కంటి సమస్యల వెనుక మతిమరుపా?

24-05-2018: శరీరంలోని రెండు అవయవాల మధ్య ఉండే అంతర సంబంధాల్ని గమనిస్తే ఒక్కోసారి చాలా ఆశ్చర్యం వేస్తుంది. లేకపోతే... దెబ్బ తిన్న రెటీనా ఆధారంగా వారిలో మతిమరుపు (డిమెన్షియా) సమస్య ఉన్నట్లు తేల్చేయడమేమిటి? ఇటీవలి ఓ అధ్యయనంలో ఈ విషయమే బయటపడింది. రె టీనాలోని రక్తనాళాలు దెబ్బ తినడం అనేది వారిలో మతిమరుపు వ్యాధికి సంకేతంగా కూడా భావించాలని వారంటున్నారు. కొంతమంది పరిశోధకులు ఇటీవల 69 నుంచి 97 ఏళ్లకు మధ్యవయస్కులను వారిని పరిశీలించారు.

అయితే, ఆ వర్గంలోని 50 శాతం కన్నా ఎక్కువ మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్లు స్పష్టమయ్యింది. ఈ రక్తపోటు కారణంగా సహజంగానే కొందరిలో రెటీనాలోని రక్తనాళాలు దెబ్బ తింటాయి. అయితే, ఈ సమస్య ఇక్కడికే పరిమితం అనుకుంటే, అది సరికాదు అంటున్నాయి పరిశోధనలు. ఎందుకంటే ఇలా కంట్లోని రక్తనాళాలు దెబ్బ తిన్న వారి కేంద్రనాడీ వ్యవస్థలోనూ అంటే మెదడులోనూ కొన్ని సమస్యలు ఉంటాయనే మరో నిజం కూడా ఈ సందర్భంగా బయటపడింది. దీని వల్ల కలిగే దుష్ప్రభావం ఏమిటంటే, వీరికి మతిమరుపు వ్యాధి కూడా ఉంటుంది. అందుకే కంటి సమస్యలు తలెత్తిన వాళ్లు అప్పుడప్పుడు న్యూరాలజిస్టును కూడా సంప్రదిస్తూ ఉండాలని పరిశోధకులు చెబుతున్నారు.