రాత్రి పూట స్నాక్స్‌ తింటున్నారా?

ఆంధ్రజ్యోతి, 02-06-2018: రాత్రి పూట జంక్‌ఫుడ్‌ తినే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే రాత్రి పూట జంక్‌ఫుడ్‌, స్నాక్స్‌ తింటున్న వారిలో నిద్రలేమి సమస్య అధికంగా ఉంటోందని ఇటీవల ఒక సర్వేలో తేలింది. నిద్రలేమి సమస్యపై అసోసియేటెడ్‌ ప్రొఫెషనల్‌ స్లీప్‌ సోసైటీస్‌ ఎల్‌ఎల్‌సీ(ఏపీఎస్‌ఎస్‌) సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేలో నిద్రలేమితో బాధ పడేవారిలో కేవలం పని ఒత్తిడి మాత్రమే కాకుండా, జంక్‌ఫుడ్‌ తినే అలవాటు ఎక్కువగా ఉంటోందని తేలింది. రాత్రివేళల్లో జంక్‌ఫుడ్‌ తినేవారికి ఊబకాయం, మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. అందుకే రాత్రిపూట పడుకోవడానికి రెండు గంటల ముందే పళ్లు, పాలు వంటి తేలికైన ఆహారం తీసుకుంటే నిద్రలేమి సమస్య దరిచేరదని, ఆ సమయంలో ఎట్టిపరిస్థితుల్లో జంక్‌ఫుడ్‌ తీసుకోకపోవడమే మేలని వైద్యులు సూచిస్తున్నారు.