ఫిట్‌నెస్‌ ‘అభిమాని’క

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌: ఒంటరి మహిళ తానెంచుకున్న రంగంలో నెగ్గుకురావడం కష్టమే. అలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు అభిమానిక తవీ. ఫిట్‌నెస్‌ ప్రపంచంలో రాణిస్తూనే ఇప్పుడు అందాల పోటీల్లో సత్తా చాటుతున్నారు. తెలంగాణా రాష్ట్రం నుంచి ఇప్పటికే మిసెస్‌ ఏసియా ఫసిఫిక్‌ యూనివర్శ్‌ - ఇండియా 2017 టైటిల్‌ గెలిచిన ఆమె ఆగస్టులో దక్షిణాఫ్రికాలో జరుగబోతున్న మిసెస్‌ ఏసియా ఫసిఫిక్‌ యూనివర్శ్‌ టైటిల్‌ పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

పక్కా హైదరాబాదీ..
పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. మా అమ్మ వత్సలేంద్ర కుమారి క్లాసికల్‌ డ్యాన్సర్‌. నాన్న విజయ్‌యాదవ్‌ టీవీ నటుడు. చిన్నప్పటి నుంచి నేను కూడా క్లాసికల్‌ డ్యాన్స్‌ చేసేదానిని. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కూడా చేశా.
ప్రేమపెళ్లి.. విఫలబంధం..
ఓ నార్త్‌ ఇండియన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా కాపురం సజావుగా సాగింది లేదు. ఆయన నాతో ఏమీ చెప్పేవారు కాదు. సఖ్యంగానూ ఉండేవారు కాదు. దీంతో మా వివాహ బంధం విఛ్చిన్నమైంది. ఒంటరి జీవితం. చిన్నబాబు. టీచర్‌గా పయనం ఆరంభించాను.
బరువు పెరిగా.. 
కుటుంబ సమస్యలకు తోడు డెలివరీ అయిన తరువాత ఉండే ఒత్తిడి కారణంగా నేను 70 కేజీల వరకూ బరువు పెరిగాను. యంగేజ్‌లో వదిలేసిన డ్యాన్స్‌తో పాటుగా యోగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాను. 6-7 నెలల్లో 50 కేజీలకు వచ్చాను. దాంతో పాటుగా నా బాడీ కూడా టోన్‌ అయింది. ఏ స్థాయిలో ఉన్నా ఫిట్‌నెస్‌ యాక్టివిటీలు మాత్రం మానను.
అనుకోకుండా అలా..
బ్యూటీ పేజంట్‌లో అనుకోకుండా నేను ఎంటరయ్యాను. విజయం సాధించాను. ఆ తరువాత మిసెస్‌ ఇండియా సౌత్‌, మిసెస్‌ ఇండియా టెలెంటెడ్‌, మిసెస్‌ ఇండియా ఫిట్‌నెస్‌ పేజంట్స్‌ గెలుచుకున్నాను.
నా బలం..బలహీనత వాడే..!
మా అబ్బాయి తవీష్‌ నా బలం, బలహీనత. వాడికి ఎనిమిదేళ్లు. కానీ చాలా మోచ్యూర్డ్‌గా ఉంటాడు. 
తెలంగాణా సంస్కృతి ప్రదర్శిస్తా..
తెలంగాణా అమ్మాయిగా పేజంట్‌లో తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలను ప్రదర్శించేరీతిలో బోనాలు, బతుకమ్మను ప్రదర్శించాలనుకుంటున్నాను.