డైట్‌ రూల్స్‌

04-09-2017: ఆరోగ్యం కావాలనుకుంటే అనారోగ్యకరమైన ఫుడ్‌ హ్యాబిట్స్‌కు మంగళం పాడేయాలి. అలాగే కొన్ని తప్పనిసరిగా తినాలి. ఇంకొన్నిటిని పూర్తిగా వదిలేయాలి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలంటే ఈ డైట్‌ రూల్స్‌ పాటించాలి.

ప్రొటీన్‌ అవసరమే!
అధిక బరువు తెచ్చే అనర్థాలు తెలిసొచ్చాక బరువు తగ్గించే మార్గాల గురించి అన్వేషణ మొదలైంది. వెయిట్‌లాస్‌ కోసం కొందరు జిమ్‌కేసి పరుగులెత్తితే మరికొందరు ప్రొటీన్‌ ఇన్‌టేక్‌ మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. ప్రొటీన్‌ ఇన్‌టేక్‌ పెంచటం ద్వారా బరువు తగ్గించుకోవచ్చనేది పాలియో డైట్‌ సూత్రం. అయితే ఇందుకు కొన్ని రూల్స్‌ పాటించాలి. ప్రొటీన్‌ ఇన్‌టేక్‌ పెంచటంతోపాటు కార్బ్స్‌ ఇన్‌టేక్‌ తగ్గించాలి. తీసుకునే ప్రొటీన్‌ కూడా వెజిటబుల్‌ బేస్‌డ్‌ అయితే మరీ మంచిది. మగవాళ్లైతే రోజుకి 56గ్రా, మహిళలైతే రోజుకి 46గ్రా ప్రొటీన్‌ తీసుకోవాలి. అయితే ఇందుకోసం సప్లిమెంట్ల మీద ఆధారపడకూడదు. లేదంటే ప్రొటీన్‌ ద్వారా ఎక్కువ కేలరీలు పొందేవారిలో వృద్ధాప్య ఛాయలు, క్యాన్సర్‌ రిస్క్‌ ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి.
 
తాజా తాజా ఆహారం
ఆర్టిఫిషియల్‌ ఫ్లేవర్స్‌, ఆర్టిఫిషియల్‌ కలర్స్‌ తెచ్చే అనర్థాల మీద అవగాహన పెరగటంతో బాక్స్‌ ఫుడ్స్‌ జోలికి వెళ్లటం తగ్గించాం. దాంతో కంపెనీలు ఫలానా ఆర్టిఫిషియల్‌ కలర్స్‌, ఫ్లేవర్స్‌ తమ ప్రొడక్ట్స్‌నుంచి తీసేశాం అని ప్రచారం చేసుకుంటున్నాయి. ఇలాంటప్పుడు దేన్ని తీశారు? అనే దానికంటే దేన్ని కలిపారు? అనే విషయం మీద దృష్టి పెట్టడం మంచిది. అలాగే లోఫ్యాట్‌, మెడిటరేనియన్‌, పాలియో, వేగన్‌ మొదలైన డైట్స్‌ అన్నిట్లో దేన్ని ఫాలో అవ్వాలి? అని తర్జనభర్జన పడే బదులు స్వచ్ఛమైన తాజా డైట్‌ని ఫాలో అయితే అసలు చిక్కే ఉండదు. అలాగే తక్కువ ప్రాసెస్‌ చేసిన పదార్థాలు, పొట్టు తీయని ధాన్యాలు, గింజలు, పప్పులు తినాలి.
 
ఫైబర్‌ తీసుకోవాల్సిందే!
ఎంత ఎక్కువ ఫైబర్‌ తింటే అంత మేలు. పెద్ద పేగుల్లో ఉండే బ్యాక్టీరియా కాంపొజిషన్‌ వల్లే మనలో టైప్‌ 2 డయాబెటిస్‌, ఒబేసిటీ, ఇతరత్రా ఆటోఇమ్యూన్‌ డిసీజెస్‌ బారిన పడుతూ ఉంటాం. ఈ బ్యాక్టీరియా కాంపొజిషన్‌లో తేడాలు రాకుండా ఉండాలంటే వీలైనంత ఎక్కువ ఫైబర్‌ తినాలి. మన పూర్వీకులు రోజుకి 150 గ్రా. పీచు తినేవారు. ఆ పీచు పెద్దపేగుల్లోని బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడి, ఫ్యాటీ యాసిడ్లు ఉత్పత్తి అయి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. కాబట్టే మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్లు. ఇలాంటి ఆరోగ్యం సొంతం కావాలంటే ప్లాంట్‌ బేస్‌డ్‌ ఫైబర్‌ వీలైనంత ఎక్కువ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
 
జీరో కెలోరీ వద్దే వద్దు
ఆహారం నుంచి షుగర్‌ని కట్‌ చేయటం మంచి ఆలోచనే అయినా దానికి ప్రత్యామ్నాయంగా డైట్‌ కోక్‌లు, ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్లు తీసుకోవటం వల్ల ఉపయోగం ఉండకపోగా లేనిపోని సమస్యలు కొనితెచ్చుకున్న వాళ్ల మవుతాం. మామూలు చక్కెరకంటే కృత్రిమ చక్కెరలు మెదడును ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. దాంతో ఆకలి మీద నియంత్రణ కోల్పోతాం. దానికి తోడు జీరో కెలోరీ డ్రింక్‌ తాగితే తీసుకునే ఆహారం నుంచి ఎక్కవ కెలోరీలు శరీరంలోకి చేరిపోతాయి. కాబట్టి ఆర్టిఫిషియల్‌ షుగర్స్‌కు దూరంగా ఉండాలి.