సన్నగా.. సన్నీలా..!

08-11-2017: ‘హాట్‌’ స్టార్‌ సన్నీ లియోన్‌ ఫిట్‌నెస్‌ గురూగా మారుతున్నారు. ఇండస్ర్టీలోకి వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా నవ యవ్వనిలా మెరిసిపోతున్న ఈ భామ త్వరలోనే ఎంటీవీ ‘ఫిట్‌-స్టాప్‌’ షోలో కనిపించనున్నారు. ఇంతకీ సన్నీని ఇంత స్వీట్‌గా ఉంచుతున్న ఆ ‘ఫిజిక్‌’ ఫిజిక్సేంటనేగా! అదేమిటో ఆమె మాటల్లోనే తెలుసుకుని మీరూ ఫాలో అయిపోండి..!

 
జిమ్‌
రోజూ కనీసం 30-45 నిమిషాలు కార్డియో ఎక్సర్‌సైజ్‌లు చేస్తా. తరువాత పిలెట్స్‌ వంటి వాటితో పాటు వాకింగ్‌ వ్యాయామాలు ఉంటాయి. ముఖ్యంగా పిలెట్స్‌ కేలరీలను కరిగించడమే కాదు... శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా, సరైన ఆకృతిలో అందంగా ఉంచుతాయి. వాకింగ్‌ చాలా సమస్యలను దూరం చేస్తుంది. ప్రతి ఒక్కరూ కనీసం రోజుకు 20 నిమిషాలన్నా నడవండి.
 
యోగా
సమయం దొరికితే జిమ్‌తో పాటు యోగా చేస్తుంటా. రెండూ కలిపి చేయడం అలవాటు. నాకు హాట్‌ యోగా చాలా ఇష్టం. కానీ భారత్‌కు వచ్చిన తరువాత దీన్ని ఆపేశాను. ఇక్కడ స్వెట్‌ సూట్‌ వేసుకోవడం వల్ల అదే అనుభూతి కలుగుతోంది. యోగాతో అలసిన శరీరానికి ఉపశమనంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుంది.
 
డైట్‌
ఆహార నియమాలు కచ్చితంగా పాటిస్తా. రోజూ కొబ్బరి నీళ్లు తాగుతా. దీనివల్ల రీఫ్రెష్‌ అవుతాం. ముఖ వర్చస్సు పెరుగుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌ తరువాత పాలు తీసుకుంటా. ఇది ఉత్తేజంగా ఉంచుతుంది. ఒంట్లో నీళ్లు తగ్గి డీహైడ్రేట్‌ కాకుండా చూస్తుంది. డిన్నర్‌ తరువాత కంటే ఉదయం టిఫిన్‌తో పాలు తీసుకోవడం ఉత్తమం. పడుకొనే ముందు పాలు తాగితే అరగక కొంతమంది ఇబ్బంది పడతారు. సమయం ఉన్నప్పుడల్లా తాజా కూరగాయలు తింటుంటా. ఫ్రిజ్‌, ప్యాకేజ్డ్‌ ఆహారానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం మంచిది. ప్రతి ఆహారంలో ఆరోగ్యకరమైన అంశాలుంటాయి. వాటిని ఎలా తీసుకొంటామన్నదే ముఖ్యం.
 
బ్యూటీ సీక్రెట్‌
అందం, నాజూకైన శరీరం... అంతా మనం తీసుకొనే ఆహారం, అలవాట్లను బట్టే ఉంటాయి. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మన గురించి మనం రోజూ శ్రద్ధ తీసుకోవాలి. కాఫీని వదల్లేని వారు బ్లాక్‌ కాఫీని అలవాటు చేసుకోండి. జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండండి. నిద్రకుపక్రమించే ముందు ముఖం కడుక్కోండి. సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు తాగండి. దీనివల్ల శరీరంలోని అనవసర పదార్థాలు బయటకు పోతాయి. ప్రతి ఒక్కరికీ ఎక్సర్‌సైజ్‌లు ముఖ్యం. అవి ఎండార్ఫిన్స్‌ని పెంచి, ఆనందంగా ఉంచుతాయి. అలొవేరా (కలబంద) చెట్టును పెంచుకోండి. ప్రపంచంలో దాన్ని మించిన ఫేస్‌ మాస్క్‌ లేదు.