కళ్లకూ ఉందో డైట్‌ప్లాన్‌!

26-04-2018: వేసవిలో కంటి రక్షణకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కళ్ల విషయంలో కేర్‌ఫుల్‌గా లేకుంటే అవి పొడిబారి ఇరిటేషన్‌ తెప్పిస్తాయి. దురద, మంటతో పాటు కళ్ల కింద నల్లటి చారలు కూడా ఏర్పడతాయి. వివిధ రకాల అలర్జీల నుంచి కళ్లను కాపాడుకోవాలంటే డైట్‌లో ఇవి ఉండాల్సిందే అంటున్నారు ఢిల్లీకి చెందిన ప్రసిద్ధ నేత్ర చికిత్స వైద్యులు మినాల్‌ కౌర్‌.

ఆకుకూరల్లో సహజంగానే విటమిన్‌ సి, ఎ, బేటా కెరోటిన్‌, లూటీన్‌, జీక్సాథిన్‌లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటాక్సిడెంట్లుగా పనిచేస్తూ కళ్లకు సహజసిద్ధమైన సన్‌స్ర్కీన్‌గా పనిచేస్తాయి. సూర్యకాంతిలో ఉండే యు.వి. కిరణాల నుంచి కళ్లను రక్షించడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
ట్యూనా, మకెరెల్‌, సాల్మన్‌ వంటి చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉంటాయి. కళ్లు త్వరగా పొడిబారే లక్షణమున్న వారు ఈ చేపలు తినడం వల్ల ఆ బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. పైగా కంటి ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి కూడా.
కంటి భాగంలోని రక్తనాళాలు యాక్టివ్‌గా పనిచేయడానికి విటమిన్‌ సి, బయోఫ్లేవనాయిడ్స్‌ చాలా అవసరం. నారింజ వంటి నిమ్మజాతి పండ్లలో ‘సి’ విటమిన్‌ బాగా లభిస్తుంది. కావున వేసవిలో నారింజ పళ్లు అధికంగా తినడం వల్ల కనుగుడ్డు పొడిబారకుండా, క్యాటరాక్ట్‌ సమస్య నుంచి బయటపడొచ్చు.
కార్నియాను కాపాడాకోవాలంటే డైరీ ఉత్పత్తులు కూడా అవసరమే. వీటిలో విటమిన్‌ ఎ, జింక్‌ ఉంటాయి కాబట్టి రాత్రిళ్లు కంటి చూపు మందగించదు. కంటి చుట్టూ జరిగే 500కు పైగా బయో కెమికల్‌ రియాక్షన్ల నుంచి జింక్‌ రక్షిస్తుంది.
కంటి రక్షణకు గుడ్డును మించిన ఆహారం లేదు. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్‌ ఎ, లూటీన్‌, జింక్‌, జీక్సాథిన్‌లు ఆకుకూరల్లో కన్నా ఎక్కువగా ఉంటాయి. కావున వేసవిలో గుడ్లు తినడం వల్ల కళ్లను సంరక్షించుకోవచ్చు.