డైట్‌ ప్లాన్‌లు... అవసరమా? అనర్థమా?

అతి ఏదైనా అనర్థమే! మితం పరిమితం అలవాటు చేసుకుంటే జీవితం సంతోషదాయకం, ఆరోగ్యకరం. ఆధునిక జీవన, ఆహారపు అలవాట్లు, బిజీ షెడ్యూళ్ళు, ట్రెండీ లైఫ్‌, లగ్జరీ ఎంజాయ్‌మెంట్‌...వంటి అంశాలు జీవన పరిమితులకు అడ్డుకట్ట వేస్తున్నాయి. అతి చేదుగా మారుతోంది. తిన్నా, ఎంజాయ్‌ చేసినా, ఖర్చు పెట్టినా... అన్నీ అతిగానే ఉంటున్నాయి. అందుకే నేడు మనిషిని శారీరక, మానసిక సమస్యలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఒబేసిటీ! ఆ కారణంగానే నేటి కార్పొరేట్‌ సమాజంలో రకరకాల డైట్‌ ప్లాన్‌లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఎంతోమందిని తమవైపు ఆకర్షించుకుంటున్నాయి. 

        డైటింగ్‌...! ఊబకాయం తగ్గడానికో, స్లిమ్‌గా కనిపించటానికో, జీరోసైజ్‌ కోసమో నేటి యువత అనుసరిస్తున్న విధానం. ఒకప్పుడు పూర్తిగా కడుపు మాడ్చుకోవడం, లేదంటే తినే ఆహారాన్ని మితం చేసుకోవడం చేసేవారు. దానివల్ల బరువు తగ్గుతామని తలపోసేవారు. కానీ నేటి డైటింగ్‌ ప్లాన్‌లు పూర్తిగా దానికి వ్యతిరేకం. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా కొవ్వును కొవ్వుతోనే కరిగించాలనుకుంటున్నారు. అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్ల వల్ల వచ్చిన ఊబకాయాన్ని అదే ఆహారంతో తరిమికొట్టాలనుకుంటున్నారు. దాంతో రకరకాల డైట్‌లు విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. వీరమాచినేని డైట్‌, కీటోజెనిక్‌, అట్కిన్స్‌ డైట్‌, ట్యూనా డైట్‌లు ఆ కోవలోనివే. 

అసలేమిటీ డైట్‌ ప్లాన్‌లు?
శరీర బరువు మోస్ట్‌ ఇంపార్టెంట్‌ సమస్యగా మారిన నేటి పరిస్థితుల్లో, కడుపు నిండా ఇష్టమైనవి తినడం కలగా మారుతోంది. కేలరీలు కొలుచుకుని తినడం, తినే ప్రతీదాంట్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్‌ పరిమాణాలను బేరీజు వేసుకోవడం.... తిండి కూడా కూడికలు, తీసివేతలు చందంగా మారింది.  ఇలాంటి పరిస్థితుల్లో ట్రెండీ డైట్‌ప్లాన్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. 

డైటింగ్‌ అంటే కడుపు మాడ్చుకోకుండా, కడుపు నిండా తింటూనే తీసుకునే ఆహారం ద్వారా అదనపు కేలరీలు చేరకుండా చూసుకోవడం. ఈ సూత్రం ఆధారంగా రకరకాల డైట్‌ ప్లాన్స్‌ రూపొందించబడ్డాయి. అయితే ఒక్కో డైట్‌ ప్లాన్‌ది ఒక్కో కాన్సెప్ట్‌. శరీరపు చక్కెర మోతాదును నియంత్రణలో ఉంచి బరువు పెరగకుండా అడ్డుకునేవి కొన్నయితే, కొవ్వు పదార్థాలు లేకుండా పోషకాలు మాత్రమే శరీరానికి అందేలా రూపొందించినవి మరికొన్ని. 

