కొత్తగా చేసేద్దాం ఫిట్‌నెస్‌...

10-02-2019: రొటీన్‌కు భిన్నంగా నేడు ఫిట్‌నెస్‌లో కూడా సరికొత్త వర్కవుట్స్‌ పుట్టుకొచ్చాయ్‌. ఫిట్‌నెస్‌ మీద ఆసక్తి ఉన్నవారు ఈ ట్రెండీ ఎక్సర్‌సైజ్‌లను ఇష్టంగా ఫాలో అవుతున్నారు. కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ శరీరాన్ని తీరైన ఆకృతిలోకి తేవచ్చు. ఈ కొత్తరకం వర్కవుట్స్‌ విశేషాలు చదివేద్దాం..

బూగీ బౌన్స్‌ వర్కవుట్‌: స్పాంజితో కూడిన చిన్న ట్రాంపోలిన్‌ మీద జంప్‌ చేస్తూ ఈ వర్కవుట్‌ చేస్తారు. ఈ ట్రాంపోలిన్‌కు టీ బార్‌ హ్యాండిల్‌ ఉంటుంది. శరీరంలోని కొవ్వును కరిగించడం, నొప్పిని తగ్గించడం, ఒత్తిడిని చిత్తుచేయడం వంటివి ఈ ఎక్సర్‌సైజ్‌ వల్ల ఒనగూరే లాభాలు. మోకాళ్లు, ఇతర కీళ్లపై తక్కువ ఒత్తిడి పడుతుంది. ఈ వర్కవుట్‌తో శరీరం మొత్తానికీ వ్యాయామం లభిస్తుంది.
ఇన్‌డోర్‌ క్లైంబింగ్‌: ఈ వర్కవుట్‌తో కొండలు, గుట్టలు ఎక్కిన అనుభూతి కలుగుతుంది. ఇంట్లోనే పెద్ద గోడల్ని తాడు సాయంతో ఎక్కేయవచ్చు. ఈ ఎక్సర్‌సైజ్‌తో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. కాలి కండరాల పుష్టి, వాటి మృదుత్వానికి దోహదపడుతుంది.
స్మాల్‌ గ్రూప్‌ ట్రైనింగ్‌: ఈ మధ్య జిమ్‌, ఫిట్‌నెస్‌ సెంటర్లు గ్రూప్‌ క్లాసెస్‌ నిర్వహిస్తున్నాయి. చిన్న గ్రూపులుగా ట్రైనింగ్‌ ఇవ్వడం ద్వారా అందరూ ఉత్సాహంగా, ఏకాగ్రతతో వర్కవుట్స్‌ చేసేందుకు, ఆరోగ్యకరమైన పోటీకి వీలుంటుంది. ట్రైనర్‌ ప్రతి ఒక్కరిని గమనించి, వారి పొరపాట్లను సరిదిద్దే అవకాశమూ ఉంటుంది.
రెసిస్టన్స్‌ బ్యాండ్‌: సాగే గుణం ఉన్న దృఢమైన బ్యాండ్స్‌ వర్కవుట్స్‌ చేసేటప్పుడు వ్యతిరేకదిశలో ఏర్పడే శరీర బరువును నియంత్రిస్తాయి. బరువులు ఎత్తినప్పుడు ఎముకలు, కండరాలకు కలిగే ప్రయోజనం ఈ బ్యాండ్స్‌ వల్ల కూడా కలుగుతుంది. చాలా చౌక. వెంట తీసుకెళ్లడం కూడా సులభం. ఈ వ్యాయామంతో మోకాళ్లు, కీళ్లు బలంగా తయారవుతాయి.
కెటిల్‌ బెల్‌ స్వింగ్స్‌: హ్యాండిల్‌ ఉన్న కెటిల్‌బెల్‌తో చేసే ఈ వ్యాయామంతో కండరాలు శక్తిమంతమై, మంచి ఆకారంలోకి వస్తాయి. శ్వాసక్రియ మెరుగవుతుంది.
ప్యారలల్‌ బార్‌: సమాంతరంగా అమర్చిన రెండు పైపుల మీద పుషప్స్‌ చేయొచ్చు. శరీరాన్ని బ్యాలెన్స్‌ చేయడం అలవడుతుంది. దీంతో బాడీ బిల్డింగ్‌ పెరుగుతుంది.