ఫిట్‌గా ఉండాలంటే...

03-12-2018: ఫిట్‌నెస్‌ ప్రపంచంలో నవాజ్‌ మోదీ సింఘానియా తెలియని వారుండరు. చాలా నగరాల్లో ‘బాడీ ఆర్ట్‌ ఫిట్‌నెస్‌’ సెంటర్స్‌ నెలకొల్పి ట్రైనర్‌గా, లైఫ్‌స్టయిల్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు ఇస్తూ బిజీగా ఉంటారు. అనేక ఫిట్‌నెస్‌ క్యాంపులను కూడా నిర్వహిస్తుంటారు. ఇటీవల ‘బాడీ ఆర్ట్‌’ టీమ్‌ ట్రైనర్స్‌ 25మందితో కలిసి ‘కాలిస్థెనిక్స్‌’ వర్కవుట్స్‌ మీద సుమారు 1500 మందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆమె మహిళలకు కొన్ని ఫిట్‌నెస్‌ సలహాలిచ్చారు.
 
ప్రతిరోజూ చేసే వర్కవుట్స్‌ చాలారకాలుగా ఉంటాయి. వాటిలో ‘కాలిస్థెనిక్స్‌’కు ప్రత్యేకస్థానం ఉంది. కండరాలను బిగుతుగా, టోనింగ్‌ చేసేందుకు ఇవి పనికొస్తాయి. ఒకవేళ మీరు స్లిమ్‌గా ఉన్నా సరే ఈ వర్కవుట్స్‌ చేస్తే మరింత ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా వెన్ను, మెడ, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ తరహా వర్కవుట్స్‌ బాగా ఉపకరిస్తాయి. చాలామంది నన్ను ఫిట్‌గా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతుంటారు. వారికి కొన్ని సూచనలు ఏమిటంటే...
 
ఆరోగ్యమైన జీవనశైలిని అలవర్చుకుంటేనే ఫిట్‌గా ఉంటారనే వాస్తవాన్ని ముందుగా గుర్తించాలి. చాలామంది ఇష్టమైనవన్నీ తింటూనే బరువు పెరుగుతున్నానని బాధపడుతూ ఉంటారు. వారి బాధ చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఫిట్‌గా ఉండాలనుకుంటే ముందు మన శరీరం ఎలా ఉందో, ఏం చేయాలో ఎవరికివారుగా తెలుసుకోవాలి.
అద్దాలు మాత్రమే నిజాయితీగా మనం ఎలా ఉన్నామో చెబుతాయి. కాబట్టి రూముల్లో (బాత్‌రూమ్‌లో కూడా) అద్దాలు ఉండేలా చూడండి. వాటిలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడల్లా తిండికి సంబంధించిన అలవాట్లను మార్చుకునే వీలుంటుంది. ఫిట్‌గా ఉండాలని కోరుకునే వారు ఈ టిప్స్‌ పాటిస్తే ఫలితం ఉంటుంది.

ఎక్సర్‌సైజ్‌, న్యూట్రిషన్‌ ప్లాన్‌ విషయాల్లో అలసత్వం మంచిది కాదు.

 

ఒకవేళ ఏ రోజైనా వర్కవుట్స్‌ మిస్సవ్వడమో, ఎక్కువ తినడమో జరిగితే కంగారు పడకండి. వాటిని బ్యాలెన్స్‌ చేసే ప్రత్యామ్నాయాలను ఆలోచించి వెంటనే ఆచరణలో పెట్టండి.
ఫిట్‌గా మారాలనుకునే ప్రయత్నంలో మీ శరీరంలో వచ్చే మెరుగైన మార్పులను పట్టించుకోండి. అవి మిమ్మల్ని మోటివేట్‌ చేస్తుంటాయి.
మీ కన్నా ఫిట్‌గా, స్లిమ్‌గా ఉన్నవారితో స్నేహం చేయండి. అప్పుడే వారితో పోటీపడాలనే ఆలోచన వస్తుంది.
గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని ఎక్కువ మోతాదులో తాగండి. మంచి నిద్ర కూడా ఫిట్‌నెస్‌లో భాగమే అని గుర్తించండి.