ఈ సలాడ్ తింటే.. అంతే సంగతులు..!

25-07-2017:సలాడ్స్‌లో బ్యాక్టీరియా తోపుడు బండ్లు, కొన్ని హోటళ్ల సలాడ్స్‌పై అధ్యయనంలో తేలిన నిజం వర్షాకాలంలో మరీ ప్రమాదకరం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ హెచ్చరికలు

హైదరాబాద్‌: స్ట్రీట్‌ ఫుడ్‌ అంటే నగరవాసులు పడిచస్తారు. ఆరోగ్యస్పృహ ఉన్నవారు సైతం..శుభ్రతను పట్టించుకోకుండా వీధుల్లో దొరికే ఫుడ్‌ కోసం ఎగబడుతుంటారు. గ్రేటర్‌లోని గల్లీల్లోనూ, బస్తీల సెంటర్లలోనూ దొరికే ఫుడ్‌ జాబితాలో టిఫిన్లు, స్నాక్స్‌, ఫాస్ట్‌పుడ్స్‌తోపాటు జ్యూస్‌లు, సలాడ్‌లు చేరాయి. తోపుడుబండ్లు, చిన్న బంకుల్లో దొరికే సలాడ్‌లు ఎక్కువమంది తింటున్నారు. అయితే ఈ సలాడ్‌లు తీసుకోవడం ప్రమాదకరమని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(ఎన్‌ఐఎన్‌), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. స్ట్రీట్‌ సలాడ్‌పై ప్రత్యేకంగా అధ్యయనం చేసి ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. హైదరాబాద్‌ నలుదిక్కులా స్ర్టీట్స్‌లోనూ, పార్లర్లలోనూ అమ్ముతున్న సలాడ్‌లపై పరిశోధన చేయగా ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించాయని వారు వెల్లడించారు.
 
సలాడ్స్‌లో ప్రమాదకర బ్యాక్టీరియా
కడకుండా, శుభ్రం చేయకుండా తయారు చేస్తున్న క్యారట్‌లలో 74 శాతం , ఆనియన్‌లో శాతం స్టాఫిలోకోకుస్‌ అరియస్‌ బ్యాక్టీరియా ఉంటోందని పరీక్షల్లో తేలింది. శాంపిళ్లను పరీక్షించగా ఉల్లిపాయలలో 45, క్యారట్‌ల 58 శాతం సాల్మోనెల్లా... క్యారట్‌లో 68 శాతం, ఉల్లిపాయలలో 24 శాతం ఎర్సినియా ఉందని తేలింది. హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్‌లో ఉల్లిపాయలలో 76 శాతం స్టాఫిలోకోకుస్‌ అరియస్‌ బ్యాక్టీరియా, ఓల్డ్‌సిటీలో 76 శాతం ఉల్లిపాయల శాంపిల్స్‌లో సాల్మోనెల్లా ఉందని తేల్చింది. నిజానికి స్టాఫిలోకోకుస్‌ అరియస్‌ బ్యాక్టీరియా వల్ల చర్మ సంబంధిత సమస్యలు తలెత్తడంతో పాటుగా న్యుమోనియా, ఫుడ్‌ పాయిజనింగ్‌ సమస్యలు వస్తాయి. సాల్మోనెల్లా వల్ల టైఫాయిడ్‌ మొదలు గ్యాస్ట్రిక్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉంటే ఎర్సినియా వల్ల పేగులు, పొత్తి కడుపులో సమస్యలు రావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
శుభ్రత లేదంటే.. ముప్పు తథ్యం
నగరంలో స్ట్రీట్‌ ఫుడ్స్‌లో అధికంగా సర్వ్‌చేసే ఉల్లిపాయ, క్యారెట్‌లలో ఈ బ్యాక్టీరియా ఆనవాళ్ల గురించి శోధించామని ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ మైక్రోబయాలజీకి సమర్పించిన తమ నివేదికలో అధ్యయనకారులు పేర్కొన్నారు. నిజానికి సలాడ్స్‌లో ఈ బ్యాక్టీరియా చేరడానికి కారణాలెన్నో ఉంటాయి. సరిగా కడగక పోవడం, కుళ్లిన వాటితో కలిపి ఉంచడం, కూరగాయలు, పళ్లు కోయడానికి వాడే కత్తులను సరిగా శుభ్రం చేయకపోవడం.. ఇలా ఎన్నో ! కారణాలున్నాయని తేలింది. హెచ్‌ఏసీసీపీ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం రా వెజిటేబుల్స్‌ తమతో పాటుగా పాథోజెన్స్‌ తీసుకువెళ్తాయి. ఒకవేళ వాటిని శుభ్రంగా కడగక పోతే అవి మన శరీరంలోకి చేరతాయి. నిజానికి పరిశుభ్రత లేకపోవడం వల్ల మన శరీరంలోకి 60 కు పైగా వ్యాధికారకాలు ప్రవేశిస్తాయి. వీటివల్ల టైఫాయిడ్‌ మొదలు డయేరియా, ఇన్‌ఫెక్షన్లు లాంటివి రావడంతో పాటుగా ఒక్కోసారి ప్రాణాంతకమయ్యే అవకాశాలూ లేకపోలేదు. ఆహారపదార్థాలను శుభ్రంగా కడగడం, ఆరోగ్యకరమైన వాతావరణంలో వాటిని తీసుకోవడం అవసరమని వైద్యులు వెల్లడిస్తున్నారు.
 
