యోగా... కొత్తగా!

28-11-2017: క్యాండిల్‌లైట్‌ యోగా... ఎప్పుడూ విన్నట్టు లేదు కదూ! విదేశాల్లో ఇప్పుడిది నయా ట్రెండ్‌... ముఖ్యంగా బ్రిటన్‌లో! యోగా పుట్టింది భారత్‌లోనైనా అక్కడ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ యోగా ఎడతెరిపిలేని పని ఒత్తిడిలో చిత్తయ్యే వారికి కావల్సినంత ఉపశమనం, మానసిక ప్రశాంతతనిస్తుందట! నమ్మలేకపోతే ఓ వీకెండ్‌లో మీరూ ట్రై చేసి చూడండి.

 
అంతా ప్రత్యేకమే...
పేరుకు తగ్గట్టుగానే సాయంత్రం వేళల్లో చేస్తారీ కొవ్వొత్తుల యోగా! శరీరానికి కాస్తంత వెచ్చదనం, ఉపశమనం కలిగించేందుకు ఒక స్టూడియో లాంటి గదిలో క్రమపద్ధతిగా చుట్టూ కొవ్వొత్తులు పెడతారు. అష్టాంగ, బిక్రమ యోగాలా ఒకదాని తరువాత ఒకటి క్లిష్టమైన విన్యాసాలేమీ చేయనక్కర్లేదు. ఇందులో చాలా మృదువైన, సులువైన ఆసనాలుంటాయి. సమస్యలన్నీ మర్చిపోయి... మానసిక, శారీక ఒత్తిడి, అలసట నుంచి ఉపశాన్నిస్తుందంటున్నారు ఇప్పటికే దీన్ని సాధన చేస్తున్నవారు. శరీరం కంటే మెదడు పైనే ఎక్కువ దృష్టి పెట్టే విధానం దీని ప్రత్యేకత.
 
ప్రమాదకరమైన నీలి రంగు కృత్రిమ కాంతి ప్రభావాన్ని ఇది తగ్గిస్తుంది. మెదడులో నిద్రను రెగ్యులేట్‌ చేసే మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని బ్లూ లైట్‌ నియంత్రిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి ఇది చక్కని సాధనమని యోగా గురువులు చెబుతున్నారు. వారమంతా సైక్లింగ్‌, రన్నింగ్‌, జాగింగ్‌, పనితో గడిపేవారు, ముఖ్యంగా క్షణం తీరిక లేకుండా పనిచేసే నగరాల్లోని వారికి క్యాండిల్‌లైట్‌ యోగా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. ముఖ్యంగా కార్పొరేట్‌ కొలువులతో సతమతమవుతున్న యువతే అధిక సంఖ్యలో ఈ యోగా సాధన చేస్తున్నారు.