తెలుసుకొని చేద్దాం!

లేదంటే డేంజరే!

18-07-2017:‘‘ నిన్న మొన్నటిదాకా మన మధ్య ఆరోగ్యంగా హాయిగా తిరిగిన వాడేగా! ఉన్నట్లుండి జిమ్‌లో చేరడం ఏమిటి? గుండెపోటుతో కుప్పకూలి పోయి ఆసుపత్రి పాలు కావడం ఏమిటి?’’ అనుకుంటూ అతని అయిన వాళ్లూ, ఆత్మీయులంతా గుండెలు బాదుకుంటూ ఉంటారు. ఎవరైనా ఏ వయసులోనైనా వ్యాయామాలు మొదలెట్టవచ్చు. కానీ, అంతకు ముందు మన శరీర స్థితి గతులేమిటి? మన శరీరానికి ఏ తరహా వ్యాయామాలు మేలు చేస్తాయి. ఏవి హాని చేస్తాయి అనే విషయంలో మనకు ప్రాధమిక పరిజ్ఞానం ఉండాలి. లేదంటే శరీరాన్ని నిలబెట్టాల్సిన వ్యాయామాలే, మనల్ని నేల కూలిపోయేలా చేస్తాయి. అందుకే వ్యాయామాల విషయంలో కొన్ని జాగ్రత్తలు చాలా కీలకం. ఆ వివరాల్లోకి వెళితే..
 
వయసు రీత్యా, వారికున్న ఆరోగ్య సమస్యల రీత్యా ఎవరు ఏ తరహా వ్యాయామాలు చేయాలో... ఏమేరకు చేయాలో ముందే మనకో స్పష్టత ఉండం చాలా అవసరం. అప్పుడే వ్యాయామాల వ ల్ల కలిగే ప్రయోజనాలు అధికమై వాటివల్ల కలిగే హాని బాగా తగ్గుతుంది.
 
నాలుగు రకాలు
ఏరోబిక్‌, స్ట్రెంథనింగ్‌, బ్యాలెన్సింగ్‌, స్ట్రెచింగ్‌ అంటూ వ్యాయామాలు నాలుగు రకాలు.
ఏరోబిక్‌ వ్యాయామాలు: వీటినే ఎండ్యూరెన్స్‌ లేదా కార్డియాక్‌ వ్యాయామాలని కూడా పిలుస్తారు. ఇవి శరీర పాటవాన్నీ, శక్తినీ పెంచడానికి ఉద్దేశించబడినవి.
స్ట్రెంథెనింగ్‌ ఎక్సర్‌ సైజులు: ఇవి కండరాల్నీ, మొత్తంగా శరీర దారుఢ్యాన్ని పెంచడానికి ఉద్దేశించినవి. డంబుల్స్‌ ఎత్తడం, వెయిట్‌ లిప్టింగ్‌ చేయడం వంటివి ఇందుకు తోడ్పడతాయి.
బ్యాలెన్సింగ్‌ వ్యాయామాలు: ఇవి నాడీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా పక్షవాతం, ఇతర నరాల జబ్బుల వల్ల కొందరికి నడక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా నడిచే సమయంలో శరీరం తూలినట్లు, తడబడ్డట్టు, ఒక పక్కకు ఒరిగినట్టు నడుస్తుంటారు. ఇలాంటి వారికి ఇవి తప్పనిసరి.
స్ట్రెచింగ్‌ వ్యాయామాలు: కండరాలు, కీళ్ల సాగే గుణాన్ని పెంచేందుకు బాగా ఉపకరిస్తాయి.
 
ఏం కావాలో తెలియాలి!
ఎవరు ఏ రకమైన వ్యాయామాలు చేసినా, అందరూ ఫ్లెక్సిబిలిటీని ఇచ్చే ఈ స్ట్రెచింగ్‌ వ్యాయామాలను తప్పనిసరిగా చేయాలి. అంటే ఎక్సర్‌ సైజులు చేయడానికి ముందు ఈ స్ట్రెచింగ్‌ వ్యాయామాలు విధిగా చేయాలి. అదే సమయంలో ఆ వ్యక్తికి ఉన్న ఆరోగ్య సమస్యల్ని కూడా దృష్టిలో ఉంచుకుని వ్యాయామాలను ఎంచుకుంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు పక్షవాతం లేదా మరేవైనా నరాలకు లేదా మొత్తంగా నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు, ఏరోబిక్‌ వ్యాయామాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎముకలు లేదా కీళ్ల సమస్యలు ఉన్నవారు ఏరోబిక్‌ (ఎండ్యూరెన్స్‌)ల కన్నా, ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంథనింగ్‌ ఎక్సర్‌సైజులకు ప్రాధాన్యమివ్వడం అవసరం.
 
