వ్యాయామం మంచిదే.. కానీ...!

ఆంధ్రజ్యోతి, 14-09-2017: ఫిట్‌గా ఉండడం కోసం రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం మంచిదే. కానీ.... జిమ్‌లో చేసే వ్యాయామం వల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉంది. బ్యాక్టీరియా, ఫంగస్‌, వైరల్‌ ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. అలాగని వ్యాయామం చేయడం మానలేరు. అందుకే జిమ్‌కి వెళ్లి వ్యాయామాలు చేసేవాళ్లు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి అంటున్నారు చర్మ, సౌందర్యనిపుణులు.

 
వ్యాయామ పరికరాలు, చెమట, వేడిలతో పాటు వ్యాయామం చేశాక జిమ్‌లో స్నానం చేసే ప్రదేశంలో పాదాలకు చెప్పులు వేసుకోకుండా నడవడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్‌, వైరల్‌ ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. ఇలాంటివి ఎదురుకాకుండా ఉండాలంటే వ్యాయానికి ముందు, తరువాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. వ్యాయామ పరికరాలను, మ్యాట్స్‌ను వాడేముందు, వాడాక శుభ్రంగా తుడవాలి. కింద కూర్చోవాల్సి వస్తే మీరు తీసుకెళ్లిన టవల్‌ మీదే కూర్చోండి. వ్యాయామం చేశాక యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ సబ్బుతో స్నానం చేయాలి.
 
వ్యాయామం వల్ల విడుదలయ్యే చెమట చర్మంపై పగుళ్లకు కారణం అవుతుంది. వ్యాయామం చేసినా చర్మం దెబ్బతినకుండా ఉండాలంటే మరీ ఎక్కువగా కాకుండా ఓ మాదిరి స్థాయిలో వ్యాయామం చేయాలి. వదులుగా ఉండే బట్టలు వేసుకుని వ్యాయామం చేయాలి. కూలింగ్‌ స్ర్పే లేదా కూలింగ్‌ వైప్స్‌ను దగ్గర పెట్టుకుంటే వ్యాయామం చేసేటప్పుడు ఉపయోగడపతాయి.
 
వ్యాయామం చేసే ముందు మంచినీళ్లు సరిపడా తాగాలి. అలాగే చర్మసంరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ్రమైన తుండు, నాప్‌కిన్‌ దగ్గర పెట్టుకోవడం చాలా ముఖ్యం. మేకప్‌ వేసుకుని జిమ్‌లో వ్యాయామం అస్సలంటే అస్సలు చేయొద్దు. డీహైడ్రేట్‌ కాకుండా ఉండేందుకు సరిపడా నీళ్లు తాగాలి. యాంటీ ఫంగల్‌ పౌడర్‌ను శరీరంపై చల్లుకోవడంతో పాటు బట్టల మీద కూడా వేసుకోవడం బెటర్‌.