మధ్యవయసు వారు వ్యాయామం చేయకుంటే అంతేసంగతులు

17-08-2017: మధ్య వయసువారు ప్రతీ రోజూ వ్యాయామం చేయకుండా టీవీ చూస్తూ గడుపుతున్నారా... అయితే మీ మెదడు పరిమాణం తగ్గడంతో పాటు పలు అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు బోస్టన్ యూనివర్శిటీ పరిశోధకులు. ఫిట్‌నెస్‌కు మెదడు పరిమాణానికి మధ్య సంబంధముందని తమ పరిశోధనలో తేలిందని  పరిశోధకుడు నికోలీ స్పార్తానో వెల్లడించారు. 40 ఏళ్ల వయసు గల 15వేల మందికి ట్రేడ్ మిల్ టెస్ట్ జరపగా వారిలో వ్యాయామం చేయని వారు హృద్రోగాలు, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. వ్యాయామం చేయని మధ్యవయసు వారికి ఎమ్మారై చేయించగా వారి మెదడు పరిమాణం తగ్గిందని తేలింది. అందుకే వ్యాయామం చేయని మధ్యవయసు వారు మెదడు పరిమాణం తగ్గడంతోపాటు పలు వ్యాధుల బారిన పడే ప్రమాదముందని పరిశోధకులు తేల్చారు. వ్యాయామం చేయకుండా టీవీలకు అతుక్కు పోయేవారు ఇక వాటికి స్వస్తి చెప్పి ఫిట్ నెస్ కు ప్రాధాన్యమివ్వాలని పరిశోధకులు సూచించారు.