వైద్య సలహా తప్పనిసరి
సాధారణ ఆరోగ్యంతో ఉన్న ఏ వ్యక్తి అయినా కొత్తగా వ్యాయామాలు మొదలెట్టాలనుకున్నప్పుడు డాక్టర్‌, ఫిజికల్‌ ట్రైనర్‌ల సలహా తీసుకోవాలి. వ్యాయామాల్ని ప్రారంభించడానికి ముందు అందరూ గుర్తుంచు కోవాల్సిన సాధారణ అంశం ఏమిటంటే, తొలి రోజునే అంతిమ లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆరాటం ఉండకూడదు. వ్యాయామం ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. నిదానంగా ప్రారంభించి, క్రమంగా దాని స్థాయిని పెంచుకుంటూ పోవాలి. ఆ తర్వాత ఒక నిర్దిష్ట్ట కాల వ్యవధిలో టార్గెట్‌ను అందుకోవాలి. ఇలా ఒక పద్ధతిగా కాకుండా ఆదరాబాదరాగా చేసే వాళ్లే ఎప్పుడో ఒకప్పుడు కొన్ని తీవ్రమైన సమస్యలకు గురవుతుంటారు. మౌలికంగా హృద్రోగులు రెండు రకాలు. వారిలో కొందరికి తమకు గుండె జబ్బు ఉన్నట్లు ముందే తెలిసి ఉంటుంది. వీరు ఒక రకమైతే, మరి కొందరికి అప్పటిదాకా తమకు ఆ సమస్య ఉన్నట్లు తెలియకుండానే ఉండిపోతారు. ఎప్పుడో ఇలా ఏదో వ్యాయామం చేసినప్పుడు, లేదా శరీరం తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు తమకు గుండె జబ్బు ఉన్నట్లు బయటపడుతుంది. వీరు రెండో రకానికి సంబంధించిన వారు. ఎలా తెలిసినా, తెలిసిన వెంటనే అత్యవసర జాగ్రత్తలన్నీ తీసుకోవాలి.
 
గుండెజబ్బులు ఉంటే...
కొంతమందికి పుట్టుకతోనే ఏదో ఒక గుండె జబ్బు (కంజెనిటల్‌)ఉంటుంది. వారిలో కొందరికి గుండె కవాటాల సమస్య ఉంటే, మరికొందరికి గుండె రక్తనాళాల్లో సమస్యలు ఉంటాయి. లేదంటే గుండెకు చిన్న రంధ్రం ఉంటుంది అయినా వారిలో కొందరు అందుకు సంబంధించిన వైద్యచికిత్సలు గానీ, సర్జరీ గానీ చేయించకుండానే అలానే రోజులు గడిపేస్తారు. ఇలాంటి వారు వ్యాయామాలేవీ చేయకపోవడమే మంచిది.
 
