లేజర్‌ సర్జరీ కంటికి కొత్త చూపు

ఆంధ్రజ్యోతి, 20-12-2016: కళ్లజోడు పెట్టుకోవడం అందానికి అడ్డంకిగా, అంతకుమించి చిన్నతనంగా భావిస్తాం.కాంటాక్ట్‌లెన్స్‌తో మేనేజ్‌ చేద్దామంటే వాటికీ ఇబ్బందులుఉన్నాయి. ఈ రెండిటికీ ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వచ్చిన చికిత్సే ‘లేజర్‌ సర్జరీ’. దీంతో దృష్టిలోపాల్ని సరిదిద్దుకోవచ్చంటున్నారు కాటరాక్ట్‌ అండ్‌ లాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌. శ్రీలక్ష్మి నిమ్మగడ్డ.

 
అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంటుందిరా! మంచి రంగు, ఒడ్డూ పొడవూ! కావాలంటే చూడు. అంటూ అమ్మ చెప్పగానే హుషారుగా ఫొటో అందుకున్నాడు హరి. ‘నిజమే! అమ్మాయి చాలా బాగుంది. కానీ.. ముఖానికి ఆ కళ్లజోడు లేకపోతే ఇంకా బాగుండేది’. ఫొటో చూడగానే హరి నోటి వెంట వచ్చిన మాటలివి. కళ్లజోడుతో వచ్చిన చిక్కే ఇది. అందానికి అడ్డుపడుతుంది. వయసును పెంచుతుంది. కళ్లజోడు వాడేవాళ్లు సరదాకైనా కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుని తిరగలేరు. ఈత లాంటి ఆటల్లో పాల్గొనలేరు. ఇలా కళ్లజోడు వాడకంలో చాలా ఇబ్బందులే ఉన్నాయి. అలాగని కళ్లజోడు లేకుండా సర్దుకుపోవాలంటే కుదరని పరిస్థితి. ఒకసారి కళ్లకు జోడు వచ్చిందంటే జీవితాంతం తోడుండాల్సిందే! ప్రత్యామ్నాయంగా కాంటాక్ట్‌ లెన్స్‌లు ఉన్నా వాటికుండే ప్రతికూలతలు వాటికున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా అందుబాటులోకొచ్చిన ఆధునిక చికిత్సా విధానమే కరెక్టివ్‌ లేజర్‌ సర్జరీ.
 
లేజర్‌ సర్జరీ అవసరం 
దృష్టిలోపాన్ని సరిదిద్దే ‘లేజర్‌ సర్జరీ’ ఓ ప్రత్యామ్నాయం మాత్రమే! కళ్లజోడు, కాంటాక్ట్‌లెన్స్‌, పర్మనెంట్‌ లెన్స్‌, లేజర్‌ సర్జరీ.. ఈ ఆప్షన్స్‌లో లేజర్‌ సర్జరీనే ఎంచుకోవటానికి ఒక్కొకరికి ఒక్కో కారణం ఉంటుంది. కొందరి పెళ్లికి కళ్లజోడు అడ్డు రావొచ్చు. కొన్ని ఉద్యోగాలకు కళ్లజోడే ప్రతిబంధకం కావొచ్చు, ఇంకొందరికి హైపవర్‌ కారణంగా కళ్లజోడు లేనిదే అడుగు వేయలేని పరిస్థితి ఉండొచ్చు.. ఇలా కాస్మటిక్‌ పరంగా, కెరీర్‌, హాబీలు కారణంగా మిగతా ఆప్షన్స్‌ బదులుగా లేజర్‌ సర్జరీనే ఎంచుకోక తప్పటం లేదు. లేజర్‌ ట్రీట్‌మెంట్‌లో ‘ఆప్టిమైజ్‌డ్‌ వేవ్‌ ఫ్రంట్‌ గైడెడ్‌’, ‘బ్లేడ్‌ ఫ్రీ లేసిక్‌’ అనే అత్యాధునిక సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. పాత పద్ధతి వల్ల సర్జరీ తర్వాత లైట్‌ చూసినప్పుడు దాని చుట్టూ వలయాలు, కాంతి పుంజాలు కనిపించటంలాంటి ఇబ్బందులు కొంతకాలం బాధించేవి. ఇప్పుడు ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ తగ్గిపోయాయి. కచ్చితత్వం పెరిగింది.
 
