ప్లాస్టిక్ బాక్స్‌ల్లో తినే వారికి ఈ విషయం తెలిస్తే...

చౌక బాక్సుల్లో ఆహారంతో అనారోగ్యం
ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ల వల్ల పొంచి ఉన్న ప్రమాదం

బాక్సులు, బాటిళ్లు కొనేముందు నాణ్యతను పరిశీలించుకోవాలి

03-07-2018: పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నా.. పెద్దలు పనులకు వెళ్తున్నా.. టిఫిన్‌, స్నాక్స్‌, భోజనం ఏదైనా బాక్సులోకి వెళ్తుంది. అయితే గతంలో ఈ బాక్సులు స్టీల్‌వి ఉండేవి. ప్రస్తుతం ఆ స్థానాన్ని ప్లాస్టిక్‌ బాక్సులు ఆక్రమించేశాయి. అయితే ఆహార పదార్థాలు ఈ ప్లాస్టిక్‌ బాక్సులో తీసుకువెళ్లి తింటే ఎన్నో అనర్థాలు వస్తున్నాయని పలువురు హెచ్చరిస్తున్నారు. చౌకగా లభించే బాక్సులను అయితే అసలు వినియోగించవద్దని సూచిస్తున్నారు.
 

ఉదయాన్నే పాఠశాలకు వెళ్లి తిరిగి సాయంత్రానికి పిల్లలు ఇంటికి చేరుకుంటుంటారు. మధ్యాహ్న భోజనానికి ఉదయాన్నే చేసిన భోజనాన్ని లంచ్‌ బాక్సులో సర్ది పంపుతుంటారు. ఒకప్పుడు దీని కోసం స్టీలుతో చేసిన లంచ్‌ బాక్సులను ఉపయోగించేవారు. ఇప్పుడు ప్లాస్టిక్‌తో చేసిన రంగురంగుల లంచ్‌ బాక్సులను వినియోగిస్తున్నారు. ఇళ్లలో రుచికరమైన, షోషక విలువలతో కూడిన వంట తయారు చేసి పిల్లలకు అందిస్తే మంచిది. కొందరు తల్లిదండ్రులు అవగాహన లేక బయట హోటళ్ల నుంచి తెప్పించి లంచ్‌ బాక్సుల్లో సర్ది పిల్లలకు అందిస్తుంటారు. అవి తినే సమయానికి పాడై ఫుడ్‌ పాయిజన్‌గా మారే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్‌ కవర్లలో సాంబారు, పెరుగు, కూరలు, చెట్నీలు వంటి వాటిని కట్టి ఇస్తుంటారు. ప్లాస్టిక్‌ కవర్లలో ఆహారాన్ని పిల్లలకు అందించడంతో ధూళి చేరి పిల్లలకు ఆరోగ్యానికి హానికరంగా మారే ప్రమాదముంది. ఆహార పదార్థాలను ప్లాస్టిక్‌ బాక్సుల్లో తీసుకు వెళ్లడం సర్వసాధారణంగా మారింది. ఇటువంటి వాటిల్లో వేడి ఆహార పదార్థాలను నిల్వ చేయడం వల్లే బాక్సుకు ఉన్న రంగులు, అందులోని రసాయనాలు ఆహారంలో చేరే అవకాశం ఉంది. పిల్లలు హాట్‌బాక్సు, స్టీల్‌ బాక్సుల్లో అల్పాహారాన్ని, భోజనాన్ని తీసుకెళ్లి ఇవ్వడం ఉత్తమం. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. వేడిగా ఉన్న పదార్థాలు చల్లార్చి బాక్సుల్లో నిల్వ ఉంచి పిల్లలకు అందించాలి. తాగునీటి కోసం వాడే ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ల వల్ల ప్రమాదం పొంచి ఉంది. ప్లాస్టిక్‌తో చేసిన లంచ్‌ బాక్సులు, వాటర్‌ బాటిళ్లు కొనేముందు నాణ్యతను పరిశీలించాలి.

అప్రమత్తంగా ఉండాలి
బడి పిల్లల ఆహార విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ప్లాస్టిక్‌ వినియోగంపై తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి. నాణ్యమైన ప్లాస్టిక్‌ వస్తువులు వల్ల అంతగా హాని ఉండదు. కారుచౌకగా ఉండే వాటిని వాడడం వల్ల అనేక అనర్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే పిల్లలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. లంచ్‌ బాక్సులను సరిగ్గా శుభ్రం చేయకుండా ఆహార పదార్థాలు ఉంచితే ఆహారం విషతుల్యమై డయేరియా, వాంతులకు దారితీసే ప్రమాదం ఉంది.
డాక్టర్‌ గోపినాయక్‌, పీహెచ్‌సీ వైద్యాధికారి