కొందరికి హృద్రోగ సంబంధితమైన కుటుంబ చరిత్ర ఉంటుంది. అంటే చిన్న వయసులోనే గుండె జబ్బుతో మరణించిన వారు ఆ కుటుంబంలో ఉంటారు. అలాంటి కుటుంబీకుల్లో సహజంగానే కొలెస్ట్రాల్‌ నిలువలు పెరిగి ఉండడం, గుండె రక్తనాళాలు మూసుకుపోయి ఉండడం వంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి వారు శరీరం మీద ఒత్తిడి పెంచే వ్యాయామాలకు వెళ్లకూడదు. గుండెలో నాలుగు రకాల చాంబర్లు ఉంటాయి. ఒక చాంబర్‌ నుంచి మరో చాంబర్‌కు వెళ్లడానికి కవాటాలు ఉంటాయి. అయితే కొందరిలో ఈ కవాటాలు కుంచించుకుపోయిగానీ, లేదా బిగుసుకుపోయి గానీ ఉండవచ్చు. ఇవి గుండె పనితనానికి అంతరాయంగా ఉంటాయి. కొందరిలో కవాటాలు బాగానే ఉన్నా అవి పనిచేసే స్థితిలో ఉండవు. ఇలాంటి వారు వ్యాయామాలు చేస్తే ఆయాసం, ఛాతీ నొప్పితో పాటు ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు ఏర్పడవచ్చు. వ్యాయామం చేస్తున్నప్పుడు ఎవరికైనా గుండె పనితనం పెరగాలి. రక్తప్రసరణ వేగం పెరగాలి. అయితే, కవాటాల సమస్య ఉన్నవారు వ్యాయామం చేస్తూనే ఉంటారు. కానీ, అందుకు ధీటుగా రక్త ప్రసరణ జరగదు. దీనివల్ల శ్వాస ఆడటం కష్టమవుతుంది. అదే క్రమంలో ఛాతీనొప్పి వస్తుంది. సకాలంలో వైద్య చికిత్సలు అందకపోతే, ప్రాణాపాయమే ఏర్పడవచ్చు. అందుకే గుండెకు సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నప్పుడు కార్డియాలజిస్టును సంప్రదించి తమ సమస్య తీవ్రత గురించి తెలుసుకోవాలి.
 
కొంతమందిలో గుండె రక్తనాళాలు సన్నబడిపోయి ఉంటాయి లేదా వాటిల్లో ఏదో అడ్డంకి ఉంటుంది. కొంతమందికి కుటుంబ లక్షణంగా రక్తనాళాలు సన్నబడి ఉంటాయి. ఇలాంటి వారు వ్యాయామాలు చేసినా, మరేరకంగానైనా శారీరక ఒత్తిడికి లోనైనా, గుండె పనితనంలో అంతరాయం ఏర్పడుతుంది. కొంతమందిలో గుండె కొట్టుకోవడంలోనే ఒక అస్తవ్యస్తత (రిథమ్‌ డిస్ట్రబెన్స్‌)ఉంటుంది. మధ్య మధ్య ఒక హార్ట్‌బీట్‌ తప్పిపోవడం గానీ, సాధారణం కన్నా ఎక్కువగా కొట్టుకోవడం గానీ ఉంటాయి. ఈ రెండు పరిస్థితుల్లోనూ గుండె పనితనం సరిగా ఉండదు. గుండె రిథమ్‌ అపసవ్యంగా ఉన్నవారికి పేస్‌ మేకర్లను బిగిస్తారు. అలాంటి వారు చేతులు పైకెత్తడం, గుండ్రంగా తిప్పడం వంటి కొన్ని రకాల వ్యాయామాల్ని రెండు మాసాల పాటు మానుకోవడం మంచిది. ఈ రిథమ్‌ సమస్య వృద్ధులకే కాదు, మధ్యవయస్కులు, చివరికి యుక్తవయస్కులకు కూడా రావచ్చు. ఒకవేళ యుక్తవయస్కులకే రిథమ్‌ సమస్య ఉండి పేస్‌మేకర్లు అమర్చుకుని ఉంటే వారు కొన్ని రకాల క్రీడల్ని అంటే, ఒక్కోసారి ఒకరి మీద ఒకరు పడిపోయే పుట్‌బాల్‌, వాలీబాల్‌, కబాడీ వంటి ఆటలు పూర్తిగా మానేయాలి. ఈ స్థితిని చక్కదిద్దుకోకుండా వ్యాయామాలకు వెళితే అది ప్రమాదానికి చేరువ కావడమే.
 