అతి ముఖ్యమైన ‘స్ర్కీనింగ్‌ టెస్ట్‌’ 
లేజర్‌ సర్జరీకి ముందు చేసే స్ర్కీనింగ్‌ టెస్ట్‌ ఎంతో కీలకమైనది. ఈ పరీక్ష ద్వారా కార్నియా ఆకారం? సర్జరీ అవసరం ఎంత? ఎలాంటి సర్జరీ అవసరం? సర్జరీ వల్ల కార్నియా టిష్యూ ఎంతమేరకు బలహీనపడుతుంది? సర్జరీ తదనంతర ఫలితంలాంటి విషయాలు తెలుస్తాయి. కొందరికి దృష్టిలోపం జన్యుపరంగా ఉండొచ్చు. ఇంకొందరికి కార్నియాలో వంపు ఉండొచ్చు. కొందరికి కార్నియా పలుచగా ఉండొచ్చు. మరికొందరికి సర్జరీ తర్వాత కొంత కాలానికి మళ్లీ దృష్టిలోపం తలెత్తే అవకాశం ఉండొచ్చు. ఈ విషయాలన్నీ స్ర్కీనింగ్‌ టెస్ట్‌ ద్వారా ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ పరీక్ష ఫలితాన్ని బట్టి తగిన సర్జరీ ఎంచుకోవలసి ఉంటుంది.
 
సర్జరీలో ఏం చేస్తారంటే? 
మైనస్‌ పవర్‌ ఉంటే ఎత్తుగా ఉన్న కార్నియా లోపలి పొరను చదునుగా చేయటం, ప్లస్‌ పవర్‌ ఉంటే కార్నియా లోపలి పొర లోతును పెంచటం చేస్తారు. ఇందుకోసం లేజర్‌ను వాడి కార్నియా టిష్యూని కొంతమేరకు తొలగిస్తారు.
 
వేర్వేరు పద్ధతులు 
దృష్టిలోపం, కార్నియా స్వరూపాలను బట్టి లేజర్‌ చికిత్సలో వేర్వేరు పద్ధతులను అవలంబించాల్సి ఉంటుంది. సర్జరీ మొదటి దశలో కార్నియా ఫ్లాప్‌ను కట్‌ చేయటానికి బ్లేడ్‌ లేదా లేజర్‌ వాడతారు. బ్లేడ్‌ వాడితే ‘వేవ్‌ ఫ్రంట్‌ గైడెడ్‌ సర్జరీ’ అని, లేజర్‌ వాడితే ‘బ్లేడ్‌ ఫ్రీ లేజర్‌’ అని సర్జరీలకు పేర్లుంటాయి. ఈ రెండు పద్ధతులు సర్జరీ మొదటి దశ వరకే! రెండో దశలో చేసే కరెక్షన్‌ రెండు రకాల సర్జరీల్లో ఒకే రకంగా ఉంటుంది. లాసిక్‌లో అనుసరించే మరో పద్ధతి పి.ఆర్‌.కె. ఈ సర్జరీ కార్నియా పైపొర లేపకుండా దాన్ని స్ర్కేప్‌ చేస్తారు. రెండో దశలో మిగతా పద్ధతుల్లోలా కరెక్షన్‌ చేస్తారు. కొన్ని కార్నియాలకు ఫ్లాప్‌ లేపే పద్ధతి వల్ల రిస్క్‌ ఉంటుంది. అలాంటివాళ్లకి పి.ఆర్‌.కె పద్ధతి అనుకూలం. -10 వరకూ దృష్టిలోపం ఉన్నవాళ్లకు లాసిక్‌ సర్జరీ, -6 వరకూ దృష్టిలోపం ఉన్నవాళ్లకు పి.ఆర్‌.కె సర్జరీలు చేయొచ్చు. కొందరికి ఆస్టిగ్మాటిజం అనే సమస్య ఉంటుంది. కార్నియా మరీ ఎక్కువ వంపు తిరిగి ఉండే వీళ్లకు పి.ఆర్‌.కె కంటే లాసిక్‌ అనుకూలంగా ఉంటుంది.
 
కోలుకునే కాలం 
లేజర్‌ సర్జరీ రకాన్ని బట్టి కోలుకునే కాలవ్యవధిలో కొన్ని తేడాలుంటాయి. లాసిక్‌లో కార్నియా పై పొర ఎపీథీలియం, దాని అడుగునున్న పల్చని పొరని కలిపి ఫ్లాప్‌లా లేపి సర్జరీ చేస్తారు. ఈ పద్ధతిలో ఎపీథీలియం డిస్టర్బ్‌ కాదు. కాబట్టి కోలుకోవటానికి తక్కువ సమయం పడుతుంది. కంఫర్ట్‌ లెవెల్‌ ఎక్కువగా ఉంటుంది. ఉదయం సర్జరీ చేస్తే సాయంత్రానికి చూపు క్లియర్‌ అవుతుంది. కానీ పి.ఆర్‌.కెలో ఎపిథీలియం అనే పొరను స్ర్కేప్‌ చేస్తారు కాబట్టి ఆ పొర తిరిగి తయారవడానికి సమయం పడుతుంది. కాబట్టి సర్జరీ తర్వాత చూపు స్పష్టంగా రావటానికి వారం రోజుల సమయం పడుతుంది. 3,4 రోజుల వరకూ కొంత ఇబ్బంది ఉంటుంది. రెండు రకాల సర్జరీల్లో కళ్లు పొడిబారటం ప్రధానమైన దుష్ప్రభావం. దీన్ని లూబ్రికెంట్‌ డ్రాప్స్‌తో సరిదిద్దొచ్చు. సర్జరీ తర్వాత శుభ్రత పాటిస్తూ, ఐ డ్రాప్స్‌ వాడుతూ, కళ్లు నులుముకోకుండా ఉంటే రోజుల వ్యవధిలోనే చూపు సాధారణ స్థితికొస్తుంది. సర్జరీ తర్వాత 3,4 రోజులు వెలుగు చూడటం ఇబ్బంది అనిపిస్తే చలువ కళ్లద్దాలు వాడొచ్చు. అన్ని రకాల ఆహారం తీసుకోవచ్చు. టివి కూడా చూడొచ్చు. మధుమేహం ఉన్నవాళ్లు షుగర్‌ని అదుపులో ఉంచుకోవాలి.
 
