జన్యు సంకలనం ద్వారా అంధత్వ నివారణ

సియోల్‌, ఫిబ్రవరి 23:వయసు పైబడుతున్న క్రమంలో ఎదురయ్యే దృష్టి సంబంధిత సమస్యలకు జన్యు సంకలనం ద్వారా చెక్‌ చెప్పొచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ఏజ్‌ రిలేటెడ్‌ మాక్యులర్‌ డిజెనరేషన్‌(ఏఎండీ)గా వ్యవహరించే ఈ సమస్యను జీన్‌ సర్జరీతో పరిష్కరించవచ్చని కొరియా పరిశోధకులు వివరించారు. ఇందుకోసం జీన్‌ ఎడిటింగ్‌ టూల్‌ క్రిస్పర్‌-కాస్‌ 9 ఉపయోగపడుతుందని తెలిపారు. కాగా, చిన్నారుల్లో అంధత్వానికి కారణమయ్యే రెటినోపతి ఆఫ్‌ ప్రిమెచ్యూరిటీ, పెద్దవారిలో కంటి చూపు సమస్యలకు కారణమయ్యే ‘డయాబెటిక్‌ రెటీనోపతి’ని క్రిస్పర్‌-కాస్‌ 9తో నయం చేయవచ్చని వివరించారు. ఈ వ్యాధులకు ప్రస్తుతం యాంటీ వీఈజీఫ్‌ మందుల రూపంలో చికిత్స అందుబాటులో ఉంది. అయితే, వీటి ప్రభావం కొంతకాలం మాత్రమేనని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బేసిక్‌ సైన్స్‌(ఐబీఎస్‌) శాస్త్రవేత్తలు వివరించారు. దీర్ఘకాలిక ప్రభావాల కోసం వీఈజీఎఫ్‌ జన్యు సంకలనం ఒక్కటే మార్గమని చెప్పారు.