ప్లస్‌ సైజ్‌ యోగా గురు

31-10-2017: ప్లస్‌ సైజులో (బాగా లావుగా) ఉన్నవారు యోగాసనాలకు పనికిరారా? శరీరం వారి అదుపులో లేనప్పుడు యోగాసనాలు ఎలా చేస్తారు? అలాంటప్పుడు యోగాసనాలనే శరీరానికి తగ్గట్టుగా మలుచుకుంటే... ఈ ఆలోచనే భారీకాయంతో బాధపడుతున్న 34 ఏళ్ల డాలీసింగ్‌ను పాపులర్‌ చేసింది. ఇప్పుడంతా ఆమెను ‘ప్లస్‌ సైజ్డ్‌ ఇంటర్నెట్‌ యోగా క్వీన్‌’గా పిలుస్తున్నారు. అంతేకాదు... తాజాగా న్యూఢిల్లీలో నిర్వహించిన ‘అమెజాన్‌ ఇండియా ఫ్యాషన్‌ వీక్‌’లో డాలీసింగ్‌ ర్యాంప్‌వాక్‌ చేసి భారీకాయులకు ఆదర్శంగా నిలిచారు. ‘యోగా’లో సరికొత్త ట్రెండ్‌ సృష్టించిన డాలీసింగ్‌ ‘యోగా క్వీన్‌’గా ఎలా మారిందో... ఆమె మాటల్లోనే...

 
భారీకాయులు యోగాసనాలు చేస్తుంటే ప్రోత్సహించకుండా, ‘నువ్వు ఏనుగులా, ఎలుగుబంటిలా ఉన్నావు’ అని వెకిలి కామెంట్లు చేసే మగవాళ్లు మనదేశంలో ఎక్కువగా కనిపిస్తారు. మొదట్లో ఇంటర్నెట్‌లో ఆ కామెంట్లు చూసి బాధపడినప్పటికీ ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశా.
 
కొన్నేళ్ల క్రితం... కాలి మడమనొప్పితో ఎక్కడికీ వెళ్లలేకపోయేదాన్ని. డాక్టర్లు బరువు తగ్గించుకోమని, రెగ్యులర్‌గా నడవమని చెప్పేవారు. ఉదయం పూట నడుద్దామని ప్రయత్నిస్తే భరించరాని బాధ. అయినా సరే శారీరకంగా బలంగా ఉండేందుకు జుంబా, రన్నింగ్‌ చేస్తుండేదాన్ని.
 
చేయలేనని అన్నారు!
ఒకరోజు అనుకోకుండా యోగా క్లాసుకు హాజరయ్యాను. లావుగా ఉన్న నాతో యోగాసనాలు వేయించడం ఆ టీచర్‌కూ ఒకవిధంగా కొత్త అనుభవమే. యోగాసనాలకు అనుగుణంగా నా చేతులు, కాళ్లు బాగా మడిచి, నాతో ఆసనాలు వేయిస్తూ ప్రోత్సహించారు. ఒకరు మనల్ని ప్రోత్సహిస్తున్నారంటే ఎక్కడలేని ఉత్సాహం వస్తుందంటారు కదా... అది నిజమనిపించింది ఆ క్షణంలో నాకు. అలా నాలుగు నెలల పాటు ఒక యోగా గురువు దగ్గర నా శరీరాన్ని ఆసనాలకు అనుగుణంగా మార్చుకోగలిగాను. అయితే ఆ తర్వాత వచ్చిన గురువు నన్ను నిరుత్సాహపరచడం మొదలెట్టాడు. భారీకాయంతో ఉన్నవాళ్లు యోగాసనాలు చేయలేరని అనేవారాయన. దాంతో నాలాంటి వారికి యోగాసనాలు నేర్పించడానికి ఎవరూ ముందుకురారని ఫిక్సయ్యాను.
 
