అకాల మృత్యువును అడ్డుకునే పరుగు?

30-5-2017:సుప్రభాత సమయంలో తీసే పరుగు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే! అయితే ఈ పరుగు అకాల మృత్యువు నుంచి కాపాడుతుందన్న విషయం ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. సుమారు వెయ్యి మంది వ్యాధిగ్రస్తుల మీద పరిశోధనలు చేశారు. వీరందరూ రకరకాల అనారోగ్య సమస్యలతో మృత్యువుకు దగ్గరగా ఉన్నవారే! వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారి చేత ప్రతిరోజూ ఉదయాన్నే కొద్ది సేపు పరుగు తీయించారు. రెండవ గ్రూపు వారిచేత అలాంటిదేమీ చేయించలేదు. కొన్ని రోజుల అనంతరం వీరి ఆరోగ్యాన్ని పరిశీలించారు. పరుగులు తీసిన వారి ఆరోగ్యం మెరుగుపడి అకాల మృత్యువు నుంచి తప్పించుకున్న విషయాన్ని గమనించారు. రోజులో గంటసేపు వారు పరుగు తీస్తే ఏడుగంటల జీవితకాలం పెరగడాన్ని గుర్తించారు. మొత్తం మీద వీరి జీవితకాలం మరో మూడు సంవత్సరాలు పెరిగిందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే వేగంగా పరిగెత్తినా, నెమ్మదిగా పరిగెత్తినా, ఫలితం మాత్రం ఒకటే అని వారు స్పష్టం చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వారు వైద్యుల సలహా మేరకు రన్నింగ్‌ చేస్తే 40 శాతం అకాల మృత్యువునుంచి తప్పించుకోవచ్చు అని అంటున్నారు.