అలాగే శరీర అధిక బరువు తగ్గాలంటే కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకోవాలని కొందరు డైట్‌ప్లాన్‌ రూపొందిస్తే, కొవ్వును కొవ్వుతోనే కరిగించాలని డైట్‌ప్లాన్‌ తయారుచేసుకునేవారు మరికొందరు. అంతేకాక, పచ్చికూరలు మాత్రమే తీసుకునే డైట్‌, పాత తరపు ఆహారపు విధానం...అంటే ఆహారంలో చిరుధాన్యాలు చేర్చుకోవడం వంటివి...నేడు విస్తృతంగా ప్రచారం పొందుతున్నాయి. 
 
ఎందుకంటే...?
ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మారిన జీవనశైలి గురించి! ఆధునికత, నాగరికత, సాంకేతికత పెరిగి, జీవనశైలి పూర్తిగా మారింది. తినే వేళలు, సరైన ఆహారం తీసుకోకపోవడం, రుచుల పేరిట జంక్‌ఫుడ్‌ తీసుకోవడం, అలాగే బిజీ షెడ్యూల్‌తో స్వయంగా వండుకుని తినలేకపోవడం, శారీరక శ్రమ లేకపోవటం, ఒత్తిళ్ళు...ఇలా రకరకాల కారణాల వల్ల ఒబేసిటీ బారిన పడుతున్నారు. 

ఆ తరువాత మనం చెప్పుకోవాల్సింది...మితం లేకపోవడం! ఆహారనియమాలు పాటించకపోవడం! వెజ్‌, నాన్‌వెజ్‌...ఐటెమ్‌ ఏదైనా, రకరకాల వెరైటీ రుచులు కళ్ళముందు కనిపిస్తుండటంతో... ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలియకుండా అన్నింటినీ ఆస్వాదించేయాలన్న తపన. దాంతో తెలియకుండానే తమ శరీర బరువును పెంచేసుకుంటున్నారు. పెరిగిన శరీరాన్ని తగ్గించుకోవటానికి, ఆ తరువాత తీరిగ్గా ఆలోచిస్తున్నారు. డైట్‌ ప్లాన్‌ల గురించి ఆరా తీస్తున్నారు.

ఇంకో ముఖ్య కారణం తీరిక లేని జీవితం! పొద్దున్న లేచింది మొదలు ఉరుకులు పరుగులు. పిల్లల దగ్గరనుంచి పెద్దల వరకూ, ఈ పోటీప్రపంచంలో ఎవరి షెడ్యూల్‌ వారిది. దాంతో శారీరక శ్రమకు, వ్యాయామానికి ప్లానింగ్‌ చేసుకోవాల్సి వస్తోంది. శారీరక అలసట లేక, చెమట చిందించక, శరీరం అమాంతం పెరిగిపోతోంది. దాన్ని తగ్గించుకోవడానికి ఆ తరువాత తంటాలు పడుతున్నారు. ఇవే కాక ఇంకా రకరకాల కారణాలు మనిషిని, స్త్రీ, పురుష భేదం లేకుండా డైటింగ్‌వైపు నడిపిస్తున్నాయి. 
 
ప్రయోజనమేనా?
అధిక బరువును వెంటనే తగ్గించుకోవాలనే అత్యాశతో, అతిగా డైట్‌ ప్లాన్‌ చేసుకుంటారు. సమయం లేదు, అంత ఓపిక లేదు, ఫలితం వెంటనే రావాలి వంటి సాకులతో కఠినంగా, ఆలోచన లేకుండా, డైటింగ్‌ చేస్తుంటారు. దీనివల్ల ప్రయోజనం కన్నా అనర్థమే ఎక్కువ. నిజానికి ఏ ఒక్క డైటూ వందశాతం ఫలితం ఇవ్వదు. శారీరక, మానసిక ఆరోగ్యాలు, అలవాట్లు, శరీరతత్వం, నివసించే ప్రాంతం, జన్యు సంబంధ సమస్యలు, వ్యాధులు మొదలైన అనేక అంశాలను పరిగణనలోనికి తీసుకొని డైట్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నిజానికి ఎవరో ఒకరికి సత్ఫలితాలు వచ్చాయని, వారినే ఫాలో అవుదామనే ధోరణి ప్రజల్లో ఎక్కువైంది.

