ఊదా రంగు ఉత్తమం

ఆంధ్రజ్యోతి, 05-09-2017:మన ఆహార పదార్థాల్లో ఊదారంగు పండ్లో, కాయగూరలో ఉండేలా చూసుకోవడం ఎంతో శ్రేయస్కరం. అత్యధిక మొత్తంలో ఉండే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు కేన్సర్‌, పక్షవాతం, గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తాయి.

ఊదా, నీలిరంగు పండ్లు వర్ణాన్ని పెంచడంతో పాటు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. ప్రత్యేకించి బ్లూ బెర్రీ, బ్లాక్‌ బెర్రీ పండ్లల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ-ర్యాడికల్స్‌ వల్ల కలిగే న ష్టాన్ని చాలా వరకు తగ్గిస్తాయి.

ఊదా రంగు క్యాబేజీ, బ్లాక్‌ బెర్రీలు, ఊదా రంగు ఉల్లి, ఊదా రంగు ద్రాక్షల్లోని ప్లేవనాయిడ్లు రక్తపోటును తగ్గించడంతో పాటు కొన్ని రకాల కేన్సర్లను ఎదుర్కొనే శక్తినిస్తాయి.

ఊదారంగులో ఉండే చిలగడదుంపల్లో యాంతో సియానిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని పెంచడంతో పాటు శరీరంలో ఏర్పడే వాపులను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అంశాలు సమ్దృద్ధిగా ఉంటాయి. శరీరంలోని కణవిచ్ఛిత్తిని అరికడతాయి.

ఊదా రంగు ఆహార పదార్థాలు శరీర బరువు తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఊదా రంగు క్యారెట్లలో అత్యధిక స్థాయి ఆంథోసియానిన్లతో పాటు కెరోటినాయిడ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ దాడిని తిప్పి కొడతాయి. ఇవి రక్తంలోని చక్కెర నిలువల్ని నియంత్రిస్తాయి. బ్లాక్‌ బెర్రీల్లో శరీర క్షయ వేగాన్ని తగ్గించే గుణం ఉంది. జుత్తు రాలిపోయే సమస్య కూడా తగ్గుతుంది. బీట్‌రూట్లలో శరీరంలోని మాలిన్యాలను బయటికి పంపే అంశాలు ఉన్నాయి. సూప్స్‌లోనూ, సలాడ్స్‌లోనూ వీటిని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.