కళ్లు బైర్లు...ఎందుకని?

28-06-2017:నా వయసు 36. ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ఆరోగ్య సమస్యలేమీ లేవు. కాకపోతే ఇటీవల ఆరు మాసాలుగా అప్పుడప్పుడు లేచి నిలబడగానే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. కాసేపట్లోనే మళ్లీ మామూలైపోతోంది. ఎందుకిలా అవుతోంది? దీని వెనకాల ఏమైన పెద్ద కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంలో ఏం చేయమంటారో చెప్పండి.

- వి. అరుణ్‌ కుమార్‌, వరంగల్‌
సాధారణంగా....అప్పటిదాకా కూర్చుని లేదా నిలుచుని ఉండి హఠాత్తుగా లేచి నిలబడినప్పుడు, రక్తం చివ్వున కాలి నరాల్లోకి ప్రవహిస్తుంది. అలాంటి సంద ర్భాల్లో ఆ వ్యక్తి నరాల వ్యవస్థ కాళ్ల నరాలు కుంచించుకునేలా చేస్తుంది. దాంతో రక్తం, గుండెకు సరిపడా వెళుతుంది. అలా కాకుండా,... కాలి నరాల్లోకి రక్తం అధికంగా ప్రవహించి, గుండెకు తిరిగి వెళ్లే రక్తం తక్కువగా ఉన్నప్పుడు గుండెనుంచి మెదడుకు సరిపడేటంత రక్తం వెళ్లదు. దీనితో కళ్లు బైర్లు కమ్మడం, తూలిపడటం లాంటివి జరుగుతాయి. అందువల్ల మీకు బి.పి తక్కువగా ఉండి, హఠాత్తుగా లేచి నిలబడ్డప్పుడు కళ్లు తిరగడం, స్పృహ తప్పడం లాంటి లక్షణాలు కనిపించినప్పుడు మీ లో-బి.పికి వైద్య సంబంధమైన ఇతర కారణాలేమైనా ఉన్నాయేమో తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఆ విషయంలో వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మీకు శ్రేయస్కరం.
 
అయితే, కూర్చుని లేచే సందర్భాల్లో తాత్కాలికంగా ఏర్పడే లో బి.పిని నార్మల్‌ స్థితికి తేవడానికి ఆ వ్యక్తి కొద్ది నిమిషాల పాటు నేల మీద పడుకుంటే సరిపోతుంది. అయితే ఆ సమయంలో తాగడానికి గానీ, తినడానికి గానీ ఏమీ ఇవ్వకూడదు. అతడు లేచి సాధారణ స్థితికి వచ్చాక మాత్రం, మంచి నీళ్లుగానీ, పాలు లేదా టీ, కాఫీలు ఇవ్వవచ్చు.
- డాక్టర్‌ పి. రామారావు, జనరల్‌ ఫిజిషియన్‌