67 ఏళ్ల వయసులో సిక్స్‌ప్యాక్

హైదరాబాద్ :సిక్స్‌ ప్యాక్‌.. యువతరానికి అదొక కల. హీరోయిజం. దాని కోసం ఎన్నో కసరత్తులు చేస్తారు. 24 గంటలూ జిమ్‌లో తిష్ఠ వేస్తారు. కొందరికి అది తీరని కలగానే మిగిలిపోతుంది. కానీ... 67 ఏళ్ల వృద్ధుడు సిక్స్‌ ప్యాక్‌తో యువతను విస్మయానికి గురి చేస్తున్నారు. వారంలో ఆరు రోజులు జిమ్‌లో కఠినమైన కసరత్తులు చేస్తూ.. యువతరానికి మెలకువలు నేర్పుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 
 

ఓల్డు బోయిన్‌పల్లి మల్లికార్జున్‌నగర్‌కు చెందిన మందుల విజయ్‌కుమార్‌ వయసు 67 ఏళ్లు. ఈ వయసులోనూ సిక్స్‌ ప్యాక్‌ దేహ దారుఢ్యంతో ఆకట్టుకుంటున్నారు. కచ్చితమైన ఆహార నియమాలు పాటిస్తూ, ఆరు పదుల వయసులోనూ చలాకీగా ఉంటున్నారు. 

జిమ్‌ల్లో విజయ్‌కుమార్‌...

ఓల్డు బోయిన్‌పల్లిలో సుమారు 10కి పైగా జిమ్ములు ఉన్నాయి. అక్కడకు వచ్చే యువతకు, కోచ్‌లకు విజయ్‌కుమార్‌ అంటే తెలియవారు ఉండరు. ప్రతీ జిమ్‌లోనూ ఆయనకు సాదర స్వాగతం పలుకుతారు. జిమ్‌కు వచ్చే వారికి సూచనలు ఇవాలని కోరతారు. దీంతో వారంలో ఆరు రోజులు ఉదయం వేళలో ఆయన జిమ్‌ల్లోనే ఉంటారు. రెండు రోజులు వెయిట్‌ ట్రైనింగ్‌, మరో రెండు రోజులు శరీరం కింది భాగాన్ని బలోపేతం చేసేందుకు అతి కష్టమైన డక్‌ వాక్‌ (ఇది ఆర్మీ శిక్షణలో ఉంటుంది) చేస్తారు.

చికెన్‌, మటన్‌లకు దూరం...
విజయ్‌కుమార్‌ ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు. ఉదయం ఇడ్లీ, దోశ, చపాతి, మధ్యాహ్నం ప్లేట్‌మీల్స్‌ తీసుకుంటారు. రాత్రి కేవలం చపాతి, ఓ గ్లాసుపాలు తీసుకుంటారు. గతంలో చికెన్‌, మటన్‌ తీసుకున్నప్పటికీ ప్రస్తుతం వాటి జోలికి వెళ్లడం లేదు. వారంలో ఒక రోజు సీ ఫుడ్స్‌ తీసుకుంటారు. ఆకు కూరలు, కాయగూరలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. 
 
22 ఏళ్ల నుంచే వ్యాయామం

22 ఏళ్ల వయస్సు నుంచే వ్యాయామం మొదలు పెట్టిన విజయ్‌కుమార్‌ ఏనాడూ ఆపలేదు. దీంతో ఎప్పుడూ అనారోగ్యం పాలు కాలేదు. దీంతో ఈ వయసులోనూ సిక్స్‌ ప్యాక్‌తో ఆరోగ్యంగా, చలాకీగా ఉంటున్నారు.

మంచి సింగర్‌ కూడా...

సికింద్రాబాద్‌లో ఆటో రీబోరింగ్‌ వ్యాపారం నిర్వహించిన విజయ్‌కుమార్‌ ప్రస్తుతం ఆ బాధ్యతలను వారసులకు అప్పగించి సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. స్నేహా సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఫంక్షన్లలో హర్ట్‌బీట్‌ మ్యూజిక్‌కు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తుంటారు. ఆయన మంచి సింగర్‌ కూడా. తల్లి ప్రేమను తెలిపే పాటను విజయ్‌కుమార్‌ పాడితే ప్రతి ఒక్కరూ తన్మయం పొందాల్సిందే. 

బాడీ బిల్డింగ్‌లో ప్రతిభ...

ఆంధ్రప్రదేశ్‌ బాడీ బిల్డింగ్‌ చాంపియన్‌ షిప్‌లో విజయ్‌కుమార్‌ 75, 80 కేజీల సీనియర్‌ విభాగంలో ద్వితీయ బహుమతిని సాధించారు. తెలంగాణ బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. 

కుటుంబ సభ్యులంతా క్రీడకారులే... 
ఆయన మెట్రిక్‌ కూడా పూర్తి చేయలేదు. అయినా అనర్గళంలా తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లో మాట్లాడతారు. భార్య శారద కూడా భర్త దేహ దారుఢ్యాన్ని చూసి ముచ్చట పడుతుంటారు. పెద్ద కుమారుడు పవన్‌ జాతీయ స్థాయి స్విమ్మర్‌. చిన్న కొడుకు నవీన్‌ అంతర్జాతీయ స్విమ్మర్‌గా రాణిస్తున్నారు. కూతురు వాణి వాలీబాల్‌ జాతీయ క్రీడా కారిణిగా ఎన్నో అవార్డులు సాధించారు. 
 
వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వనందుకే జబ్బులు
హీరో, హీరోయిన్‌లా ఉండాలనుకునే నేటి యువతీ యువకులు వ్యాయామం, ఆహారపు అలవాట్లలో అశ్రద్ధ వహిస్తున్నారు. వ్యాయామం చేయనందు వల్లే డయాబెటిక్‌, ఊబకాయం, గుండె జబ్బుల బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం ఎంతో అవసరం. నేను నిత్యం వ్యాయామం చేస్తూ జిమ్‌లలో, మీడియాలో యువతకు సూచనలు చేస్తుంటా. 
- మందుల విజయ్‌కుమార్‌.