బీ.పీ ఉంటే....
హైపర్‌ టెన్షన్‌తో వచ్చేది మరో సమస్య. అధిక రక్తపోటు అనేది పరోక్షంగా గుండెమీద ప్రభావం చూపుతుంది. రక్తనాళాలు బిగుసుకుపోవడం, కుంచించుకుపోవడం, సాగే గుణం తగ్గడం వల్ల ఈ అధిక రక్తపోటు వస్తుంది. రక్తపోటు నియంత్రణలో లేకపోవడం వల్ల గుండె మీద దాని దుష్ప్రభావం పడుతుంది. అందువల్ల రక్తపోటును నియంత్రణలోకి తెచ్చుకోకుండానే వ్యాయామాలు చేస్తే, అది ఏ ప్రమాదానికైనా దారి తీయవచ్చు.
 
స్టెంట్‌లు వేయించుకుంటే.....
రక్తనాళాల బ్లాక్‌లను తొలగించడానికి స్టెంట్‌లను ఉపయోగించడం జరుగుతుంది. అందువల్ల స్టెంట్లు అమర్చిన తర్వాత గుండె పనితనం సహజంగానే అంతకు ముందు కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. అయినా వీళ్ల కార్యకలాపాల్ని ఒక క్రమానుగతిలో పెంచుతూ వెళ్లి, మైల్డ్‌ నుంచి మోడరే ట్‌ యాక్టివిటీ స్థాయికి తీసుకు రావాల్సి ఉంటుంది. అంటే రోజుకు 30 నిమిషాల పాటు వారానికి 5 నుంచి 7 రోజుల పాటు వ్యాయామం చేయగలిగే స్థితికి తీసుకు రావాలి.
 
బైపాస్‌ చేయించుకుని ఉంటే...
గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా, వ్యాయామాలు లేదా ఏవైనా క్రీడల్లో పాల్గొనాలనుకుంటే ఒక కార్టియాలజిస్టును సంప్రదించి ఆరోగ్య పరిస్థితి గురించిన పూర్తి సమీక్ష జరిపించాలి. కొందరు బైసాస్‌ సర్జరీ చేయించుకుని ఉంటారు. వాళ్లకు పోస్ట్‌- ఆపరేటివ్‌ వ్యాయామాలు కొన్ని డాక్టర్లే సూచిస్తారు. కార్డియాక్‌ రిహాబిలిటేషన్‌ అనే ప్రోగ్రాంలో భాగంలో ఈ వ్యాయామాల్ని ఒక క్రమవిధానంలో సాధన చేయిస్తారు. ఆ సమీక్షలో భాగంగా అతనికి ఆయాసం, ఛాతీనొప్పి లాంటివి ఏమైనా వస్తున్నాయా, ఏమేరకు నడవగలుగుతున్నారు? కాళ్లల్లో వాపులు ఏమైనా వస్తున్నాయా? చూసి ఇసీజీ, ఇకో టెస్ట్‌ల ఆధారంగా సమస్య తీవ్రత అంచనా వేస్తారు. కొందరికి ట్రె డ్‌ మిల్‌ టెస్ట్‌ చేస్తారు. కొందరు ట్రెడ్‌ మిల్‌ మీద పరుగెత్తలేరు అలాంటి వారికి డాబ్యుటమిన్‌ టెస్ట్‌ చేస్తారు. కొన్ని అరుదైన సందర్భాల్లో క్యాలియం అనే స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడు గానీ, ఏ వ్యాయామాలు చేయాలి. ఏవి చేయకూడదనే విషయాలు ఒక నిర్ధారణకు వస్తాయి.
 
లివర్‌ సమస్యలు ఉంటే.....
లివర్‌కు సంబంధించిన సమస్యలు పలురకాలుగా ఉంటాయి. వీటిల్లో ప్రధానమైనది లివర్‌ సిరోసిస్‌. లివర్‌ పనితనం బాగా దెబ్బతిని ఉండే ఈ స్థితిలో శరీరంలో ఉండే ప్రొటీన్లు బాగా తగ్గిపోతాయి. దీనివల్ల కండరాల పటిష్ఠత తగ్గుతుంది. ఇది ఎండ్యూరెన్స్‌ కెపాసిటీ తగ్గడానికి దారి తీస్తుంది. ఫలితంగా శరీరంలోని రక్త పరిమాణం కూడా తగ్గుతుంది. దీనివల్ల ఎక్కువ సేపు అంటే, ఆ 30 నిమిషాల పాటు కూడా వ్యాయామం చేయలేరు. అలాంటి సమయాల్లో లివర్‌లో ఉన్న సమస్య ఏమిటో గుర్తించి, సరియైున చికిత్సలు అందించాలి. ఆ తర్వాతే వాళ్లు సునాయాసంగా చేయగలిగే వ్యాయామాల్ని సూచించాలి. సాధారణంగా ఇలాంటి వారికి స్టామినా పెంచే ఎండ్యూరెన్స్‌ ఎక్సర్‌సైజులే కొంచెం కొంచెంగా చేయించడం ఉత్తమం.
 
