కళ్లు మండుతున్నాయా..?

09-09-2018: కంప్యూటర్‌పై గంటల తరబడి పనిచేయడం... లేదా టీవీ, స్మార్ట్‌ఫోన్‌లను అదేపనిగా చూడడం వల్ల కళ్లు కాంతిని కోల్పోయి త్వరగా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. తగినంత విశ్రాంతి లేక కళ్ల చుట్టూ నల్ల వలయాలు ఏర్పడుతాయి. కళ్ల నుంచి నీళ్లు కారడం, కళ్లమంట వంటి సమస్యలను చాలామంది ఎదుర్కొంటున్నారు. వీటికి కొన్ని వంటింటి చిట్కాలు...
రాత్రి నిద్ర పోయే ముందు నువ్వులనూనె/బాదం నూనెను కళ్ల చుట్టూ మసాజ్‌ చేసుకుని ఉదయాన్నే చల్లటి నీళ్లతో కడగాలి. ఇలా చేయడం వల్ల కంటి చుట్టూ ఉన్న నలుపుదనంతో పాటు చర్మంపై ముడతలూ పోతాయి.
కళ్లు విపరీతంగా మండుతుంటే ఐస్‌ముక్కతో కంటి చుట్టూ సున్నితంగా రాయాలి. ఇలా చేయడం వల్ల రిలాక్స్‌ అవుతారు.
కీరదోసలోని కూలింగ్‌ గుణాల వల్ల కళ్ల మంటలు తగ్గుతాయి. బడలికగా ఉన్నప్పుడు కీరదోసను కళ్లపై పెట్టుకోవాలి.
బంగాళదుంప ముక్కలను గుండ్రంగా కోసి గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి రెండు కళ్ల మీద కాసేపు పెట్టుకుంటే కళ్ల ఉబ్బరింపు, దురదలు తగ్గుతాయి.
కళ్ల మంటను తగ్గించడంలో ఉప్పు నీళ్లు బాగా పనిచేస్తాయి. గోరువెచ్చటి నీటిలో కాస్త ఉప్పు వేసి తెల్లని గుడ్డను అందులో ముంచి దానిని కళ్ల మీద వేసుకుని 25 నిమిషాలు అలాగే ఉండాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి.
స్ట్రాబెర్రీలో యాంటాక్సిడెంట్లు ఎక్కువ. ఇవి కళ్ల మంటను తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. తాజా స్ట్రాబెర్రీని ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో రెండు గంటలు పెట్టి వాటిని కళ్ల మీద పదిహేను నిమిషాలు పెట్టుకోవాలి. స్ట్రాబెర్రీ జ్యూసు రోజుకు రెండుసార్లు తాగితే కూడా కళ్ల ఆరోగ్యానికి మంచిది.
దనియాలు కూడా కళ్ల మంటల్ని తగ్గిస్తాయి. గ్లాసు నీటిలో ఒక టీ స్పూను ధనియాలు వేసి రాత్రంతా నాననిచ్చి ఉదయం వడగట్టి ఆ నీళ్లు తాగాలి.
కళ్ల మంటను, వాపును తగ్గించడంలో ఎగ్‌ వైట్‌ బాగా పనిచేస్తుంది. తెల్లసొనను ఒక బౌల్‌లో తీసుకుని అందులో తేనె చుక్కలు వేసి కళ్ల మీద రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత నీటితో కళ్లను శుభ్రంగా కడుక్కోవాలి.