కొవ్వు కరగాలి

ఆరోగ్యానికి అదే రక్షణ  కవచం

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగితే ప్రమాదం
పక్షవాతం, గుండె జబ్బులు ఎదురయ్యే అవకాశం
దురలవాట్లు, ఆధునిక ఆహారంతోనే సమస్య
సాత్విక ఆహారం తీసుకుంటే ఎంతో మంచిది
క్రమం తప్పకుండా వ్యాయామంతో లాభం
ప్రతి నాలుగేళ్లకోసారి పరీక్ష చేయించుకోవాలి
ఎప్పటికప్పుడు అప్రమత్తంగా కావాలి
అనర్థం చుట్టుముట్టాక కంటే
ముందుజాగ్రత్తలతో మేలు
 
 
12-7-2017: శరీరానికి దాని అవసరం తప్పనిసరి...కానీ పెరిగితే ప్రమాదం...కొలెస్ట్రాల్‌తో వచ్చిన తంటా ఇది. మారిన జీవన విధానంలో ఎక్కువ మందిని పట్టిపీడిస్తున్న సమస్య కొలెస్ట్రాల్‌. శరీరంలో కొవ్వు శాతం అధికం కావడమే కొలెస్ట్రాల్‌. దీన్ని ఎప్పటికప్పుడు కరిగించుకుంటూ పరిమితి దాటకుండా చూసుకోవడమే ఆరోగ్యం. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ఏ రూపంలోనైనా చుట్టుముట్టవచ్చు. పక్షవాతంతో మంచం పట్టవచ్చు. గుండెపోటుతో కాలం చేయొచ్చు. అందువల్ల ముందస్తు జాగ్రత్తలతో ఎంతో మేలంటు న్నారు నిపుణులు. ముఖ్యంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, దురలవాట్లకు దూరంగా ఉండి, మంచి ఆహారం తీసుకుంటే అంతా మంచే అంటున్నారు వైద్యులు. 
 
మానవ శరీరం ఓ యంత్రం లాంటింది. అన్ని పరికరాలు (అంగాలు) సక్రమంగా పనిచేస్తేనే దైనందిన జీవితం సాఫీగా సాగుతుంది. ఏదైనా అంగం మొండికేస్తే సమస్యలు మొదలవుతాయి. గాలి, నీరు, ఆహారం మన శరీరం పనిచేసేందుకు ఉపయుక్తమయ్యే ఇంధనాలు. ఇవి తీసుకోవడం ఎంత అవసరమో, అవి శరీరంలో ఖర్చు కావడం కూడా అంతే అవసరం. అందువల్ల మంచి ఆహారాన్ని తీసుకోవడంతోపాటు, శరీరం అనే యంత్రాన్ని వీలైనంత ఎక్కువగా పనిచేయించడం వల్ల సమస్యలు దూరమవుతాయి. ఆహారం కారణంగా శరీరంలో పెరిగేది కొలెస్ట్రాల్‌. ఇది ఏ స్థాయిలో ఉంటే మంచిది, ఏ స్థాయి దాటితే ప్రమాదం అన్నది తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. కొలెస్ట్రాల్‌, దాని మంచి చెడులపై నిపుణులతో మాట్లాడి ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యక కథనం ఇది.
కొలెస్ట్రాల్‌ అంటే?

ఇదో రకమైన కొవ్వు పదార్థం. కొంతవరకు శరీరానికి అవసరం. అధిక మొత్తం అయితేనే ప్రమాదం. సాధారణంగా మనిషి శరీరానికి కావాల్సినంత కొలెస్ర్టాల్‌ను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. రక్తంలో ఉండే కొలెస్ర్టాల్‌ కణాల అభివృద్ధికి, నరాల పనితీరుకు, బ్రెయిన్‌ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కొన్ని రకాల ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వల్ల కొలెస్ట్రాల్‌ ఉత్పత్తి అయి కొన్ని రకాల ఇబ్బందులకు గురిచేస్తుంది.