 దృష్టిలోపం అంటే?
దూరదృష్టిలోపం - (మైన్‌స)లో ఉంటుంది. 90% మందిలో ఈ రకం దృష్టిలోపం ఉంటుంది. మిగతా 10% మందిలో + (ప్లస్‌) అంటే దూరదృష్టితోపాటు, హ్రస్వదృష్టిలోపం ఉంటుంది. మిగతా అవయవాల్లాగే కనుగుడ్లు కూడా జన్యుపరంగానే సంక్రమిస్తాయి. వాటి ఆకారంలో తేడాలు, పెరుగుదల వల్ల దృష్టిలోపం చిన్న వయసులోనే బయట పడుతుంది. అలాగే కనుగుడ్డు సైజు పెరిగినా దృష్టిలోపం తలెత్తుతుంది. నార్మల్‌ సైజుకి మించి పెద్ద కనుగుడ్డు ఉన్నవారికి మైనస్‌ పవర్‌, అంతకంటే తక్కువ ఉన్నవాళ్లకి ప్లస్‌ పవర్‌ వస్తుంది. జన్యుపరంగా వచ్చే దృష్టిలోపాల్లో ఎక్కువగా కనిపించేది మైనస్‌ పవర్‌. ఒకవేళ కనుగుడ్డు నార్మల్‌గానే ఉన్నా 40 ఏళ్లు దాటినవారికి హ్రస్వదృష్టిలోపం తలెత్తవచ్చు. 
 
హ్రస్వదృష్టి సరిదిద్దాలంటే? 
దగ్గరివి కనిపించని వాళ్లకి ప్లస్‌ పవర్‌ కళ్లద్దాలతో స్పష్టంగా కనిపించేలా చేయొచ్చు. ఇలాంటివాళ్లు లేజర్‌తో సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవాలనుకుంటే అందుకూ సర్జరీ ఉంది. ఇలాంటివాళ్లకు డామినెంట్‌ ఐ కి కాకుండా నాన్‌ డామినెంట్‌ ఐ కి కరెక్టివ్‌ సర్జరీ చేస్తారు. దాంతో విడివిడిగా కాకుండా రెండు కళ్లతో కలిపి చూసినప్పుడు (మోనో విజన్‌) దృష్టిలోపం అనిపించదు. అయితే ఇందుకు 45 ఏళ్ల వయసు దాటాల్సిందే! వెలుగు పెంచినా, చదివే యాంగిల్‌ మార్చినా చదవలేకపోతున్నప్పుడు మాత్రమే లేజర్‌ సర్జరీని వైద్యులు సూచిస్తారు.
 
రెండోసారి లేజర్‌ సర్జరీ
దృష్టిలోపం పూర్తి స్థాయికి చేరుకున్న తర్వాతే లేజర్‌ సర్జరీని సూచిస్తారు. అయితే పెళ్లిలాంటి వ్యక్తిగత అవసరాల కోసం అంతకంటే ముందుగానే ఈ సర్జరీని ఆశ్రయించేవాళ్లు ఉంటారు. ఇలాంటి వాళ్లకు స్ర్కీనింగ్‌ టెస్ట్‌లోనే దృష్టిలోపం పెరిగే అవకాశమున్న విషయం తెలిసిపోతుంది. సర్జరీ చేసిన కొంతకాలానికి సైట్‌ సమస్య తలెత్తే అవకాశమున్నప్పుడు, ఆ విషయం తెలిసి సర్జరీ కోసం ముందుకొచ్చినప్పుడు సాధకబాధకాలు వివరించి వైద్యులు సర్జరీ చేస్తారు. అయితే రెండోసారి సర్జరీ అందరికీ వీలు కాకపోవచ్చు. కార్నియా లోపలి పొర మందంగా, ఆరోగ్యంగా ఉంటే ఫర్వాలేదు. లేదంటే రెండో సర్జరీకి కళ్లజోడు, కాంటాక్ట్‌లెన్స్‌తో సరిపెట్టుకోవలసిరావొచ్చు. అయితే కేవలం 5% మందికి మాత్రమే రెండోసారి సర్జరీ అవసరం రావొచ్చు.