సాఫ్ట్‌వేర్‌ సిక్స్‌ ప్యాక్

20-08-2017: కార్పొరేట్‌ ఉద్యోగమంటే.. ఐదంకెల జీతాలు మాత్రమే కాదు ఐదు దశాబ్దాలకు సరిపడా ఒత్తిడి కూడా ! ఆఫీసులో అడుగుపెట్టింది మొదలు బయటకు వచ్చేవరకూ టార్గెట్‌ రీచ్‌ కావాలన్న టెన్షన్‌ తప్ప మరోటి కనబడదు చాలామందికి.  ఈ ఒత్తిళ్లతో సతమత మవుతున్న నగరవాసికి ఫిట్‌నెస్‌కు తగిన సమయం కేటాయించడానికీ వీలు చిక్కడం లేదన్నది తరచుగా వినిపించే మాట. కనీసం రోజుకు అరగంట అయినా వాకింగ్‌ చేయమంటే.. టైమ్‌ ఈజ్‌ మనీ.. అంటూ తెగబాధపడిపోయే వారున్నారు. అలాంటి వారంతా కూడా ఇప్పుడు ఫిట్‌నెస్‌ మంత్రం జపిస్తున్నారు.

6 ప్యాక్‌కూ సై.. ప్రత్యేక ఏర్పాట్లు  చేస్తున్న సంస్థలు
అవగాహన పెరిగిందంటున్న ఇన్‌స్ట్రక్టర్లు
ముందుజాగ్రత్త కోసమేనంటున్న ఉద్యోగులు

తమకు ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ఫిట్‌నెస్‌ ఆవసరం తెలుసుకుని జిమ్‌కు వెళ్లడం గతంలో ఉండేది కానీ ఇప్పుడు వ్యాధి రాకముందే జాగ్రత్తపడటానికి ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో కష్టమైనా ఇష్టంగా సిక్స్‌ ప్యాక్‌లు, జీరో సైజ్‌లకోసం ప్రయత్నిస్తున్నారు. రెండేళ్లగా ఈ ట్రెండ్‌ పెరుగుతోందని ఇప్పుడు మరీ ఎక్కువగా  ఉందని ఫిట్‌నెస్‌ ట్రైనర్లు చెబుతున్నారు. కార్పొరేట్‌ కంపెనీల్లో మినీ జిమ్‌లనుఏర్పాటుచేసి ఉద్యోగుల శ్రేయస్సు కోసం కంపెనీలు కృషి చేస్తున్నాయి. 

ఫిట్‌నెస్‌ పట్ల ప్రేమ.. ఆరోగ్యం పై శ్రద్ధ
నగరంలో 35 ఏళ్లు దాటితే సర్వసాధారణంగా బొజ్జతో కనిపించే వారే ఎక్కువ కనబడుతుంటారు. నిజానికి నడుం చుట్టూచేరే కొవ్వు మనలో ఎన్నో అనారోగ్యాలకూ మూలం. మన శరీరానికి అవసరం లేని కొవ్వు కరిగించుకోలేకపోతే బీపీ, షుగర్‌, హార్ట్‌ఎటాక్‌ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలే ఎక్కువ. మనకు వీలైన సమయంలో కనీసం రోజుకు అరగంట పాటు వాకింగ్‌, రన్నింగ్‌, స్కిప్పింగ్‌, స్విమ్మింగ్‌లాంటివి చేస్తే చాలు వ్యాధులు దరిచేరవన్నది డాక్టర్లు మొదలు ఫిట్‌నెస్‌ ట్రైనర్ల వరకూ చెబుతున్న మాట. దీనికి తోడు ఇటీవల చేస్తున్న ప్రతి అధ్యయనమూ కార్పొరేట్‌ కంపెనీలలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, జీవనశైలి వ్యాధుల గురించి ఏకరువు పెడతూనే ఉంది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కార్పొరేట్‌ ఉద్యోగులపై తీవ్రప్రభావమే చూపుతున్నాయి. మనకోసం మనం కష్టపడకపోతే ఎలా అని తమను తాము ప్రశ్నించుకుంటున్న వీరు జిమ్‌లలో కుస్తీ పడుతున్నారు. ఓ అంచనా ప్రకారం ఇటీవల జిమ్‌లకు వెళ్తున్న కార్పొరేట్‌ ఉద్యోగుల సంఖ్య 25-30 ు పెరిగింది. తమకు వీలైన సమయంలో జిమ్‌లో కసరత్తులతో పాటుగా సిక్స్‌ప్యాక్‌, జీరో ప్యాక్‌లనూ ట్రై చేస్తున్నారు. ఇదే విషయమై సిక్స్‌ ప్యాక్‌ ట్రైనర్‌ వెంకట్‌ మాట్లాడుతూ ‘‘‘ఇటీవల సాఫ్ట్‌వేర్‌ వాళ్లు జిమ్‌కు ఎక్కువగా వస్తున్నారు. ఎక్కువ సేపు సిస్టమ్‌ ముందు కూర్చోవడం వల్ల మహిళల్లో హార్మోన్స్‌ తేడా రావడంతో పాటుగా మగవారికి డయాబెటిక్‌ ఎటాక్‌ అవుతోంది. 25-30సంవత్సరాల మహిళలకు ఈ హార్మోన్స్‌ ప్రాబ్లమ్‌ఎక్కువగా ఉంటోంది. ఈ సమస్యలను అధిగమించడానికి వారు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఆక్రమంలో కొంతమంది జీరో సైజ్‌నూ ట్రై చేస్తున్నారు’’ అని అన్నారు. రెండు సంవత్సరాల క్రితం చాలా తక్కువగా సాఫ్ట్‌వేర్‌ వాళ్లు జిమ్‌కు వచ్చేవారు కానీ ఇప్పుడు ఇప్పుడు వీరి సంఖ్య బాగా పెరిగిందంటున్నారు ఫిట్‌నెస్‌ ట్రైనర్లు.

