జిమ్‌కు వెళ్తున్నారా!

03-08-2017: ఒకప్పుడు కేవలం బాడీ బిల్డింగ్‌పై దృష్టి ఉన్నవాళ్లు మాత్రమే జిమ్‌కు వెళ్లేవాళ్లు. తర్వాతి కాలంలో బరువు తగ్గడం కోసం వర్కవుట్లు చేయడం మొదలైంది. ఇప్పుడు కాలేజ్‌ ఏజ్‌ వచ్చిన కుర్రాళ్లు చాలా మంది జిమ్‌కు సై అంటున్నారు. మెరుగైన శరీరాకృతి కోసం ఫుల్‌గా వర్కవుట్లు చేస్తున్నారు.
 
ఆరోగ్యంపై అవగాహన పెరగడం కూడా యువతను జిమ్‌వైపు నడిపిస్తోంది. బాడీఫిట్‌గా ఉంచడంతో పాటు జిమ్‌కు వెళ్లేవాళ్లు మానసికంగా కూడా ఫిట్‌గా ఉంటున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే జిమ్‌కు వారం రోజులు వెళ్లినంత మాత్రాన తీరైన ఆకృతి రాదు. ఓపికగా వర్కవుట్స్‌ చేస్తుండాలి. అయితే చాలామంది జిమ్‌కు వెళ్లే తొలిరోజుల్లో ఉత్సాహంగా బయల్దేరుతారు. ఓ పదిరోజులు పోగానే డుమ్మాలు కొడుతుంటారు. ఇలాంటి వారు ఎన్ని నెలలు జిమ్‌కు వెళ్లినా ఫలితం అంతగా కనిపించదు. ఆరునెలల పాటు రెగ్యులర్‌గా వెళ్తేగాని బాడీ ఫిట్‌గా మారదని చెబుతున్నారు జిమ్‌ ట్రైనర్లు.
 
డైట్‌ కంట్రోల్‌..
ఎక్సర్‌సైజ్‌ పూర్తయ్యాక ఒక్కసారి నిస్సత్తువగా అనిపిస్తుంది. అందుకు కారణం వర్కవుట్స్‌ తర్వాత శరీరం కెలోరీలతో పాటు కొన్ని బలవర్థకమైన పోషకాలను కోల్పోతుంది. అందుకే వ్యాయామం అయిపోయిన తర్వాత బాగా ఆకలిగా అనిపిస్తుంది. ఆకలిగా ఉందని మళ్లీ రుచికరమైన భోజనంతో పొట్టంతా నింపేస్తే..! బరువు తగ్గకపోగా పెరుగుతాం. జిమ్‌కు వెళ్లడం మొదలుపెట్టాక ప్రొటీన్స్‌ ఎక్కువగా ఉండే డైట్‌ ఫాలో అవ్వాలి. ప్రొటీన్‌ షేక్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. ఇది సాధ్యం కానప్పుడు జిమ్‌ నుంచి వచ్చిన తర్వాత ఉడికించిన ఓట్స్‌, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదాం పుప్ప కలిపి తినాలి. ఒక అరటి పండు, ఒక గ్లాస్‌ పాలు తీసుకున్నా తక్షణ శక్తి పొందవచ్చు. ఉడికించిన గుడ్డును, పొట్టు తీయని తృణ ధాన్యాలతో కలిపి తినడం వల్ల రోజంతటికీ కావాల్సినంత మాంసకృత్తులు అందుతాయి. ఉడికించిన చిలకడదుంపలు రెండు తిన్నా.. రెడిమేడ్‌ ఎనర్జీ వచ్చేస్తుంది. మరెందుకాలస్యం ఈ టిప్స్‌ ఫాలో అవుతూ జిమ్‌కు వెళ్లిపోండి.