రాజధానికి దృష్టి లోపం

ఆంధ్రజ్యోతి,జనవరి 24:మంచి ఉద్యోగం కావాలనుకున్నా.. మంచి జీవితం పొందాలనుకున్నా.. రాజధానికి చలో అంటారు. అయితే మారుతున్న జీవన విధానం రాజధాని వాసులకు దృష్టిలోపాన్ని కట్టబెడుతోందని తాజా సర్వేలో వెల్లడైంది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే దాదాపు 80 శాతం మంది ఐటీ ప్రొఫెషనల్స్‌ కంటికి సంబంధించిన రుగ్మతలతో ఇబ్బందులు పడుతున్నారట. కంప్యూటర్‌ కొలువులు, జర్నీలో, ఆటవిడుపులో.. ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్లతో దోస్తీ చేస్తుండటమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషిస్తున్నారు నిపుణులు. రాష్ట్ర రాజధాని నగరాల్లోనూ పరిస్థితి ఇదేనని చెబుతున్నారు. మెడికల్‌ డాటా ప్రకారం ప్రతి పదిమంది యువకుల్లో తొమ్మిది మంది ప్రతి రోజూ రెండు గంటలపాటైనా ల్యాప్‌టాప్‌, ఫోన్‌, ట్యాబ్‌.. చూస్తున్నారని తేలింది. వీరిలో పది శాతం మంది వారు మెలకువగా ఉన్న సమయంలో ముప్పావు వంతు కంప్యూటర్‌, ఇతర గాడ్జెట్స్‌తో గడుపుతున్నారట. ఫలితంగా కంటి జబ్బుల పాలపడుతున్నారని సర్వేకారులు చెబుతున్నారు.