పోశ్చర్‌కు ప్రాధాన్యం పెరిగింది
ఎక్కువ సేపు కూర్చుని వర్క్‌చేయడం.. అనారోగ్యకరమైన జీవనశైలి.. జంక్‌ ఫుడ్స్‌ అధికంగా తీసుకోవడం.. వంటి కారణాల వల్ల ఒబేసిటీ, పీసీఓడీ లాంటి సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. ఇటీవల కార్పొరేట్‌ కంపెనీల ఉద్యోగినుల్లో పీసీఓడీ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పలు ఫెర్టిలిటీ సెంటర్లు చేసిన అధ్యయనంలో సైతం వెల్లడి కావడం గమనార్హం. ఈ సమస్యలు రాకుండా ఉండటంతో పాటుగా తమ పోశ్చర్‌ మెయిన్‌టెన్‌ చేయడానికి స్ట్రెంగ్త్‌నింగ్‌ వ్యాయామాలపై ఎక్కువ మంది దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇదే విషయమై ఫిట్‌నెస్‌ సెంటర్‌ నిర్వాహకుడు వెంకట్‌ మాట్లాడుతూ ‘‘ఫంక్షనల్‌ ట్రైనింగ్‌తో పాటుగా  పాటుగా కోర్‌ మజిల్స్‌ వ్యాయామాలు చేయగలిగితే సైడ్స్‌లోని ఫ్యాట్స్‌ను తగ్గించుకోవచ్చని ఇప్పుడు గుర్తిస్తున్నారు. వెయి్‌స్టలైన్‌ ఎంత తగ్గించుకోగలిగితే బ్యాక్‌ పోశ్చర్‌ అనేది అంతగా స్ట్రెయిటనింగ్‌ అవుతుందని, అదే సమయంలో బ్యాక్‌ మజిల్స్‌ బలోపేతం అవుతాయని కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి మహిళలతో పాటుగా పురుషులు కూడా ఈ అబ్డామిన్‌ మజిల్స్‌ బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని అన్నారు. పలు కంపెనీలు సైతం ఉద్యోగుల కోసం ప్రత్యేకంగాజిమ్‌లను కార్యాలయాల్లోనే ఏర్పాటుచేస్తున్నాయి. జెన్‌క్యూ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళి బొల్లు మాట్లాడుతూ ‘‘ఇప్పుడు వర్క్‌డేలో ఫిట్‌గా ఉండాల్సిన అవసరం ఉద్యోగులకు పెరిగింది. 

మరీ ముఖ్యంగా వర్క్‌స్టేషన్ల వద్ద ఎలాంటి కదలికలూ లేకుండా గడిపే వారికి. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఫిజికల్‌ యాక్టివిటీ అవసరం ఏర్పడింది. అందుకు వీరు ఫిట్‌గా ఉండేందుకు తగిన రీతిలో వర్క్‌ స్పేస్‌లు సృష్టిస్తున్నాం. వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ చేసుకోగలిగితే ప్రొఫెషనల్‌ జీవితంలో వారు ముందు కెళ్లడమూ సాధ్యమవుతుంది..’’అని అన్నారు. 