ప్రాణాలతో చెలగాటం
సలాడ్స్‌ తయారుచేసే పద్ధతి చూస్తే.. మళ్లీ తినేందుకు ఎవరూ సాహసించరు. పండ్లయినా, కూరగాయలైనా అసలు కడిగే పరిస్థితే లేదు. ఇదే విషయం ఎన్‌ఐఎన్‌ అధ్యయనంలో వెల్లడైంది.
 
సమస్యలు ఎక్కువ.. శుభ్రత తక్కువ..
నగరంలో సలాడ్స్‌లో కనిపిస్తున్న బ్యాక్టీరియా సాధారణంగా నీటి కాలుష్యంతో పాటుగా శుభ్రత లేకపోవడంవల్ల పెరుగుతుంది. ఎర్సినోయా, స్టాఫెలోకోకస్‌ వంటివి మలం ద్వారా బయటకు వస్తాయి. మూసీ పక్కన సాగు చేసే కూరగాయల్లో ఈ తరహా బ్యాక్టీరియా ఉందని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా సలాడ్స్‌ను ఉడికించరు కాబట్టి బ్యాక్టీరియా అలాగే ఉండిపోయే అవకాశాలెక్కువ. ఉప్పు, పొటాషియం ఫర్మాంగనేట్‌తో క్లీన్‌ చేస్తే బ్యాక్టీరియా కొంత వరకూ పోతుంది. అలా కాదనుకుంటే ట్యాప్‌కింద నీళ్లు పోతుండగా కూరగాయలు కడగాలి. నన్నడిగితే స్ట్రీట్‌ఫుడ్‌ వద్దనే అంటాను. ఈ తరహా ఫుడ్స్‌ వల్ల ఆరోగ్యపరంగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో మరీ ఎక్కువ.
- డాక్టర్‌ ప్రభాకర్‌, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌, అపోలోహాస్పిటల్స్‌, హైదర్‌గూడ
 
మన ఫుడ్‌ మనం తీసుకెళ్లాలి
ప్రతి కూరగాయలనూ శుభ్రంగా క్లీన్‌ చేయాలి. దీనివల్ల డయేరియా లాంటివి తగ్గించవచ్చు. పండ్లు, కూరగాయలు వంటి వాటిపై పెస్టిసైడ్స్‌ పోవడానికి రన్నింగ్‌ వాటర్‌ కింద ఉంచి కడిగితే కొంత ఫలితం ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు హోటల్స్‌ లేదంటే రోడ్ల మీద తినడం మానేయడం మంచిది. అలాగే మన ఫుడ్‌ మనం క్యారీ చేయడం మంచిది. వాటర్‌ బాగా తాగాలి. దీనివల్ల శరీరంలోని మలినాలు పోతాయి. ఇటీవలి కాలంలో సలాడ్స్‌తోనే కొంతమంది డైట్‌ ఫాలో అవుతున్నామంటున్నారు. డైటీషియన్‌గా చెప్పాలంటే.. అది తప్పనే అంటాను. లాంగ్‌ టర్మ్‌లో విటమిన్‌ డెఫిషీయెన్సీ, అరికాళ్లలో మంటలు పుట్టడం వంటివి కనిపిస్తాయి. అన్ని రకాల ఫుడ్స్‌ డైట్‌లో ఇన్‌క్లూడ్‌ చేసుకోవాలి. ఫాట్‌ కూడా శరీరానికి అవసరం. లంచ్‌, డిన్నర్‌, నైట్‌ లో కేవలం సలాడ్స్‌ మాత్రమే తీసుకోవడమనేది మాత్రం తప్పు.
-డాక్టర్‌ గాయత్రి, డైటీషియన్‌, అపోలో హాస్పిటల్స్‌, హైదర్‌గూడ