వీడియోలే గురువులు...
ఇంటర్నెట్‌లో యోగాకు సంబంధించిన వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకుని స్వంతంగా సాధన చేయడం ప్రారంభించా. ఆ వీడియోలన్నీ నాకు ఒక్కో గురువులాగా అనిపించాయి. అప్పటి నుంచి వారంలో ఐదారు సార్లు యోగ సాధన చేయడం ప్రారంభించా. ఒక్కో సెషన్‌ 75 నిమిషాలుంటుంది. ఎక్కడికెళ్లినా యోగామ్యాట్‌ తీసుకువెళ్లడం అలవాటయ్యింది. క్రమంగా యోగాసనాల్లోని మూలసూత్రాలను వదలకుండా వాటికి తగ్గట్టుగా నా శరీరాన్ని మలుచుకోవడం మొదలెట్టాను. ఇప్పుడు ఇంటర్నెట్‌లో నా యోగా వీడియోలు పోస్ట్‌ చేస్తూ వస్తున్నాను.
 
ఔట్‌డోర్‌లోనే ఎందుకంటే...
ఇంటర్నెట్‌లో నా వీడియోలు చూసి చాలామంది ‘ఎలాంటి డైట్‌ తీసుకుంటార’ని అడుగుతుంటారు. ప్రత్యేకంగా డైట్‌ అంటూ ఏమీ ఫాలో అవ్వను. సాధ్యమైనంతవరకు హోమ్‌ఫుడ్‌కు ప్రాధాన్యం ఇస్తా. ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు దూరంగా ఉంటా. బీహార్‌లో పుట్టి, బెంగాల్‌లో పెరిగాను కాబట్టి అక్కడి సత్తూ, చేపలకూర ఇష్టంగా తింటా. భోజనంలో కూరగాయలు ఎక్కువగా తీసుకుంటా. ఒక యూత్‌ఛానల్‌కు ప్రోగ్రామింగ్‌ హెడ్‌గా పనిచేస్తున్నా. ఔట్‌డోర్‌లకు వెళితే... ఫుడ్‌ విషయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తా. ఇంటర్నెట్‌లో నా వీడియోలు చూసి కొందరు అందాల ప్రదర్శన చేస్తున్నానని కామెంట్‌ చేస్తారు కానీ శరీరాన్ని దుస్తులతో పూర్తిగా కప్పేసుకుని యోగా చేయరు కదా! అలాగే ఔట్‌డోర్‌లో యోగా చేయడం ఎందుకనే కామెంట్లు కూడా చూశాను. ముంబయిలో నేనుండే స్టూడియో అపార్ట్‌మెంట్‌లో బాగా ఉక్కపోతగా ఉంటుంది. అందుకే ఒకరోజు యోగామ్యాట్‌, స్పీకర్స్‌, లాప్‌టాప్‌ తీసుకుని పార్క్‌లో యోగా ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభించా. దాంతో వాకింగ్‌ వచ్చిన చాలామంది నా యోగాసనాలు చూసి అభినందిస్తూనే, ‘వెన్నునొప్పి ఉంది... ఎలాంటి ఆసనం వేయాలి?’, ‘మెడనొప్పి ఉంది. సలహా చెప్పండి’ అనేవారు. దాంతో అలాంటివారి కోసం నా యోగాసనాలన్నింటినీ ఇంటర్నెట్‌లో పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఇంటర్నెట్‌లో వాటిని చూస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. నేను పాపులర్‌ అవుతున్నానని అనేకన్నా, ప్లస్‌సైజ్‌లో ఉన్నవారెందరికో ఉత్సాహాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది.
నా దృష్టిలో యోగా ప్రతి ఒక్కరికీ అవసరమే. లావుగా ఉన్న వారు యోగాకు పనికిరారు అనుకోవడం తప్పని ఇప్పటికే రుజువు చేశాను. యోగా శారీరకంగా బలవంతుల్ని చేస్తూనే మానసికబలంగా మారుతుంది. వయసును కూడా మరిపిస్తుంది. 34 ఏళ్ల వయసులో కూడా నా శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా మలుచుకోగలుగుతున్నానంటే అదంతా యోగా ఫుణ్యమే కదా!