కార్పొరేట్‌ ఉద్యోగులు చేస్తున్న వ్యాయామాలివి..

కార్పొరేట్‌ ఉద్యోగులు ఇటీవల ఎక్కువగా కార్డియో, వెయిట్‌, ఫంక్షనల్‌ ట్రైనింగ్‌ వంటివి అనుసరిస్తున్నారు. వారు చేస్తున్న వ్యాయామాలు.. వాటి ఉపయోగాలు..

కార్డియో, వెయిట్‌, ఫంక్షనల్‌ కలిపి చేస్తే..

కార్డియో చేస్తే లంగ్‌ కెపాసిటీ పెరుగుతోంది. వెయిట్‌ ట్రైనింగ్‌తో మజిల్‌ స్ట్రెంగ్త్‌  బోన్‌ డెన్సిటీ కూడా పెరుగుతాయి. కానీ ఫ్లెక్సిబిలిటీ తగ్గే అవకాశాలున్నాయి కాబట్టి ఫంక్షనల్‌ ట్రైనింగ్‌ మీద ఎక్కువ కాన్‌సన్‌ట్రేట్‌ చేస్తుంటారు ట్రైనర్లు.ఈ మూడు కూడా ఒకేసారికూడా చేయగలిగితే బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అదే సమయంలో మానవశరీరంలో ఉన్న ప్రతి జాయింట్‌ కూడా  బలోపేతం కావడం, మెటబాలిజం , రేంజ్‌ ఆఫ్‌ మోషన్‌ కూడా పెరుగుతాయి. ఈ ఫంక్షనల్‌ ట్రైనింగ్‌ తర్వాత పుషప్స్‌ చేయగలం. దాంతో పాటు యాంకిల్‌ పెయిన్స్‌, రిస్ట్‌ పెయిన్స్‌ తగ్గాలంటే ఫంక్షనల్‌ ట్రైనింగ్‌ హెల్ప్‌ చేస్తోంది.

కార్డియోతో మహిళలకు ప్రయోజనాలివి..

త్రెడ్‌మిల్‌, సైక్లింగ్‌, క్రాస్‌ ట్రైనర్‌ లాంటి కార్డియో వాస్కుల్యర్‌ వ్యాయామాలతో ప్రయోజనమేమిటంటే, మహిళలు బరువు తగ్గడంతో పాటుగా వారు ఇం ట్లోనే వ్యాయామాలు చేసుకోవచ్చు. మోకాళ్లు, వెన్నుపూస ఇబ్బందులుంటే  సైక్లింగ్‌ ప్రిఫరబుల్‌. స్ట్రెస్‌ కూడా బాగా తగ్గుతుంది. కార్డియోతో ఈ ఫలితం ఎక్కువ. డిప్రెషన్‌ ఉన్నవాళ్లకు కార్డియోతో ప్రయోజనం కలుగుతుంది. లంగ్‌ కెపాసిటీ పెరుగుతుంది. కేన్సర్‌ లాంటివి లేడీస్‌ దరి చేరకుండా ఉంటాయి. 

మహిళలకు వెయిట్‌ ట్రైనింగ్‌ వల్ల ప్రయోజనాలేమిటంటే.. 

దీనివల్ల శరీరంలో ఫ్యాట్‌ బాగా తగ్గుతుంది. కార్డియో ఓ అరగంట చేస్తే 300-400కేలరీలు బర్న్‌ అవుతాయి. అదే వెయిట్‌ ట్రైనింగ్‌లో 450-500 కేలరీలు బర్న్‌ అవుతాయి. కంపోనెంట్‌ మూవ్‌మెంట్‌ ద్వారా మెటబాలిజం బాగా పెరుగుతుంది. మెటబాలిజం పెరిగితే ఫ్యాట్‌ కూడా త్వరగా కరుగుతుంది. మహిళలకు మేజర్‌ సమస్య.. ఎముకలు బలంగా ఉండవు. డెన్సిటీ కూడా పెరగదు. అది పెంచుకోవడానికి వెయిట్‌ ట్రైనింగ్‌ సహాయపడుతుంది. ఆర్థో పెరాసిస్‌ అనే డిసీజ్‌ నివారించొచ్చు. లీన్‌ మజిల్‌ మాస్‌ పెరిగితే బోన్‌ డెన్సిటీ పెరుగుతుంది. వెయిట్‌ ట్రైనింగ్‌తో మంచి పోశ్చర్‌ మెయిన్‌టెన్‌ చేయొచ్చు. 
 