నిజానికి కొన్ని తాత్కాలికంగా పని చేసినప్పటికీ, భవిష్యత్తులో జీవక్రియలకు ఆటంకంగా మారి ఆరోగ్య సమస్యలు తెచ్చే ప్రమాదాలు లేకపోలేదు. ఈ విషయం గమనించకుండా, ఏది పాటించాలి? ఏది మంచి ఫలితాలను ఇస్తుంది? ఇవేవీ పూర్తిస్థాయిలో తెలుసుకోకుండా ఏ డైటూ సక్రమంగా పాటించక దీర్ఘకాలిక సమస్యలను తెచ్చుకుంటున్నారు కొందరు.

ఇలా చేస్తే మేలు!
• ఏ పనికయినా ప్లానింగ్‌, పద్ధతి ముఖ్యం. డైట్‌ ప్లాన్స్‌ అనుసరించేముందు కూడా ఒక క్రమమైన పద్ధతి అవసరం, అది ఏరకమైన డైట్‌ అయినా సరే! ఎవరో పాటిస్తున్నారనో, సోషల్‌మీడియాలో వైరల్‌ అయిందనో కాకుండా, మీ శారీరకతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని, మీకు ఏది సూట్‌ అయితే ఆ డైట్‌నే పాటించాలి.  
• డైట్ చెయ్యడం వరకు బాగానే ఉంటుంది. కానీ దీన్ని ఆపేసిన తర్వాత మళ్లీ బరువు పెరుగుతారు. దీనివల్ల రెసిస్టెంట్ కొవ్వు పెరుగుతుంది. ఏ డైట్ అయినా సరే మూడు నెలలు తప్పనిసరిగా చెయ్యాలి. ఫలితంగా బరువు తగ్గుతారు. అప్పుడు ఆ తగ్గిన బరువునే కనీసం ఏడాదిన్నర పాటు మెయిన్‌టెయిన్ చెయ్యాలి. అలా చెయ్యగలిగితే మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉండదు. సమతుల్యత లోపించడం వల్ల బరువు పెరగడం.. ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మన జీవనవిధానంలోనే మార్పులు చేసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా శాశ్వత ఫలితాలు పొందవచ్చు.
• నేటి యువత ఇంటర్నెట్‌ ప్రభావంతో, ఇష్టం వచ్చినట్టుగా సొంత ప్రయోగాలు చేస్తోంది. ట్రెండింగ్‌, ఫాలోయింగ్‌ అంటూ నిజానిజాలు తెలుసుకోకుండా, ఒకదాని తరువాత ఒకటిగా...డైట్‌ ప్లాన్స్‌తో ప్రాణాలమీదికి తెచ్చుకుంటోంది. బరువు తగ్గడమన్నది సహజ పరిస్థితుల్లో, ఆరోగ్యకరంగా తగ్గాలి తప్ప, అత్యుత్సాహంతో దేన్ని పడితే దాన్ని ఫాలో అవకూడదు. ఇలా చేయడం వల్ల ఉన్న సమస్యకు మరికొన్ని సమస్యలు తోడవుతాయి. కాబట్టి నేటి వ్యాపార ప్రపంచంలో, ఎవరికీ, దేనికీ మీరు టార్గెట్‌ కావద్దు.  
• పద్ధతి ప్రకారం చేసే ఏ డైట్ అయినా మంచిదే. మహిళలకైనా, పురుషులకైనా న్యూట్రీషియస్‌ బేస్డ్ డైట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాకపోతే ఏ రకమైన డైట్‌ను తీసుకున్నా, బ్యాలెన్స్‌డ్‌గా తీసుకోవాలి.
 
కొన్ని టాప్‌ లిస్ట్‌ డైట్‌ ప్లాన్స్‌
గత సంవత్సరం కొన్ని రకాల డైట్‌ ప్లాన్‌లు అత్యంత ప్రాచుర్యం పొందాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది ఈ డైట్‌ ప్లాన్లను ఫాలో అయ్యారు. వాటిల్లో కొన్నిటి గురించి తెలుసుకుందాం. 

