కలర్‌ పవర్‌!

09-04-2019: ఆహార పదార్థాలను వాటి రంగుల ఆధారంగా వర్గీకరిస్తే, ఒక్కో రంగులోనూ ప్రత్యేకమైన ఆరోగ్య గుణాలు కనిపిస్తాయి. వాటిలోని పోషకాల ఆధారంగా ఆ రంగు పదార్థాలను ఎంచుకుని తినవచ్చు.

తెలుపు: ఈ రంగు ఆహారం వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. వైట్‌ బీన్స్‌, బంగాళాదుంపలు, పుట్టగొడుగులు, కాలీఫ్లవర్‌ ఈ వర్గానికి చెందినవే. బంగాళాదుంపలు రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తే, పుట్టగొడుగులు మాంసకృత్తులను అందిస్తాయి. క్యాలీఫ్లవర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

 
ఆకుపచ్చ: ఆకుపచ్చని ఆహారం విషాలను హరిస్తుంది. ఆకుకూరలు, పచ్చి బఠాణీ, చిక్కుళ్లు, బెంగుళూరు మిర్చి, పచ్చిమిర్చి, కివి, గ్రీన్‌ టీలలో విషాలను హరించే గుణాలతోపాటు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉంటాయి.
 
పసుపు: అరటి, పసుపుపచ్చని బెంగుళూరు మిర్చి, మొక్కజొన్న ఈ కోవకు చెందినవే. వీటిలో చర్మం, ఎముకలు, దంతాల ఆరోగ్యానికి అవసరమైన కెరోటినాయిడ్లు, బయోఫ్లేవనాయిడ్లు ఉంటాయి.
 
నారింజ: నారింజ, కమలా పండ్లు, క్యారెట్లు, కళ్లకు, గుండెకు మేలు చేస్తాయి. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయి. కేన్సర్‌ వ్యాధి నియంత్రణకూ తోడ్పడతాయి.
ఎరుపు: ఈ రంగు గుండెకు మేలు చేస్తుంది. ఈ రంగు ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎక్కువ. పండు మిరపకాయలు, ఎర్రటి బెంగుళూరు మిర్చి, చెర్రీలు, టమాటాలు, యాపిల్స్‌ ఈ కోవకు చెందినవే!
 
వంకాయ రంగు: ద్రాక్ష, వంకాయ రంగు క్యాబేజీ ఈ కోవవే! ఈ రంగు ఆహారం అల్సర్‌, కేన్సర్‌, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ రంగు ఆహారంతో గుండె, కాలేయాల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.