బరువు పెరగడానికి డైట్‌

19-05-2018: నా వయసు 22 సంవత్సరాలు, బరువు 44 కిలోలు. బరువు పెరగడానికి సరైన డైట్‌ చెప్పండి.

-రత్నాకర్‌, వరంగల్‌
 
నేను ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌ (డ్రిల్‌ మాస్టర్‌)గా పనిచేస్తున్నా. చాలా సన్నగా ఉంటాను. బరువు పెరగాలంటే ఏం చేయాలి?
- లక్ష్మి, హైదరాబాద్‌
 
రత్నాకర్‌ గారూ... మీ వయసుకి కనీసం 55 నుంచి 60 కిలోల వరకు బరువు ఉండాలి. మీ ఆరోగ్యం నార్మల్‌గా ఉండి ఆకలి చక్కగా ఉంది అంటే ఆహారంలో మార్పులు చేస్తే బరువు పెరిగే అవకాశం ఉంది. మీ వయసు కేవలం 22 కాబట్టి ఇప్పటిదాకా టీనేజ్‌లో మీ బోన్‌, ఇతర శరీర భాగాలు పెరిగి ఉంటాయి. అందువల్ల ఇక నుంచి బరువు పెరగడం మొదలవుతుంది. అధిక శక్తి, అధిక మాంసకృత్తులు లభించే ఆహారం నిత్యం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.
 
లక్ష్మిగారూ... మీరు వృత్తిరిత్యా అధిక శక్తి ఖర్చు చేస్తారు కాబట్టి సన్నగా ఉండి ఉంటారు. మీకు మామూలు కంటే అధిక శక్తి అవసరం. ఈ కింది చిట్కాలు అనుసరించండి.
10 బాదాం, 5 నల్ల ఖర్జూరాలు, 10 నల్ల ఎండు ద్రాక్ష, 2 అంజీరాలు, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి సగం కప్పు నీళ్లు, సగం కప్పు క్లియర్‌ ఆపిల్‌ జ్యూస్‌ కలిపి రాత్రి నానబెట్టి, ఉదయం లేచిన వెంటనే తీసుకోవాలి. దీని ద్వారా మీకు అధిక శక్తి, ఖనిజ లవణాలు సమకూరుతాయి.
భోజనం అనంతరం పాలతో తయారుచేసిన స్వీట్‌ తీసుకోవాలి. దీని ద్వారా అదనపు శక్తి మాంసకృత్తులు సమకూరుతాయి.
బెల్లంతో చేసిన పల్లి చిక్కీ, నువ్వుల లడ్డూ ప్రతిరోజు స్నాక్‌లాగా తీసుకోవాలి. వీటివల్ల కూడా అదనపు శక్తి, మాంసకృత్తులు లభిస్తాయి.
ఉదయం అల్పాహారంలో ఒక గుడ్డును చేర్చండి. ఏదైన ఒక ఫ్రూట్‌ జ్యూస్‌ తీసుకోండి.
రెండు పూటలా భోజనంలో పప్పు లేదా పనీర్‌ లేదా సోయా లేదా మాంసాహారం తప్పనిసరిగా తీసుకోండి.