ముందు కష్టం, తర్వాత ఇష్టమవుతుంది..
5 నెలలుగా జీరో సైజ్‌ కోసం ట్రై చేస్తున్నాను. బరువు కూడా బాగానే తగ్గాను. నా ఆహారపు అలవాట్లలో కూడా చాలా మార్పు వచ్చింది. డైట్‌లో వెజిటేబుల్స్‌, ఫ్రూట్స్‌ అధికంగా ఉంటున్నాయి.  జంక్‌ ఫుడ్‌ పూర్తిగా మానేశా.  హెల్తీ థింగ్స్‌ ఫాలో అవగలుగుతున్నాను. ఇప్పుడు ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యాంశమైంది. మనం ఖచ్చితంగా  బాడీ మెయిన్‌టెన్‌ చేయాలి.  ఆరోగ్యంగా ఉంటే అంతా మంచిగానే ఉంటుంది. మన ఆలోచించే తీరూ మారుతుంది. కనీసం ఓ ఒక గంట వ్యాయామం చేయడం మంచిది. తొలుత కొద్దిగా కష్టం అనిపించింది కానీ ఇప్పుడు మాత్రం ఆనందంగా ఉంది.
                                                                                                                                                                                                      - వైజయంతి, ఐడ్రీమ్‌ మీడియా
 
కార్పొరేట్‌ ఉద్యోగులు పెరిగారు..
ఇటీవల సిక్స్‌ప్యాక్‌ లేదంటే జీరోప్యాక్‌ అంటూ కార్పొరేట్‌ ఉద్యోగులు వస్తున్నారు. నైట్‌ డ్యూటీఉన్న వాళ్లు 3-4 గంటలకు వచ్చి ఇక్కడే ఫ్రెష్‌ అయి ఆఫీసులకు వెళ్తుంటే కొంతమంది ఆఫీ్‌సల నుంచి నేరుగా జిమ్‌కు వచ్చి సాయంత్రం 7-9గంటల వరకూ కష్టపడుతున్నారు. వీరికి ట్రైనింగ్‌ కూడా వైవిధ్యంగా ఉంటుంది. మొదట లంగ్‌ కెపాసిటీ ఎక్సర్‌సైజులు చేయించి 15 రోజుల తర్వాత ఫంక్షనల్‌ ట్రైనింగ్‌ చేయిస్తాం. ఆ తర్వాత మజిల్‌ స్ట్రెంగ్త్‌నింగ్‌ లాంటివి ఉంటాయి. సిక్స్‌ప్యాక్‌లకు ఎందుకొస్తున్నారంటే మాత్రం సినిమాల స్ఫూర్తి అని చెప్పకతప్పదు. ఇక పేరెంట్స్‌కు డయాబెటిక్స్‌ ఉంటే ముందు జాగ్రత్తగా వచ్చి 6 ప్యాక్‌ లాంటివి ట్రై చేస్తూ హెల్త్‌ను కాపాడుకునేవారు కూడా బాగా పెరిగారు. మనం ఎంతగా జిమ్‌లో కష్టపడినా 70% సరైన డైట్‌తోనే ఫలితాలు సాధించగలం. 
                                                                                                                                                                    - వెంకట్‌, వెంకట్‌ ఫిట్‌నెస్‌సెంటర్‌, సిక్స్‌ప్యాక్‌ స్పెషలిస్ట్‌
 
కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ బాగా పెరిగాయి..
ముందు జిమ్‌లో వ్యాయామాలు చేయాలనే అనుకున్నా. తర్వాత మనమెందుకు చేయలేమని టార్గెట్‌ పెట్టుకున్నా. మూడు నెలలు కంటిన్యూ్‌సగా చేసిన తర్వాత   ఇంట్రెస్ట్‌ పెరిగింది. అదీ 15 కిలోలు బరువు తగ్గిన తర్వాత. నాకు సిక్స్‌ప్యాక్‌ బాడీ రావడానికి 5-6 నెలలు పట్టింది. కార్పొరేట్‌ ఆఫీ్‌సలో వాతావరణం ఎలా ఉంటుందో  తెలిసిందేగా.! జిమ్‌లో కష్టపడిన వెళ్లిన తర్వాత ఆఫీసులో కాస్త టైడ్‌ అయినట్లుగా ఉండేది. నొప్పులు కూడా బాగా ఉండేవి. తర్వాత మా ట్రైనర్‌ వెంకట్‌ కొన్ని సూచనలిచ్చారు. ఇప్పుడు అంతా హ్యాపీనే.

                                                                                                                                                                                                            - విశ్వనాథ్‌, మార్ట్‌జాక్‌ సంస్థ