కంప్యూటర్‌ వాడతారా? అయితే ఇది మీ కోసమే!

06-11-2017: ఎక్కువ సమయం కంప్యూటర్‌ మీద పని చేస్తున్నవాళ్ళలో కళ్ళ సమస్యలు చాలా కామన్‌. ప్రత్యేకించి ఐటి నిపుణుల్లో డెబ్భై ఆరు శాతం మంది, అంటే ప్రతి పదిమందిలో కనీసం ఏడుగురికి పైగా నేత్రాలకు సంబంధించిన సమస్యలతో సతమతమైపోతున్నారు. ఆధునిక జీవనశైలి తెచ్చిన ఇక్కట్లలో ఇదొకటి.

 
ఏ సమస్యలొస్తాయి?
మన శరీరంలోని అతి సున్నితమైన భాగం కన్ను. గంటలకు గంటలు కంప్యూటర్లూ, ల్యాప్‌టాప్‌ల దగ్గర కదలకుండా కూర్చొనేవాళ్ళకు ఎదురయ్యే ప్రధాన సమస్యలు- కళ్ళు బాగా అలిసిపోవడం, ఎర్రబడడం, మంటపెట్టడం, పొడిబారిపోవడం, కంటి చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడడం!
 
ఎందుకొస్తాయి?
కంప్యూటర్‌ తెరకు చాలా దగ్గరగా కళ్ళు ఉంచి పని చేసే వారి నేత్రాలు పొడిబారడం లాంటి ఇబ్బందులకు గురవుతాయి. రాత్రిళ్ళు ఎక్కువసేపు మేలుకొని కంప్యూటర్లూ, ల్యాప్‌టాప్‌ల ముందు పనిచేస్తూ ఉంటే కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు తయారవుతాయి. కాలం గడిచేకొద్దీ కళ్ళలో క్యాటరాక్ట్‌ పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
 
ఏం చెయ్యాలి?
కంప్యూటర్‌ తెర మీద అదే పనిగా దృష్టి నిలపకండి. తరచూ మీ కళ్ళను మూస్తూ ఉండండి. లేదా అప్పుడప్పుడు వాటిని పక్కకు తిప్పుతూ ఉండండి. రెప్పల్ని ఆర్పుతూ ఉండండి.
పని మధ్య కాసేపు విరామం తీసుకోండి. దూరంగా ఉన్న వస్తువులను కాసేపు చూడండి.
కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ నుంచి వెలువడే హానికరమైన కిరణాలు మీ కళ్ళకు ప్రమాదకరం. కాబట్టి మానిటర్‌కు స్ర్కీన్‌ గార్డ్చ్‌ ఉపయోగించండి.
ఆ కిరణాలు నేరుగా మీ కళ్ళలోకి చొరబడకుండా డమ్మీ కళ్ళద్దాల్లాంటివి పెట్టుకోవచ్చు.
స్ర్కీన్‌ రిజల్యూషన్‌, మానిటర్‌ పొజిషన్‌, బ్రైట్‌నెస్‌ లాంటివి సరిగ్గా ఉండేలా చూసుకోండి.
కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతంలో మసాజ్‌ చేసుకుంటే, కండరాలు రిలాక్స్‌ అవుతాయి.
రీడింగ్‌ గ్లాసెస్‌ ఉపయోగించడం కూడా కళ్ళకు మేలు కలిగిస్తుంది.
కళ్ళకు ఏమాత్రం ఇబ్బంది అనిపించినా వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. కళ్ళకు అద్దాలు వస్తాయనో... మరో కారణంతోనో మీ సమస్యకు చికిత్స చేయించుకోకపోతే ఆ తరువాత విచారించాల్సి వస్తుందని మరచిపోవద్దు.
నేత్రాల ఆరోగ్యానికి దోహదం చేసే విటమిన్లు ఉన్న ఆహారాన్ని మీ భోజనంలో భాగం చేసుకోండి.