వర్షంలో వ్యాయామం!

25-07-2017: వర్షాకాలంలో ఉదయాన్నే నిద్రలేవడం ఒక శిక్షలా ఉంటుంది. శరీరాన్ని అటు లాగి, ఇటు లాగి... ముసుగుతన్ని ఇంకాసేపు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. అలాగని బద్ధకించారో మీ ఫిట్‌నెస్‌ కాస్తా చెట్టెక్కి కూర్చుంటుంది. అందుకని సీజన్‌ ఏదైనా ఫిట్‌నెస్ ను జీవనవిధానంలో ఒక భాగంగా చేసుకోవాల్సిందే అంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు.
వర్షంలో వాకింగ్‌ ఏం చేస్తాం అని వెనుకడుగు వేయొద్దు. వర్షంలో తడిచినంత మాత్రాన పాడైపోయేంత సున్నితమేమీ కాదు మన శరీరం. మంచి వాటర్‌ప్రూఫ్‌... అందుకని వాన చినుకుల్ని ముద్దాడుతూ చక్కగా నడిచేయండి. ఇలా చేయడం వల్ల జీవక్రియలు బాగా జరిగి ఫిట్‌గా ఉంటారు. రోజంతా శక్తివంతంగా ఉండొచ్చు.
ఒకవేళ వర్షం పడేటప్పుడు బయటికి వెళ్లడాన్ని ఇష్టపడకపోతే ఇంట్లోనే స్క్వాట్స్‌, పుషప్స్‌, ప్లాంక్స్‌ ఉన్న ఒక గ్రూపు వ్యాయామాలను అరగంట నుంచి నలభై నిమిషాలు చేయండి. ఇంట్లో తయారుచేసుకునే ఆహారపదార్థాలతో పాటు ఈ సీజన్‌లో లభించే పళ్లు, కాయగూరలు విరివిగా తీసుకోండి. లీన్‌ మీట్‌ (తక్కువ కొవ్వు ఉండే స్కిన్‌లెస్‌ చికెన్‌ వంటివి), కాయధాన్యాలు ఆహారంలో చేర్చండి.
ఈ సీజన్‌లో బట్టలు ఆరడం కష్టం అలాంటిది వానలో నడవమంటున్నారు... ఇక బట్టలు ఆరినట్టే అంటున్నారా. త్వరగా ఆరిపోయే యాక్టివ్‌ చిల్‌ ఫిట్‌నెస్‌ గేర్‌, సాక్స్‌ల వంటి వాటిని వేసుకోండి.
వర్షాకాలంలో రెగ్యులర్‌ రొటీన్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవాలి. త్వరగా పనులు ముగించుకుని కుటుంబం, స్నేహితులతో కలిసి లాంగ్‌ వాక్స్‌, అవుట్‌డోర్‌ గేమ్స్‌ వంటి కార్యక్రమాలు చేయాలి. ఇలా చేయడం వల్ల చురుకుగా, శక్తివంతంగా ఉంటారు ఈ సీజన్‌లో.
సీజనల్‌ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచాలంటే విటమిన్‌లతో కూడిన ఆహారంలో తీసుకోవాలి. ఇలాచేస్తే శక్తి స్థాయిలను సరిగా ఉంచుకోవచ్చు. ఆరోగ్యం సరిగా లేకపోతే ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోవాలి.
యోగ అయితే ఇంట్లో, బయటా ఎక్కడైనా చేయొచ్చు. ఇంట్లో గాలి బాగా వచ్చే ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని యోగ చేయండి. దీని వల్ల వర్షాకాలంలో వచ్చే శ్వాససంబంధిత సమస్యల్ని దూరంగా ఉంచొచ్చు.