కిడ్నీ సమస్యలు ఉంటే....
లివర్‌ సమస్యల్లో లాగే కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో శరీరంలోని ప్రొటీన్‌ తగ్గిపోతూ ఉంటుంది. రక్త పరిమాణం క్రమంగా తగ్గుతూ వెళుతుంది. దీనివల్ల కండరాలు బాగా బలహీనపడి ఉంటాయి. కిడ్నీల పనితనం బాగా తగ్గిపోయిన వారికి ఒక దశలో డయాలసిసిస్‌ అనివార్యమవుతుంది. కిడ్నీలు దెబ్బతిన్నవారిలో రక్తహీనతా సమస్య కూడా తీవ్రంగానే ఉంటుంది. ఇలాంటి వారు వ్యాయమాలు చేసే స్థితి ఉండదు కాకపోతే ఇలాంటి వారికి తైల మర్థనాలు కొంత మేరకు శరీరాన్ని చైతన్యవంతంగా ఉంచుతాయి.
 
కీళ్ల నొప్పులు ఉంటే....
మోకాలి కీళ్లనొప్పులతో బాధపడే వారు రన్నింగ్‌, జాగింగ్‌ జంపింగ్‌, ట్రెడ్‌మిల్‌ లాంటి కీళ్ల మీద ఎక్కువ భారం పడే వ్యాయామాలు చేస్తే, కీళ్లు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాంటి వాళ్లకు వాకింగ్‌ ఉత్తమం. సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, వెల్లకిలా పడుకుని గాలిలో రెండు కాళ్లను గుండ్రంగా తిప్పే ఎయిర్‌ సైక్లింగ్‌ ఉత్తమం.
 
స్పాండిలోసిస్‌ ఉంటే....
మెడ భాగంలో ఉండే సర్వైకల్‌ స్పాండిలోసిస్‌, వెన్నుభాగంలో ఉండే లుంబార్‌ స్పాండిలోసిస్‌ ఉన్నవారు ఎండ్యూరెన్స్‌, స్ట్రెంథనింగ్‌ వ్యాయామాలు గానీ, రన్నింగ్‌, జాగింగ్‌ లాంటివి గానీ చేస్తే ఆ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది అందువల్ల మెడ భాగాన్నీ, నడుము భాగాన్నీ బలిష్ఠం చేసే పిజియోథెరపీ వ్యాయామాలకు వెళ్లడం ఉత్తమం.
 
నరాల సమస్యలుంటే....
పిట్స్‌ లాంటి సమస్యలు ఉంటే క్రమం తప్పకుండా వైద్య చికిత్సలు తీసుకుంటే ఇతర వ్యాయామాలు ఒక మోస్తరుగా చేయవచ్చు. వీరు స్విమ్మింగ్‌కు మాత్రం వెళ్లకూడదు. ఇతర నాడీ సమస్యలకు యోగా, మసాజ్‌, ప్రాణాయామం మేలు చేస్తాయి. పక్షవాతం సమస్య అయితే బ్యాలెన్సింగ్‌ ఎక్సర్‌సైజులు వారికి తప్పనిసరి. వీరిలో శరీరంలోని ఒక భాగంలోని కండరాలు బాగా బలహీనపడతాయి. ఇలాంటివారికి స్ట్రెచింగ్‌, ప్లెక్లిబిలిటీ ఎక్సర్‌ సైజులు తప్పనిసరిగా చేయించాలి. ఎవరో వ్యాయామం చేస్తే మనకేమీ ప్రయోజనం కలగదు మనకోసం మనమే చేయాలి. కాకపోతే ఆ చేయడానికి ముందు వైద్యుల సలహాలు, లేదా నిపుణుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే !
 