ఆరోగ్యానికి ఇది సూచిక

కొలెస్ట్రాల్‌ అంచనాకు ‘లిపిడ్‌ ప్రొఫైల్‌’ అనే రక్త పరీక్ష చేస్తారు. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఉదయం పూట మాత్రమే చేస్తారు. ఈ పరీక్షలో మొత్తం కొలెస్ట్రాల్‌,  హెడ్‌డీఎల్‌, ఎల్‌డీఎల్‌, ట్రై గ్లిజరైడ్స్‌ అనే నాలుగు రకాల కొవ్వు పదార్థాలను అంచనా వేస్తారు. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ కొలెస్ట్రాల్‌కు సంబంధించి పలు సూచనలు చేసింది. ఈ మేరకు 20 ఏళ్లు దాటిన వారంతా నాలుగేళ్లకోసారి పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల పరిస్థితిని బట్టి తగిన చర్యలు తీసు కునేందుకు అవకాశం ఉంటుంది.

హెచ్‌డీఎల్‌ తగ్గితే ప్రమాదమే

ట్రై గ్లిజరేట్స్‌, ఎల్‌డీఎల్‌ పెరిగి హెచ్‌డీఎల్‌ తగ్గితే పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇలా ఉంటే పెరాల్సిస్‌, గుండెపోటు వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం పుష్కలం.

చెడు కొలస్ట్రాల్‌తోనే ప్రమాదం

కొలెస్ట్రాల్‌ అనగానే భయం కలుగుతుంది. కానీ చెడు దానితోనే ఇబ్బంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కొన్ని రకాల దురలవాట్లు, రెగ్యులర్‌ ఆహారం ఇందుకు కారణం కావచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం, దురలవాట్లను దూరం చేసు కుంటే ముప్పు తప్పుతుంది.

ముందు జాగ్రత్తలే మందు
20 ఏళ్లు దాటిన తరువాత ప్రతి నాలుగేళ్లకు ఒకసారి కొలెస్ట్రాల్‌ పరీక్షలు చేయించుకోవాలి. అందుకు అనుగుణం గా జీవనశైలి మార్చుకోవాలి. స్మోకింగ్‌, ఆల్కహాల్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి. కొంత మందిలో జన్యుపరమైన సమస్యల వల్ల, జీన్స్‌లో తేడాల వల్ల చిన్నతనం నుంచే కొలెస్ర్టాల్‌  పెరిగిపోవచ్చు. కుటుంబంలో ఎవరైనా బాధితు లుంటే ముందస్తు పరీక్షలు చేయించుకోవాలి.
 
 
రెండు రకాలు
కొలెస్ట్రాల్‌ రెండు రకాలు. హై డెన్సిటివ్‌ లైపో ప్రొటీన్‌ (హెచ్‌డీఎల్‌) మొదటిది. దీన్నే మంచి కొలెస్ట్రాల్‌ అంటారు. డెన్సిటీ లైపో ప్రొటీన్‌ (ఎల్‌డీఎల్‌) రెండోది. దీన్ని బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌గా చెబుతారు. ఎల్‌డీఎల్‌ రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయేలా చేస్తే హెచ్‌డీఎల్‌ కొవ్వు పేరుకు పోవడాన్ని నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్‌ శరీరంలో క్యారీ చేయడానికి కణం నుంచి కణానికి, రక్తం నుంచి కణానికి చేర్చేందుకు లైపో ప్రోటీన్స్‌ ఎంతో ఉపయోగపడతాయి. శరీరంలో ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ చేరితే అత్యంత ప్రమాదంగా భావించాలి. ఇది దమనుల్లో పాచిలా ఏర్పడుతుంది. దీంతో రక్త ప్రసరణ సరిగా జరగదు. ఇది కార్డియో వాస్క్యులర్‌ డిసీజ్‌కు దారితీయొచ్చు.
 