కీటో డైట్!

గతేడాది ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్‌ చేసింది ఈ కీటో డైట్‌ గురించేనట! అంతలా ప్రాముఖ్యం సంతరించుకున్న ఈ కీటో డైట్‌ ఎప్పటినుంచో ఉంది. ఇందులో ప్రధానంగా కార్బోహైడ్రేట్లను ఆహారంలో తీసుకోకుండా, అధికశాతం కొవ్వుపదార్ధాలు, ప్రోటీన్స్‌ తీసుకుంటూ, అతి తక్కువ కాలంలో అధిక బరువుకు స్వస్తి పలకవచ్చనే కాన్సెప్టుతో వచ్చిందే... ఈ కీటో డైట్‌! 
 
వీరమాచినేని డైట్‌
నేడు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందీ డైట్‌! ఎంతోమంది ఈ డైట్‌ను ఫాలో అవుతున్నారు. వీరమాచినేని రామకృష్ణారావు రూపొందించిన ఈ డైట్‌ ప్రధాన ఉద్దేశం... కొవ్వును కొవ్వుతోనే కరిగించడం. ముఖ్యంగా మధుమేహులకు ఉపయోగకరంగా ఉంటుందనే ప్రచారంతో ఇప్పుడీ డైట్‌ బాగా ఫేమస్‌ అయింది. 
 
రా ఫుడ్ డైట్
తినే ఆహారం, తాగే పానీయాలు అన్నీ నేచురల్‌గా ఉండాలి. ఎలాంటి ప్రాసెసింగ్ చేయొద్దు. ఒకరకంగా ముడి ఆహారం మాత్రమే తీసుకోవడం ఈ డైటింగ్ విధానం.

సౌత్ బీచ్ డైట్

ఇన్సులిన్ స్థాయిలను తగ్గించేందుకు ఈ డైటింగ్ ఉపయోగపడుతుంది. కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు అనేది దీని ఉద్దేశం.

మెడిటెర్రేనియన్ డైట్

బీన్స్, నట్స్‌,. తాజా పండ్లు, ఉడకబెట్టని ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చని మెడిటెర్రేనియన్ డైటింగ్ సూచిస్తుంది.

అట్కిన్స్ డైట్

శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీనిలో భాగంగా తక్కువ మోతాదు కార్బోహైడ్రేట్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

వేగాన్ డైట్

గుడ్డు.. పాలు.. తేనె తినొచ్చు. వీటితో పాటు శాకాహారం తీసుకోవాలి. ఈ డైటింగ్ విధానాన్ని ఫిలాసఫీతో పోలుస్తుంటారు నిపుణులు. ప్లాంట్‌బేస్డ్ ఫుడ్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి.

వెయిట్ వాచర్ డైట్

చాలా పురాతనమైన విధానం. 1960 నుంచే ఇది వాడుకలో ఉంది. తిండి కన్నా వ్యాయామానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. శరీర బరువు తగ్గాలంటే కచ్చితంగా నిర్దిష్టమైన వ్యాయామం అవసరమేది ఈ డైటింగ్ ఫార్ములా.

ట్యూనా డైట్‌

ఈ రకమైన డైట్‌ వల్ల మూడు రోజుల్లో 4 కేజీల బరువు తగ్గుతారట. దీనినే కెమికల్‌ బ్రేక్‌డౌన్‌ డైట్‌ అని కూడా పిలుస్తారు. ఈ రకమైన డైట్‌లో ముఖ్యంగా కేలరీలు తక్కువగా ఉండి, అధికమొత్తంలో ప్రోటీన్లను కలిగి ఉన్న ట్యూనా ఫిష్‌ను వాడతారు. 
 
లిక్విడ్‌ డైట్‌
ఇందులో కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. ఘనపదార్థం జోలికి వెళ్ళరు. కేవలం మంచినీరు, పళ్ళరసాలు, కూరగాయల రసాలు... మాత్రమే ఈ డైట్‌ను ఫాలో అయ్యేవారు తీసుకుంటారు.