క్రమంగా పెంచితే బెటర్‌
కొత్తగా వ్యాయామాలు ప్రారంభించే వారు, మొదటి రోజున 5 నిమిషాలు మాత్రమే చేసి, వారం తర్వాత 10 నిమిషాలు చేయాలి. ఆ తర్వాత వారానికి 15 నిమిషాలకు అలా పెంచుతూ వెళ్లాలి. అంతేగానీ, మొదటి రోజునే అంతిమ లక్ష్యంగా అనుకున్న టార్గెట్‌ను అందుకునే ప్రయత్నం చేయకూడదు అలా చేయడం వల్ల అందుకు ముందుగానే సంసిద్ధంగా లేని శరీర అంతర్భాగాలు ఏదైనా సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులున్న వారు కార్టియాక్‌ రిహాబిలిటేషన్‌ చేసే సమయంలో ఈ సమయ పాలనను విధిగా పాటించాలి.దీనితో పాటు గుండె సంబంధిత జబ్బులకు వైద్య చికిత్సలు తీసుకుని మందులు వాడుతూనే ఉన్నా, అన్నిసార్లూ సమస్య నిలకడగా ఉండే అవకాశం లేదు. ఏవేవో మార్పులు వస్తూనే ఉంటాయి. అందువల్ల ఎప్పపటికప్పుడు కార్డియాలజిస్టును సంప్రదిస్తూనే ఉండాలి.
 
అందరూ ఈ మూడూ చేయాలి!
అందరూ విధిగా పాటించాల్సిన విషయం ఏమిటంటే, క్రమానుగతంగా మూడు రకాల వ్యాయామాలు చేయాలి. వాటిల్లో ముందు వామ్‌అప్‌ ఎక్సర్‌ సైజులు, ఆ తర్వాత యాక్చువల్‌ ఎక్సర్‌సైజులు, చివరగా కూల్‌అప్‌ ఎక్సర్‌ సైజులు తప్పనిసరిగా చేయాలి. శరీరాన్ని వ్యాయామానికి సన్నద్దం చేసే వామ్‌అప్‌ ఎక్సర్‌ సైజులు ముందు తప్పనిసరిగా చేయాలి. అప్పటిదాకా నిద్రాణ స్థితిలో, విరామ స్థితిలో ఉండి, హఠాత్తుగా ఎండ్యూరెన్స్‌, స్ట్రెంథనింగ్‌ ఎక్సర్‌ సైజులకు దిగిపోతే శరీరం ఆ స్థితిని అందుకోవడంలో ఒక్కోసారి చాలా ఇబ్బంది పడవచ్చు. అందుకే ముందుగా 5 నుంచి 10 నిమిషాల పాటు వామ్‌ అప్‌ వ్యాయామాలు చేయాలి. వ్యాయామాల తాలూకు దుష్ప్రభావాల్లో ఎక్కువ భాగం ముందు వామ్‌అప్‌ ఎక్సర్‌సైజులు చేయకపోవడం వల్లనే వస్తుంటాయనే వాస్తవాన్ని ఎప్పుడూ మరిచిపోకూడదు. వామ్‌ అప్‌ల తర్వాత మీరు అసలు లక్ష్యం కోసం మీరు చేయాలనుకునే ఎండ్యూరెన్స్‌, స్ట్రెంథనింగ్‌ , ఫ్లెక్సిబుల్‌ లేదా మీరు సంకల్పింనిన మరే వ్యాయామాలైనా చేయాలి. అప్పటిదాకా ఎంతో తీవ్రంగా చేస్తూ వచ్చిన వ్యాయామాల్ని హఠాత్తుగా ఆపేయకుండా, క్రమంగా శరీరాన్ని శాంత పరచాలి. అందుకు కూల్‌అఫ్‌ వ్యాయామాలు చేయాలి.
 
 
- డాక్టర్‌ జి. శశికాంత్‌,
కన్సల్టెంట్‌ ఇన్‌ ట్రౌమా అండ్‌ ఆర్థోపెడిక్స్‌
కేర్‌ హాస్పిటల్స్‌, బంజారా హిల్స్‌, హైదరాబాద్‌