయిపోయిన తరువాత డ్రై చేసి ఫాస్ట్‌ఫుడ్‌ను తయారు చేస్తున్నారు. అలాంటి ఆహార పదార్థాల్లో షుగర్‌ స్థాయి ఎక్కవగా ఉంటోంది. రకరకాల రసాయనాలు కలవడం వల్ల అధిక బరువు, రక్తపోటు వచ్చే ముప్పు ఉంది. ఇటువంటి ఆహారం తినకపోవడమే మంచిది.
-డాక్టర్‌ జానకీ శ్రీనాథ్‌, 
పోషకాహార నిపుణురాలు