కళ్లు అలసిపోతే?

29-05-2018: కంప్యూటర్‌ ముందు పని చేసినా, ఎక్కువ సేపు టీవీ చూసినా తలనొప్పి వేధిస్తోందంటే కళ్లు అలసటకు గురయ్యాయని అర్థం. ఈ ఇబ్బందికి గురికాకుండా ఉండాలంటే అలసట లక్షణాలను గుర్తించి కళ్లకు విశ్రాంతినివ్వాలి.

కళ్ల మసకలు, తలనొప్పి, కంటి నుంచి నీరు కారటం, కళ్ల మంటలు మొదలైన లక్షణాలు కనిపించాయంటే కళ్లు అలసిపోతున్నాయని అర్థం చేసుకోవాలి. ఇందుకు బోలెడన్ని కారణాలుంటాయి. అవేంటంటే....
‘ఎస్థినోపియా’ అనే కళ్ల అలసటకు కంప్యూటర్‌, స్మార్ట్‌ ఫోన్‌ వాడకం ప్రధాన కారణాలు. వీటితోపాటు చిన్నవిగా ముద్రించిన అక్షరాలను చదవటం, తగిన వెలుతురు లేని చోట కూర్చుని చదవటం మొదలైన అలవాట్ల వల్ల కంటి కండరాల మీద ఒత్తిడి పడి కళ్లు అలసటకు లోనవుతాయి. దాంతో డబుల్‌ ఇమేజ్‌, తలనొప్పి, మైల్డ్‌ మ్రైగ్రేన్‌ లాంటి లక్షాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు కళ్ల మీద పడే ఒత్తిడిన తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం....
కంప్యూటర్‌ ముందు గంటలతరబడి పనిచేసే వాళ్లు ప్రతి రెండు గంటలకోసారి పని ఆపేసి కనీసం 10 నిమిషాలపాటైనా కళ్లకు విశ్రాంతినివ్వాలి.
దూరం, దగ్గిర వస్తువులను మార్చి మార్చి చూసే కంటి వ్యాయావలు చేయాలి.
కళ్లను మూసి రెండు దోసిళ్లను కళ్ల మీద ఉంచి మోచేతులను టేబుల్‌ మీద ఆన్చి 5 నిమిషాలుండాలి. ఇలా చేస్తే కళ్లకు విశ్రాంతి దొరుకుతుంది.
చల్ల నీళ్లలో తడిపి పిండిన దూదిని మూసిన కను రెప్పల మీద ఐదు నిమిషాలపాటు ఉంచితే కళ్ల మంటలు తొలగిపోతాయి.
కంటి నుంచి నీరు కారుతున్నా, దురదలు పెడుతున్నా కళ్లు నులుముకోకుండా వైద్యుల్ని సంప్రదించాలి.
మెడికల్‌ షాపులో దొరికే ఐ డ్రాప్స్‌ను వైద్యుల ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా వాడకూడదు.
రోజుకి కనీసం 7 గంటలపాటైనా నిద్రపోవాలి.