ఇదీ అసలైన లెక్క
 
మొత్తం కొలెస్ర్టాల్‌
200 మి.గ్రా/డెస్సీ లీటర్‌ (100 ఎంఎల్‌ బ్లడ్‌కు) కు మించి ఉండరాదు. 200-239 ఉంటే బోర్డర్‌ లైన్‌గా, 240 ఉంటే హై కొలెస్ర్టాల్‌గా భావిస్తారు. వీలైనంత వరకు తక్కువగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. పెరిగే కొద్దీ గుండెకు ప్రమాదం.
ఎల్‌డీఎల్‌ కొలెస్ర్టాల్‌
ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. 100 కంటే తక్కువగా ఉంటే నార్మల్‌గా భావిస్తారు. 100-140 వరకు పర్వాలేదు. 145కు మించితే ఎక్కువగా, 190 అయితే ప్రమాదంగా భావించాలి.
హెచ్‌డీఎల్‌ కొలెస్ర్టాల్‌
మనం పెంచుకోవాల్సిన కొలెస్ర్టాల్‌ ఇది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. సాధారణంగా 40 మి.గ్రా కంటే ఎక్కువగా ఉండాలి. తక్కువగా ఉంటే రిస్క్‌గా భావించాలి.
ట్రై గ్లిజరైడ్స్‌
దీని విలువ 150 మిల్లీ గ్రాములకు మించి ఉండరాదు. ఈ విలువ పెరిగే కొద్దీ ప్రమాదంగా భావించాలి. ఇది ఒకరకమైన కొవ్వు. దీనిలో కీలకమైన శక్తి నిల్వలుగా ఉంటాయి.  కానీ మోతాదుకు మించడం వల్ల ప్రమాదాలు సంభవించవచ్చు. గుండె జబ్బులు రావడంతోపాటు ఇబ్బందులు పెరుగుతాయి.
 
ఎటువంటి జాగ్రత్తలు అవసరం
 
కొలెస్ట్రాల్‌ ముప్పు తప్పించుకోవాలంటే సకాలంలో పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల కొలెస్ట్రాల్‌ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.
రోజువారీ ఆహారంలో 5 నుంచి 10 గ్రాముల పీచు పదార్థాలు వుండేలా చూసుకోవాలి.
ఉదయం అల్పాహారంలో ఓట్‌ మీల్‌, కూరగాయలు తినాలి.
నూనె వాడకం బాగా తగ్గించాలి. ఆలివ్‌, సోయాబిన్‌ వంటి అన్‌ శాచ్యురేటెడ్‌ వెజిటబుల్‌ ఆయిల్స్‌ వాడడం మంచిది.
తక్కువ కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. దీనివల్ల కొలెస్ట్రాల్‌ పెరగదు. పండ్లు, కూరగా యలు, తృణధాన్యాలు రోజువారీ మెనూలో వుండేలా చూసుకోవాలి.
ఉదయం అరగంటపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్‌ తగ్గడానికి ఇది మంచి మార్గం.
చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్‌ ఉంటుంది. దీనిలో కొలెస్ట్రాల్‌ తగ్గించే గుణం వుంది. వారంలో రెండు, మూడుసార్లు చేపలు తినవచ్చు. ట్రై గ్లిజరైడ్స్‌ అదుపులో ఉంటాయి.
రోజూ సరిపడే నిద్రపోవాలి. దీనివల్ల శరీరం పున రుత్తేజితమై బ్లడ్‌, షుగర్‌ లెవెల్స్‌ నిర్ణీత స్థాయిలో ఉంటాయి. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కొలెస్ర్టాల్‌ ముప్పు తప్పుతుంది. 
వెల్లుల్లిలో ఆర్గనో సల్ఫర్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగకుండా కాపాడుతుంది.  అందుకే రోజుకు రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి.
మెనూలో కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల విటమిన్స్‌, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి.
మాంసాహారం తక్కువగా తినాలి. లేదంటే కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ పెరుగుతాయి. చేపలు తినొచ్చు.
 
 
ఇలా ఉంటే భయం ఉండదు
బరువు తక్కువగా ఉండాలి.
స్మోకింగ్‌, ఆల్కహాల్‌ను అవా యిడ్‌ చెయ్యాలి. అధిక కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.
రోజు వారీ ఆహారంలో కొవ్వు పదార్థాలు 5 లేదా 6 క్యాలరీ లకు మించి ఉండకూడదు.
మాంసాహారం, డెయిరీ ఉత్పత్తులు పూర్తిగా దూరం పెట్టాలి.
ఫ్యాట్‌ తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి.
పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, చేప, స్కిన్‌లెస్‌ చికెన్‌ (తక్కు వగా), నట్స్‌, వెజిటబుల్‌ ఆయిల్స్‌ ఉపయోగించాలి.
బోర్డర్‌లో వుండే వాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక కొలెస్ట్రాల్‌ ఉన్నవాళ్లు వైద్యుని పర్యవేక్షణలో స్టాటిన్‌ అనే మందులు వాడుతూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.