మీ భంగిమ సరైనదేనా?

25-07-2017: మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక పోశ్చర్‌ ప్రాబ్లమ్‌ ఉంటుంది. నడక, కూర్చునే విధానాల్లో సరైన భంగిమలను పాటించం. దాంతో ఎముకల మీద ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఎవర్ని వారు తరచి చూసుకుని మనం కూర్చునే భంగిమలను సరి చేసుకోవాలి.
 
యాంకిల్‌: కాలి గిలక నిటారుగా ఉండాలి. కానీ కొందరి యాంకిల్స్‌ లోపలివైపుకు వంగి ఉంటాయి. దాంతో శరీర బరువు నేరుగా పాదాల మీద కాకుండా గిలక మీదే ఎక్కువగా పడుతుంది. ఊబకాయం, గర్భందాల్చటం, సరైన చెప్పులు ధరించకపోవటం, గట్టి నేల మీద పరిగెత్తటం లాంటివి యాంకిల్‌ సమస్యలకు ప్రఽధాన కారణాలు. ఈ కారణాల వల్ల పిక్కల కండరాలు బిగుతుగా తయారవుతాయి. దాంతో మోకాళ్లు అంతర్గతంగా వంపు తిరుగుతాయి. ఈ వంపు ఎక్కువైతే ‘ప్లాంటార్‌ ఫాసియైుటిస్‌’ అనే మడమ పోటు వస్తుంది. అలాగే పాదం చదునుగా లేదా ఎక్కువ వంపు తిరగటం జరుగుతుంది. పాదం చదునుగా మారితే ఆర్థోటిక్స్‌ వాడాలి. పాదంలోని వంపు కిందకు దిగకుండా, బలహీనంగా ఉంటే రన్నింగ్‌, వాకింగ్‌ వల్ల ఉపయోగం ఉంటుంది.
 
హంచ్‌ బ్యాక్‌: ఛాతీ పైభాగాన్ని ముందుకు వంచి నిలబడటం కొందరికి అలవాటు. వీపు వెనక భాగం మరీ ముందుకు వంపు తిరిగి ఉండే ఈ భంగిమ ఎక్కువ సమయంపాటు కంప్యూటర్ల ముందు సరైన భంగిమ పాటించకుండా పనిచేసే వారికి అలవడుతుంది. హంచ్‌ బ్యాక్‌ ఉందో, లేదో తెలుసుకోవాలంటే పక్క నుంచి ఫోటో తీసుకుని చూసుకోవాలి. వీపు 40 డిగ్రీల కోణంలో ముందుకు వంగి ఉంటే మీకు హంచ్‌ బ్యాక్‌ ఉందని అర్థం. కంప్యూటర్‌ ముందు పని చేసేటప్పుడు ఛాతీ కండరాలు బిగుసుకుని అప్పర్‌ బ్యాక్‌లో వంపు తెస్తాయి. వీపు లోని కండరాలు బలహీనమై వదులవుతాయి. ఈ సమస్య తొలగాలంటే మసాజ్‌ బాల్‌తో స్ట్రెచింగ్‌ చేయాలి.