వ్యాయామంతో బరువు తగ్గదు

08-12-2017: అధిక బరువును తగ్గించుకోవడానికి వ్యాయామం ఒక్కటే మార్గమని చాలామంది నమ్ముతారు. కానీ వ్యాయామం ఒక్కటి చేస్తే సరిపోదనీ పరిశోధకులు అంటున్నారు. వ్యాయామం చేస్తూనే ఆహార నియమాలు కచ్చితంగా పాటించాలనీ అప్పుడే అధిక బరువు తగ్గించుకోవచ్చని వారు చెబుతున్నారు. వీరు కొంతమంది మహిళల మీద పరిశోధనలు నిర్వహించారు. మొదటి నెల రోజులు వారి చేత వ్యాయామం మాత్రమే చేయించారు. అప్పుడు వారి బరువు, బాడీ మాస్‌ ఇండెక్స్‌లను నమోదు చేశారు. వీరి బరువులో పెద్దగా మార్పును గుర్తించలేదు. తరువాతి నెల రోజులు వ్యాయామంతో పాటు కొవ్వు తక్కువగా ఉండే ఆహారం, తాజా కూరగాయలు, పండ్లు ఇచ్చారు. అనంతరం వీరి బరువు పరిశీలించారు. మొదట నెలరోజుల్లో కన్నా రెండవ నెలలో వీరి బరువులో మార్పును స్పష్టంగా గుర్తించగలిగారు. బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామం ఒక్కటే చేస్తే సరిపోదనీ, కచ్చితమైన ఆహార నియమాలు పాటించాల్సిందేననీ వారు అంటున్నారు. కాకపోతే వ్యాయామం చేసేవారు వైద్యుల సలహా మేరకు ఆహారనియమాలు పాటించాలని వారు స్పష్టం చేస్తున్నారు.