కళ్లు జాగ్రత్త..!

ఆంధ్రజ్యోతి, 13-12-2016: కళ్లు నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమస్యలు రాకుండా ముందస్తు పరీక్షలతో పాటు.. తగిన ఆహారం తీసుకోవడంలో శ్రద్ధ అవసరం. 

నేత్ర పరీక్షలు 
మీ ఇంటిల్లిపాదీ కంటి వైద్యుల వద్దకు వెళ్లి కళ్ల పరీక్షలు చేయించుకోండి. కంటి సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలు బయటపడే వీలుంది. ఉదాహరణకు మధుమేహం లాంటివన్న మాట. 
 
సన్‌గ్లాసెస్‌
సూర్యుని నుంచి వెలువడే యువి కిరణాలు మీ కళ్లకు హానికరం. కేవలం వేసవిలోనే కాకుండా.. ఏ కాలంలోనైనా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు గ్లాస్‌ వాడితే మేలు. 
 
పొగ
సిగరెట్లు, బీడీలు, చుట్టలు, హుక్కా వంటివి పీలిస్తే.. కంటికి సంబంధించిన కాటరాక్ట్‌ సమస్యల ముప్పు తప్పదు. చూపును మందగించే జబ్బులు అనివార్యం. 
 
రక్షణ
కంటికి రక్షణ కల్పించే ఐవేర్‌ వంటివి వాడకపోవడం వల్ల.. ఏదో ఒక రకమైన నేత్రగాయాలు అవుతుంటాయి. అమెరికాలో అయితే ఏటా ఇరవై లక్షల పైచిలుకు కేసులు ఇలాంటివే. 
 
విశ్రాంతి
కంప్యూటర్‌, ఫోన్‌, టాబ్‌ వంటివి వాడుతున్నప్పుడు ప్రతి అరగంటకు ఒకసారి కళ్లకు ఇరవై సెకన్లపాటు అయినా విశ్రాంతిని ఇవ్వండి. దీని వల్ల కళ్ల మీద ఒత్తిడి తగ్గుతుంది. 
 
వ్యాయామం
క్రమం తప్పని వ్యాయామం అత్యంత వేగంగా వయసును మీద పడనివ్వదు. తద్వారా కంటి సమస్యలు వయసుతో పాటు అంత వేగంగా దరి చేరవు. 
 
పండ్లు, ఆకుకూరలు 
తాజా పండ్లు, పచ్చటి ఆకుకూరలు, కూరగాయలు తింటుండాలి. ఒమెగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్‌ కలిగిన ఆహారపదార్థాలను తీసుకోవాలి. దీనివల్ల కంటికి కావాల్సినంత తడి దొరుకుతుంది. పొడిబారకుండా ఉంటాయి. 
 
కోడి గుడ్లు
చౌకధరల్లో లభించే కోడిగుడ్లను వీలైనంత ఎక్కువ తీసుకోవాలి. అదీ ఉడకబెట్టిన గుడ్డును తింటే కంటి ఆరోగ్యం బాగుపడుతుంది. ఇందులోని పోషకవిలువలు నేత్ర బలం పెంచుతాయి.